స్టెప్పులతో అదరగొట్టిన టీమిండియా ఆటగాళ్లు
ముంబయి: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్, మరో ఛారిటీ సంస్థ స్మైల్ ఫౌండేషన్ తో చేతులు కలిపింది. ముంబయి నగరంలో శుక్రవారం రాత్రి క్రికెటర్ విరాట్ కోహ్లీ టీమిండియా ఆటగాళ్లతో పాటు మరికొందరు సెలబ్రిటీలు ఛారిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాషింగ్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీలు స్టెప్పులతో అదరగొట్టారు. వీరికి తోడు యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా జత కలిసి తన డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు. నిరుపేద చిన్నారులు, యువతలో స్పూర్తి పొంపేందించేందుకు ఈ ఈవెంట్ నిర్వహించారు. దాదాపు 4 లక్షల మంది చిన్నారులకు విద్య, నిరుద్యోగులకు శిక్షణ లాంటి కార్యక్రమాల కోసం శ్రీకారం చుట్టారు.
భారతదేశంలోని నిరుపేద చిన్నారులకు విద్యను అందించడం, నిరుద్యోగ యువతకు మార్గదర్శనం చేయడం ఈవెంట్ ముఖ్య లక్ష్యమని కోహ్లీ పేర్కొన్నాడు. చాలా మంది ప్రముఖులు చేయూత అందించేందుకు, తమతో భాగస్వామ్యం అందుకోవడానికి ఇక్కడికి విచ్చేసినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ సందర్బంగా కోహ్లీ, ఎం.ఎస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, ఉమేశ్ యాదవ్ చిన్నారులతో కలిసి ఫొటోలు దిగి వారికి సంతోషాన్ని పంచారు. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కె.ఎల్ రాహుల్, అజింక్యా రహానే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. వీరితో పాటు ఆకాశ్ అంబానీ, గౌతమ్ సింఘానియా, నికిల్ చతుర్వేది, దిగ్విజయ్ సిన్హ్ కతివాడా, ఇతర ప్రముఖులు విరాట్ ఫౌండేషన్ ఈవెంట్ కు హాజరై తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.
(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)