వెల్లివిరిసిన సేవాభావం
ఒంగోలు, న్యూస్‌లైన్ : బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నగరంలోని కేంద్రీయ విద్యాలయలో గురువారం నిర్వహించిన బాలల వైద్య శిబిరం విజయవంతమైంది. కేంద్రీయ విద్యాలయతో పాటు నగరంలోని పలు ప్రైవేటు పాఠశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు వైద్య శిబిరానికి హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన 50 మంది వైద్యులు తమ సేవలందించారు. దృష్టి, దంత, వినికిడి తదితర పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా ఔషధాలు అందించారు. వైద్య శిబిరాన్ని వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. తొలుత వాయిద్యాలు, పుష్పాలతో బాలినేనికి విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి, జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాలలనుద్దేశించి బాలినేని మాట్లాడారు. అన్నిటికన్నా ముఖ్యం ఆరోగ్యమని, అందరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల వరదల తాకిడికి జిల్లాలోని అన్ని ప్రాంతాలూ తీవ్రంగా నష్టపోయాయని, ఊహించని విధంగా అనేక కాలనీలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలో నీట మునిగిన కాలనీల్లోని బాలలు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్న సంకల్పంతో వైఎస్సార్సీపీ వైద్య విభాగం బాలల దినోత్సవం రోజు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం శుభపరిణామమన్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రికాగానే ఆయన డాక్టర్ కనుక ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేదల ఆరోగ్యానికి ఎనలేని భరోసా కల్పించారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తోందని చెప్పారు. జిల్లాలో మొట్టమొదటిసారిగా బాలల కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమంటూ నిర్వాహకులను బాలినేని ప్రోత్సహించారు. వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ నెహ్రూ జయంతి రోజు బాలల కోసం వైద్య శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే బాలి నేనికి కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సీహెచ్ ప్రసాదరావు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ యాదాల అశోక్‌బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకూ తమ విభాగం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమా లు నిర్వహించినట్లు చెప్పారు.
బాలల వైద్య శిబిరానికి తమ విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శివభరత్‌రెడ్డి కూడా హాజరయ్యారంటూ ఆయన్ను బాలల కు పరిచయం చేశారు. వివిధ కార్పొరేట్ వైద్యశాలల్లో పని చేస్తున్న సుమారు 50 మంది వైద్యులు మెడికల్ క్యాంపునకు విచ్చేశారని, బాలలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఆశోక్‌బాబు కోరారు. అనంతరం తలసీమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల అవసరార్థం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.దీన్ని బాలినేని ప్రారంభించగా ఒంగోలు రెడ్‌క్రాస్ సిబ్బంది వచ్చి రక్తాన్ని సేకరించారు. కేంద్రీయ విద్యాలయంలో తన నిధులతో ఏర్పాటు చేసిన అదనపు తరగతి గదులను బాలినేని ప్రారంభించారు.
కార్యక్రమంలో మాంటిస్సోరి, కేంద్రీయ విద్యాలయం, కేరళ మో డల్ స్కూల్, అపెక్స్ పాఠశాలల విద్యార్థులతో పాటు వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, నరాల రమణారెడ్డి, కొఠారి రామచంద్రరావు, తాటితోటి నరశింగరావు, పార్టీ సంతనూతలపాడు నియోజవకర్గ సమన్వయకర్తలు అంగలకుర్తి రవి, డాక్టర్ వరికూటి అమృతపాణి, బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, సేవాదళ్ జిల్లా కన్వీనర్ ఆవుల చంద్రశేఖరరెడ్డి, సేవాదళ్ జిల్లా అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ స్వర్ణ రవీంద్రబాబు, మైనార్టీ సెల్ జిల్లా కన్వీనర్ షేక్ ఖాజా, ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర నాయకురాలు రమాదేవి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నగర అధికార ప్రతినిధి రొండా అంజిరెడ్డి, నాయకులు సింగరాజు వెంకట్రావు, బడుగు ఇందిర, తోటపల్లి సోమశేఖర్, మీరావలి, ఎస్వీ రమణయ్య, ఏపీటీసీఏ రాష్ట్ర నాయకులు మాంటిస్సోరి ప్రకాశ్‌బాబు, కేరళ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ పాల్గొన్నారు.