వివరాలు సేకరిస్తున్న అధికారులు
విజయనగరం ఫోర్ట్ : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అధికారులు పదేపదే చెబుతున్నా బాల్య వివాహాలు మాత్రం ఆగడం లేదు. పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియని వయసులో తాళి కట్టేస్తున్నారు. శుక్రవారం జరిగిన వివాహంలో ఇద్దరూ మైనర్లు కావడం విశేషం. దీంతో బాల్యవివాహా నిరోధక అధికారులు పట్టణంలోని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలికకు విశాఖపట్నం కంచరపాలెంనకు చెందిన 18 ఏళ్ల బాలుడికి కంటోన్మెంట్‌లోని బాపిస్టు చర్చిలో వివాహం జరిగింది. అయితే ఈ విషయాన్ని అజ్ఞాత వ్యక్తి ఒకరు చైల్డ్‌లైన్ ట్రోల్ ఫ్రీ నంబర్ 1098కు సమాచారం అందించారు. ఈ సమాచారాన్ని చైల్డ్‌లైన్ సభ్యులు బాల్యవివాహా నిరోధక అధికారులకు తెలియజేశారు.
వెంటనే బాల్య నిరోధక అధికారులు, పోలీసులు, బాలల సంక్షేమ కమిటీ, చైల్డ్‌లైన్, డీసీపీయూ సభ్యులు వివాహం జరిగిన చర్చి వద్దకు వెళ్లారు. బాల్య వివాహం చేయడం చట్టరీత్యా నేరమని చెప్పి వారిని చైల్డ్‌లైన్ కార్యాలయానికి తీసుకుని వచ్చి బాలల సంక్షేమకమిటీ ముందు ప్రవేశ పెట్టారు. బాల్య వివాహ నిరోధక అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కార్యక్రమంలో బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ వి.లక్ష్మణ్, సభ్యులు పట్నాయక్, వరలక్ష్మి, సుధ, చిట్టియ్య, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రాధిక, చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ రంజిత, యాళ్ల నాగరాజు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment