ఇక పిల్లల్ని దత్తత ఇవ్వం!
కోల్కతా: కరుణామూర్తి మదర్ థెరిస్సా 65 ఏండ్ల కిందట స్థాపించిన ద మిషినరీస్ ఆఫ్ చారిటీ సంస్థ పిల్లల్ని దత్తత ఇవ్వడం మానుకోవాలని నిర్ణయించింది. పిల్లల దత్తత విషయమై కేంద్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాల నేపథ్యంలో రెండు నెలల కిందటే ఈ నిర్ణయం తీసుకున్నా.. దానిని శనివారం ప్రకటించింది. తమ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న అనాథ, అభాగ్య పిల్లల బాగోగులు చూసుకోవడానికి ముందుకొచ్చేవారికి మిషినరీస్ ఆఫ్ చారిటీ సంస్థ వారిని దత్తత ఇచ్చేది.
మేనకాగాంధీ నేతృత్వంలోని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వశాఖ పిల్లల దత్తత విషయమై కొన్ని నిబంధనలతో తాజా మార్గదర్శకాలను జారీచేసింది. ఈ నేపథ్యంలో మదర్ థెరిస్సా నిర్దేశించిన ప్రమాణాలను అమలుచేస్తూ నూతన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవడం కష్టం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మిషనరీ ఒక ప్రకటనలో తెలిపింది. తాము నిర్వహిస్తున్న అడాప్షన్ కేంద్రాలను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. మిషనరీకి 19 అడాప్షన్ కేంద్రాలు ఉన్నాయి. సింగిల్ పేరెంట్, గే, లెస్బియన్ వంటివారికి పిల్లల్ని దత్తత ఇవ్వరాదని చారిటీ వ్యతిరేకించిందనే వార్తలు వచ్చాయి. అయితే 2011 మార్గదర్శకాల్లోనూ, 2015 మార్గదర్శకాల్లోనూ సింగిల్ పేరెంట్కు దత్తత ఇవ్వవచ్చునని సూచించింది. అయితే గే, లేస్బియన్ వంటివారి గురించి ప్రస్తావించలేదు.