చిన్నారుల లోకం
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో ఎవరికి ప్రత్యేకంగా గది ఉన్నా లేకపోయినా.. పిల్లల కోసం మాత్రం ప్రత్యేక గది ఉంటుందిప్పుడు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలు, ఇష్టాలకు అనుగుణంగానే ఆ గదిని డిజైన్ చేయిస్తున్నారు. పిల్లల్లో సృజనాత్మక శక్తిని మేల్కొలిపే విధంగా, వారిలో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలిగించేలా తీర్చిదిద్దుతున్నారు కూడా.
♦ పిల్లలను ఆకట్టుకోవడంలో రంగులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్‌లు కూడా ఓకే. ఇక వెలైట్, పింక్‌లు కూడా పర్వాలేదు. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేరు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు.
♦ చిన్నారులు గదిలో ఆడడం, చదవడం, నిద్రపోవడం లాంటివి చేస్తారు. అదే వాళ్ల ప్రపంచం. వారిని ఆకట్టుకునేలా ముదురు రంగులు వాడటమే కాకుండా గోడల మీద రకరకాల డిజైన్లు వేయడం, ఒకే గోడ మీద రెండు రంగులు వేయడం చేయవచ్చు.
♦ పిల్లల గదుల్లో రంగులు, అలంకరణ వారికి ఆహ్లాదం కలిగించేలా ఉండాలి. గదంతా కార్టూన్లతో నింపకుండా ఒకే గోడకు మాత్రమే కార్టూన్లకు కేటాయిస్తే సరిపోతుంది.
♦ చిన్నారుల కోసం ఫర్నీచర్, మంచం లాంటివి కొనేటప్పుడు అందంతో పాటు పిల్లల భద్రత, సౌకర్యాలకు కూడాప్రాదాన్యమివ్వాలి. బెడ్ మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. కొద్దిగా మెత్తగా ఉంటే పిల్లలు ఇష్టంగా ఎక్కువసేపు నిద్రపోతారు.
♦ పిల్లల పుస్తకాలు కోసం ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి, చక్కటి ఆల్మరాను పెట్టించడం మంచిది.
♦ పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తల్లో భయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే విధంగా ఉండే మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే బాగుంటుంది.