బాలల బ్రహ్మోత్సవం
పిల్లలు అల్లరి చెయ్యడం సహజం.
అల్లరిలో అందం ఉంటుంది.
అల్లరిలో బ్రహ్మాండం ఉంటుంది.
బాలకృష్ణుడు మన్ను తిన్నాడని తల్లి యశోద...
‘ఏదీ నోరు తెరువు’ అంటుంది.
ఆ చిన్ని నోటిలో బ్రహ్మాండాన్ని చూసి...
‘బాపురే! పదునాలుగు భువన భాండమ్ములు’ అని
కాసేపు అవాక్కవుతుంది.
ఇంకాసేపు మురిసిపోతుంది.
మన పిల్లలకు అమ్మానాన్న, సమాజం... యశోదలాగా పెంపుడు తల్లులు.
వారిలోని బ్రహ్మాండాన్ని గుర్తించి... పెంచి, పెద్దచేసి మళ్లీ సమాజానికే...
ఆ బ్రహ్మాండాన్ని చూపడం ఒక ఆనందకరమైన మురిపెం.
ఇంగ్లిష్‌లో ఒక భావన ఉంది.
అంటే పిల్లలే బ్రహ్మాండమైన సమాజాలకు అంకురాలు.
ఇవాళ 14 నవంబర్. బాలల దినోత్సవం.
కానీ.. ‘ఫ్యామిలీ’కి మాత్రం ఇవాళ బాలల బ్రహ్మోత్సవం.
బ్రహ్మాండోత్సవం.
లక్ష నక్షత్రాలు
ఐదు రోజులుగా ఏమంత మంచి విషయాల్లేవు! కరెన్సీ నోట్లు రద్దయ్యాయి. ఏటీఎంలు పనిచెయ్యడం లేదు. గ్రూప్ 2 పరీక్షల్లో గందరగోళం. రాష్ట్రంలో చలి తీవ్రత. బాలల దినోత్సవం ఒక్కటే ఇవాళ కాస్త మంచి సంగతి. పిల్లలకు ఈ నోట్ల పాట్లతో, ఏటీఎంలతో, గ్రూప్ 2 లతో, చలి తీవ్రతతో పనిలేదు. వాళ్ల ప్రపంచం వేరు. ఇంట్లో మన కళ్ల ముందే ఉన్నారు అనుకుంటాం కానీ, వాళ్లది కంప్లీట్‌గా వేరే లోకం. వాళ్లవి కంప్లీట్‌గా వేరే ఆలోచనలు. మన ఈతి బాధలతో వాళ్లని డిస్టర్బ్ చేస్తే.. ‘‘మోదీ వద్దన్నాడని మానేయకుండా.. అందరూ నోట్లు తీసుకుంటూ, అందరూ నోట్లు ఇచ్చుకుంటూ, అందరూ నోట్లు మార్చుకుంటూ ఉంటే ఏమౌతుంది?’’ అని ప్రశ్నిస్తారు. ‘‘ఏటీఎంల దగ్గరికి మనమే ఎందుకు వెళ్లాలి? మొబైల్ ఏటీఎం మిషన్లను ఇంటింటికీ తిప్పొచ్చు కదా’’ అని అడుగుతారు. బహుశా గ్రూప్ 2 ‘పరీక్ష’ల గురించి వాళ్లేం మాట్లాడకపోవచ్చు. చలి గురించి కూడా! పగలు ఎండ ఉంటుంది. రాత్రి.. పక్కలో అమ్మోనాన్నో ఉంటారు. ఇవసలు ఇష్యూలే కావు. వాళ్ల తలనొప్పి ఎప్పుడూ ఒకటే. ‘ఎందుకు?’ అన్నదొక్కటే. ప్రతిదాంట్లోనూ ‘ఎందుకు?’. లక్ష నక్షత్రాలుంటే లక్ష ‘ఎందుకు?’లు!
‘ఎందుకు?’ అనే ప్రశ్న పిల్లల్ని శాస్త్రవేత్తల్ని చేస్తుంది. తత్వవేత్తల్ని చేస్తుంది. సమాజానికి ఇద్దరూ అవసరమే. బల్బూ వెలగాలి. బతుకు పరమార్థమూ తెలియాలి. శాస్త్రవేత్తలోంచి తత్వవేత్తను, తత్వవేత్తలోంచి శాస్త్రవేత్తను బలవంతంగా మొలకెత్తించాలని చూస్తే.. ఎందుకు అనే ప్రశ్న వేసే అవసరం లేకుండానే పిల్లలు విజ్ఞానవంతులైపోయే ప్రమాదం ఉంది. ప్రశ్నించనివ్వని విజ్ఞానం ప్రపంచాన్ని ఎదగనివ్వని పౌష్టికాహారం.
తెలుగులో ఉన్న ఏకైక చిల్డ్రన్ ఫ్రెండ్లీ రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు కొన్నాళ్ల క్రితం ‘నామిని ఇస్కూలు పుస్తకం’ అని ఓ పుస్తకం రాశారు. ‘ఏకైక’ అనడం ఎందుకంటే.. తక్కినవాళ్లంతా పిల్లల్ని ఎలా జ్ఞానవంతుల్ని చెయ్యాలో చక్కగా బోధించినవాళ్లు. ఈయనొక్కరే పిల్లల్ని ఎలా జ్ఞానవంతుల్ని చెయ్యకూడదో విడమరిచి చెప్పిన వారు! మేథ్స్ని మేథ్స్లా ఎలా చెప్పకూడదో, ఇంగ్లిష్‌ని ఇంగ్లిష్లా ఎలా నేర్పకూడదో నామిని ఆ పుస్తకంలో రాశారు. నామిని ఎమ్మెస్సీ మేథ్స్. ఈయన మేడీజీ పుస్తకాలు రాసే రచయిత కాదు. మేడీజీ పాఠాలు చెప్పే అయ్యవారూ కాదు. పిల్లల్ని నామిని మచ్చిక చేసుకోరు. పిల్లలకే నామిని మచ్చిక అవుతారు.
‘నామిని ఇస్కూలు పుస్తకం’లో కె.వాణి అనే అమ్మాయి ఉంటుంది. ఐదో తరగతి. లీవ్ లెటర్ రాస్తుంది. లీవ్ లెటర్లలో మన టీచర్లు చెప్పే ఫార్మాట్ ఒకటి ఉంటుంది కదా... సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అనీ, సఫరింగ్ ఫ్రమ్ హెడ్డేక్ అనీ, సఫరింగ్ ఫ్రమ్ స్టమకేక్ అనీ.. దాన్ని ఫాలో అయిపోయింది కె.వాణి. పేరెంట్స్‌తో కలిసి ఆ అమ్మాయి తిరుమల కొండకు వెళుతోంది. అందుకే ‘సఫరింగ్ ఫ్రమ్ తిరుమల హిల్స్’ అని రాసింది. పిల్లలు చెప్పింది చెప్పినట్లు అర్థం చేసుకుంటారు. మనమే చెప్పేది చెప్పాల్సినట్టు చెప్పం. మళ్లీ మన ఎవాల్యుయేషన్ ఒకటి! పాస్ అనీ, ఫెయిల్ అనీ! ఆ గ్రేడ్ అనీ, ఈ గ్రేడ్ అనీ.
పిల్లల ఐక్యూ లెవల్స్, ఈక్యూ లెవల్స్ వేరువేరుగా ఉండొచ్చు. కానీ పిల్లలందరి లెవల్ ఒకటే. ‘ఎందుకు?’ అనే లక్ష నక్షత్రాల లెవల్. ఆ లెవల్‌కి మనం రీచ్ అవాలి. రీచ్ అవడంలో పిల్లలకు నేర్పడం ఒక్కటే ఉండదు. పిల్లలను చూసి నేర్చుకోవడం కూడా ఉంటుంది. ఇవాళ బాలల దినోత్సవం. బ్యాంకుల దగ్గర, ఏటీఎమ్‌ల దగ్గర ఎంత మనం టూ థౌజండ్ రుపీస్ వాల్యూ టెన్షన్లో ఉన్నా.. ఆ దారిన స్కూలు పిల్లలు వస్తున్నప్పుడో, వెళుతున్నప్పుడో ఒక మెరుపు మెరవచ్చు. ఒక వాన కురవొచ్చు. ఒక హరివిల్లు విరబూయొచ్చు. ‘అవి మనకే’ అనుకుంటే కొంత టెన్షన్ తగ్గుతుంది. మనం బతికే బతుక్కి మరీ అంత అటెన్షన్ ఇవ్వనవసరం లేదనీ అనిపిస్తుంది. ఆకాశంలోని వింతల్ని చూసి ‘అవి మనకే’ అని పిల్లలు అనుకుంటారని శ్రీశ్రీ రాశారు. పిల్లల లోకాన్ని చూసినప్పుడు ‘అది మనకే’ అని మనకూ అనిపించాలి. పిల్లల నవ్వులు, పిల్లల పరుగులు, పిల్లల ఆటలు, పిల్లల పాటలు, పిల్లల అల్లర్లు.. మనసుకు నెమ్మదిని ఇచ్చాయంటే అవి నిజంగా మనకే. అవన్నీ మనం గెంతడం కోసం మెరిసిన మెరుపులే, కురిసిన జల్లులే. విరిసిన హరివిల్లులే.
1. మూడు ముళ్లు కాదు... నాలుగు ముక్కలు రావాలి
పేరు: స్వాతి, వయసు.. 14 ఏళ్లు, రంగం: దేశం సిగ్గుపడేది
ఘనత.. బాల్యవివాహాల మీద పోరాటం
వడగావ్కు చెందిన స్వాతి కి పదకొండేళ్ల వరకు స్కూల్ తెలియదు. రోజూ తల్లితో కలిసి చెత్త ఏరడానికి వెళ్లేది. చదువంటే పిచ్చి. ఇది గమనించిన ‘సిస్టర్ ఆఫ్ డాన్ బాస్కో’ అనే ఎన్జీవో ప్రతినిధులు స్వాతి వాళ్ల గుడిసెకు వెళ్లారు. ఆమె పేరెంట్స్‌ను ఒప్పించి స్కూల్లో చేర్పించారు. అప్పుడే స్వాతి లాంటి చురుగ్గా ఉన్న పిల్లలతో బాల్య వివాహాల మీద స్ట్రీట్ ప్లే వేయించారు. అందులో స్వాతి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా నటించింది. ఆ పాత్ర ఆమెపై ప్రభావం చూపింది. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు ఆమె పేరెంట్స్ స్వాతి కోసం పెళ్లి సంబంధం చూశారు. విషయం అర్థమైంది ఆ అమ్మాయికి. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ పాత్ర గుర్తొచ్చింది. బాల్యవివాహం ఎంత తప్పో చెప్పింది. మాకే నీతులు చెప్తున్నావా అంటూ అమ్మానాన్న కొట్టారు. భయపడలేదు. తల్లిదండ్రులకు చెప్పకుండా ఎన్జీవోకు వెళ్లిపోయింది. పరిస్థితి వివరించింది. స్వాతి కోసం వాళ్లవాళ్లెవరూ రాలేదు.
దాంతో ఆ యేడాది చదువు కొనసాగింది. మేలో మళ్లీ ఇంటికి వెళ్తానంటే ఎన్జీవో సిబ్బంది వద్దన్నారు. వాళ్లను సమాధానపరిచి మళ్లీ వడగావ్ చేరుకుంది స్వాతి. అయితే ఆమె ఊహించినట్లే పెళ్లి కోసం మళ్లీ ఒత్తిడి తెచ్చారు. ఈసారి అన్నలూ చేయిచేసుకున్నారు. పోలీస్ కంప్లయింట్ ఇస్తాననీ, ఎన్జీవో సిబ్బందికి ఫోన్ చేస్తే పోలీసులను వెంటబెట్టుకొని వస్తారని బెదిరించింది. బాల్య వివాహం చేస్తే అయిదేళ్లు జైలు శిక్ష, జరిమానా తప్పదని హెచ్చరించింది. రెండు నెలల్లో తమ తల్లిదండ్రుల్లోనే కాదు ఇంకొంత మంది పెద్దల్లో కూడా కొంత మార్పు తెచ్చింది. ప్రస్తుతం స్వాతి ఎనిమిదవ తరగతి చదువుతోంది. డాక్టర్ కావాలనేది ఆమె ఆశయం.
2. మనసు చిత్రణ
పేరు: కిషన్ శ్రీకాంత్, ఊరు: బెంగళూరు, ప్రస్తుత వయసు: 20
ఘనత: చిన్న వయసులో చిత్ర దర్శకత్వం వహించి, గిన్నిస్ రికార్డు సాధించడం
కిషన్ శ్రీకాంత్ పుట్టింది 1996, జనవరి 26న. పదేళ్లకే 24 సినిమాలు, టీవీ సీరియల్స్‌లో 300 ఎపిసోడ్లలో నటించాడు. ఓ సామాజిక సమస్య ఆధారంగా కథ రాసుకుని స్వీయదర్శకత్వంలో కేరాఫ్ ఫుట్‌పాత్ సినిమా తీశాడు. అది 2006 నవంబర్ 26వ తేదీన విడుదలైంది. అది విజయవంతం కావడంతోపాటు ఐదు భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఇంగ్లిష్‌లోనూ విడుదలై అతడి పేరు ‘యంగెస్ట్ పర్సన్ టు డెరైక్ట్ ఎ ప్రొఫెషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీలో గిన్నిస్ బుక్‌లో నమోదైంది.ఇలా నటనలో బిజీగా ఉన్న శ్రీకాంత్‌కు... రోజూ స్కూలుకెళ్లడం సాధ్యమయ్యేది కాదు. అయినా అతడు పదవ తరగతిలో 93 శాతం మార్కులతో పాసవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కర్నాటక ప్రభుత్వం అతడిని అభినందనలతో ముంచెత్తి ప్రశంసాపత్రంతో గౌరవించింది. ఆ సందర్భంగా శ్రీకాంత్ నేరుగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చదవడానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరాడు. కర్నాటక ప్రభుత్వం అనుమతించింది. శ్రీకాంత్ పదహారేళ్లకే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ మల్టీమీడియా అండ్ యానిమేషన్లో చేరాడు.
అతడి సినిమా కథాంశమిది... ఒక మురికివాడలో ఫుట్‌పాత్ మీద ఉన్న అనాథ పిల్లాడిని ఒక మహిళ ఇంటికి తీసుకెళ్లి పోషిస్తుంది. అతడిని చదువుకుంటున్న పిల్లలు నిరక్షర కుక్షి అని అవహేళన చేయడం, దాంతో అతడు కసితో ఉన్నత విద్యనభ్యసించి తీరాలని కల కనడం, కలను సాకారం చేసుకుంటాడు. మైఖేల్ ఫారడే, ఆల్వా ఎడిసన్, అబ్దుల్ కలామ్ వంటి మేధావుల జీవిత చరిత్రలను సినిమాలు తీస్తే పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందనేది శ్రీకాంత్ అభిప్రాయం.
3. జ్ఞాపకాల చిత్రం
పేరు: ఎడ్మండ్ థామస్ క్లైంట్, ఊరు: కొచ్చి,
వయసు: ఏడు (ఇప్పుడు లేడు), ఘనత: చిత్రలేఖనం
ఎడ్మండ్ థామస్ క్లైంట్‌ది ఆశ్చర్యం, ఆనందం, విషాదం కలగలిపిన జీవితం. జీవించింది ఏడేళ్లలోపే. అప్పటికే 20 వేల పెయింటింగ్‌లు వేశాడు. కేరళలోని కొచ్చిలో 1976 మే 19న పుట్టిన ఎడ్మండ్... 1983 ఏప్రిల్ 15న రంగుల చిత్రాలను మనకు మిగిల్చి కిడ్నీ సమస్యతో అనంతలోకాలకు వెళ్లిపోయాడు.ఎడ్మండ్కి హిందూ పండుగల ఇతివృత్తంతో చిత్రాలు వేయడం ఇష్టం. ఇంటికి సమీపంలో జరిగే వేడుకలను, ప్రతి సంఘటనను, ప్రతి సన్నివేశాన్ని మనోఫలకం మీద ముద్రించుకుని దానిని బొమ్మ వేసేవాడు. త్రివేండ్రంలో ‘18 ఏళ్లలోపు వయసు చిత్రకారులు వేసిన చిత్రాల ప్రదర్శన’లో ప్రథమ బహుమతి అందుకున్నాడు. చేయి తిరిగిన చిత్రకారులకు కూడా ఇరవై వేల చిత్రాలు వేయడానికి కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. అలాంటిది ఎడ్మండ్ సాధించింది ఆరేళ్ల పదకొండు నెలలలోపే. ఎడ్మండ్ జ్ఞాపకార్థం కేరళ ప్రభుత్వం 1995, 2007 లలో అతడి చిత్రాలన్నింటినీ ప్రదర్శనకు పెట్టింది. ఏటా క్లైంట్ పేరుతో కొచ్చిలో పిల్లలకు పెయింటింగ్ కాంపిటీషన్లను నిర్వహిస్తున్నారు. కొచ్చిలో ఒక వీధికి క్లైంట్ రోడ్ అని పేరు పెట్టారు.
4.నవ లోకపు ఉదయాదిత్య
పేరు: ఎం. టెనిత్ ఆదిత్య, రంగం: నూతన ఆవిష్కరణలు
ఘనత: 11 ఏళ్ళ వయసులోనే ‘పవర్ మైండ్’ అనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రూపకల్పన.
తమిళనాడులోని విరుదునగర్ ప్రాంతానికి చెందిన టీనేజ్ కుర్రాడు ఎం. టెనిత్ ఆదిత్య బుర్ర పాదరసం. ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన. ఆరో తరగతిలో ఉండగానే తొలి ఆవిష్కరణ సాధించాడు. ఆ తపన, పట్టుదల, అలాంటి ఆలోచనలతోనే ఇప్పటి వరకు ఈ కుర్రాడు ఏకంగా 19 కొత్త ఆవిష్కరణలు చేశాడు.ఆదిత్య కనిపెట్టినవన్నీ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చిపెట్టాయి. ‘అరటి ఆకులు పాడైపోకుండా కాపాడే టెక్నాలజీ’ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా సూపర్‌హిట్. అలాగే, సాకెట్ల కోసం బోలెడన్ని ఎక్స్టెన్షన్ బోర్డులు వాడే పని లేకుండా, ఏ రకమైన ప్లగ్కైనా పనికొచ్చే ‘ఎడ్జస్టబుల్ ఎలక్ట్రిసిటీ ఎక్స్టెన్షన్ బోర్డ్’ కూడా. తన 11వ ఏటే 2008లో ‘పవర్ మైండ్’ అనే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రూపొందించాడు. 570 ఏళ్ళ పాటు పనిచేసే సత్తా ఈ సాఫ్ట్వేర్ సొంతం. మెరుపుల నుంచి విద్యుత్ తయారీ, ఏ మాత్రం నష్టం లేకుండా ఉష్ణశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడం - ఇలా ఆదిత్య కనిపెట్టినవి బోలెడు.ప్రస్తుతం కోయంబత్తూరులోని ఎస్.వి.ఎస్. కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఆదిత్యను ఎప్పుడు కదిలించినా, బోలెడన్ని కొత్త కొత్త ఆలోచనలు చెబుతాడు. కనిపెట్టాల్సినవి ఇంకా చాలా ఉన్నాయంటాడు.
5. టీన్ మార్
పేరు: లాఠీ గ్యాంగ్, ఊరు: కర్ణాటక రాష్ట్రం వాఘ్వాడా వయసు: 14-15 ఏళ్లు,
ఘనత: ఆత్మరక్షణకు లాఠీధారణ
ఉత్తరప్రదేశ్‌లో గులాబ్ గ్యాంగ్ గురించి విన్నాం. ఆడవాళ్లకు అన్యాయం చేసే మగవాళ్లను లాఠీలతో దండించే గులాబీ రంగు వస్త్రాల మహిళా దళం దేశంలో ఒక సంచలనం. వారి స్ఫూర్తితో ఆడవాళ్లు ఆత్మరక్షణకు ఎన్నో చోట్ల లాఠీలు పట్టుకున్నారు. ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలో ఇది బాలికలు చేస్తున్నారు. బెలగావి జిల్లాలోని వాఘ్వాడా గ్రామంలో ఆడపిల్లలు స్కూలుకు వెళుతుంటే పక్క గ్రామాల నుంచి పోకిరీలు వచ్చి ఏడిపిస్తున్నారు. నడిచిపోతున్న బాలికలను మోటార్ సైకిళ్ల పై వెంబడించి వేధించడం, వారిని తాకి వేగంగా బండ్ల మీద పారిపోవడం చేస్తుండేసరికి గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో తల్లిదండ్రులు స్కూలు వద్దు ఏం వద్దు ఇళ్లల్లో కూచోండి అని ఆదేశించారు. నాలుగు గోడల మధ్యే ఉండిపోవడం అంటే భవిష్యత్తును నాశనం చేసుకోవడమే అని భావించి బాలికలు చివరకు తామే లాఠీలు పట్టుకోవాల్సి వచ్చింది. స్కూలుకు వెళ్లే సమయంలో, వచ్చే సమయంలో లాఠీలు పట్టుకుని గుంపుగా నడిచే బాలికలను మనం ఇక్కడ చూడవచ్చు. వీరిలో వచ్చిన ఈ ధైర్యం చూసి గ్రామస్తులు ముచ్చట పడుతున్నారు. ఇరుగు పొరుగు గ్రామాల బాలికలు స్ఫూర్తి పొందుతున్నారు. ఇక పోకిరీలు పరార్ అయ్యారని వేరే చెప్పాలా?
6. పేపర్ గర్ల్ టు సూపర్ గర్ల్
పేరు: శివాంగి, ఊరు: కాన్పూర్ సమీపాన దెహా.
వయసు: 15, ఘనత: లక్ష్యాన్ని కనుగొనడం
శివాంగి 15 ఏళ్ల వయసులో చేసిన పని... తన లక్ష్యం చదువుకోవడం అని గ్రహించడం. తండ్రి రోడ్డు పక్కన మేగజీన్లు, న్యూస్‌పేపర్లు అమ్మేవాడు. భోజన విరామానికి, వేరే పనులు ఉన్నప్పుడు అతడు స్టాల్ వదిలి వెళితే శివాంగే కూచుని పుస్తకాలు, దినపత్రికలు అమ్మేది. కాని ఇలా ఎంతకాలం... బాగా చదువుకుంటేనే పైకి రాగలం అని అనుకున్నదామె. అందుకు మార్గాలు అన్వేషించింది. బిహార్‌కు చెందిన ఆనందకుమార్ అనే వ్యక్తి కాన్పూర్‌లో ‘సూపర్30’ అనే ప్రోగ్రామ్ నడుపుతున్నాడని పేద, నిమ్న వర్గాలకు చెందిన బాలబాలికలకు తర్ఫీదు ఇచ్చి పై చదువులకు సాయపడతాడని తెలుసుకుంది. దెహాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో క్లాసు పూర్తయిన వెంటనే ఆనందకుమార్‌ను కలిసి తనకు తర్ఫీదు ఇవ్వమని కోరింది. అక్కడే చదువుకుంటూ గురువు ఇంటినే తన ఇంటిగా చేసుకొని కుటుంబ సభ్యుల ఆత్మీయతను పొంది ఐఐటిలో సీటు సాధించింది. ఐఐటి కాన్పూర్‌లో విద్యను అభ్యసించి నేడు మంచి ఉద్యోగాన్ని సాధించింది. తెల్లవారుజామునే న్యూస్‌పేపర్ వేసి రాష్ట్రపతి పదవి వరకు ఎదిగిన అబ్దుల్ కలామ్ మాత్రమే కాదు రోడ్డు పక్క దినపత్రికలు అమ్మి ఇంత ఎదిగిన శివాంగి వంటి వారు కూడా ఆదర్శమే.
7. మహామది
పేరు: మేఘాలి మాళవిక, ఊరు: భువనేశ్వర్
వయసు: 10, ఘనత: నదుల ప్రచారం
ఎవరైనా ఒక నిమిషంలో ఒకటి నుంచి వంద వరకు అంకెలు చెప్పగలరు. కాని మేఘాలి ఒక నిమిషంలో 165 నదుల పేర్లు చెప్పగలదు. యూరప్‌లో ఉన్న 165 నదుల పేర్లు ఒక్క నిమిషంలో చెప్పడం వల్ల మేఘాలి పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. మేఘాలికి అద్భుతమైన ధారణశక్తి ఉంది. నదుల గురించి విపరీతమైన ఆసక్తి ఉంది. మీరొక ఖాళీ ప్రపంచ పటం ఇస్తే తను ప్రపంచంలోని నదులన్నింటి ప్రవాహాన్ని పెన్‌తో గీసి చూపిస్తుంది. తనకు ఐదు ఖండాల్లోని వేయి నదులు కంఠోపాఠం. ఇలా నదులను గుప్పిట బిగించి ఎందరో విద్యార్థులకు చూపరులకు నదుల పట్ల అవగాహన కలిగిస్తున్న చిన్నారి మేఘాలి ఒక్కతే కావచ్చు. ‘నదులు మానవ జీవనానికి ముఖ్యమైన జీవనాధారం. వాటిని కలుషితం చేయొద్దు’ అని చెబుతుంది మేఘాలి. భువనేశ్వర్‌లో ఐదో క్లాస్ చదువుతున్న ఈ ‘నడిచే ఎన్సైక్లోపిడియా’కు ప్రపంచ దేశాలు వాటి పొరుగు దేశాలు ఆ దేశాల్లో వాడే కరెన్సీ ఇవన్నీ కంఠోపాఠం. అంతేనా?... తను చక్కగా వయొలిన్ నేర్చుకుంటోంది. బొమ్మలు గీస్తోంది. కాసేపు ఉల్లాసానికి కామిక్స్ చూస్తుంది. రోజులో ఎక్కువ సమయం కామిక్స్‌తో గడిపే పిల్లలు మేఘాలిలా భౌగోళిక అవగాహన, కళలు వృద్ధి చేసుకోవడం మంచిది కదూ?
8. ఎకో మెడికో
పేరు: సుష్మ వర్మ, ఊరు: లక్నో
వయసు: 16, ఘనత: పర్యావరణం పై ప్రేమతో పిహెచ్డి
ఎనిమిదేళ్ల వయసులో పదో తరగతి పాసయ్యింది. 15 ఏళ్ల వయసుకే ఎంఎస్సి చేసి రికార్డు సాధించింది. తన చదువుతో తండ్రికి ఉద్యోగం ఇప్పించింది. ఇప్పుడు లక్నో పచ్చదనం కోసం పిహెచ్డి చేస్తోంది. పదహారేళ్ల వయసులో లక్నో బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్న సుష్మ వర్మ జీవితంలో ఆదర్శాలకు అంతులేదు. చిన్నప్పటి నుంచి చదువులో మేధావి అయిన సుష్మ తన కంటే వయసులో దాదాపు ఎనిమిదేళ్లు పెద్దయిన విద్యార్థులతో కలిసి చదువుకుంది. పదమూడేళ్లకు డిగ్రీ పూర్తి చేశాక మెడికల్ ఎంట్రన్స్ రాసి డాక్టర్ కావాలనుకుంది సుష్మ. అయితే పదిహేడు సంవత్సరాలు నిండనిదే మెడిసిన్ చదవడానికి వీల్లేదనే నియమం ఉండటం వల్ల బాబా సాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసింది.అంత చిన్న అమ్మాయి అంత జటిలమైన చదువును చదవగలదా అని అనుమానించినవారికి యూనివర్సిటీ సెకండ్‌గా నిలిచి ఆశ్చర్యం గొలిపింది. అయితే ఆ సమయంలోనే ఆమెను లక్నో చుట్టుపక్కల పరిసరాలు ఆకర్షించాయి. ఫీల్డుకెళ్లినప్పుడల్లా బీడువారిన భూమిని చూసి దీనిని పచ్చదనంతో నింపడం ఎలా అని ఆలోచించేది సుష్మ. ఫలితం ఇప్పుడు ఆమె తన పిహెచ్డి సీటును ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజీ విభాగంలో నమోదు చేసుకుంది. పర్యావరణం కోసం ఏదైనా చేయాలనే సుష్మ తపన ఇప్పుడు చాలా మంది యువతకు, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
9. భూగోళ జ్ఞాన బలుడు
పేరు: కౌటిల్య పండిత్, రంగం : విజ్ఞానం
ఘనత : 150 దాటిన ఐ.క్యూ!, మినీ ఎన్సైక్లోపీడియా
రు.10 లక్షల బహుమతి ‘కౌన్ బనేగా’ పోటీ అర్హత
జనరల్ నాలెడ్జిలో అసమాన ప్రతిభ కనబరిచి, ‘గూగుల్ బాయ్’గా ప్రఖ్యాతిగాంచిన కౌటిల్య పండిత్ రెండేళ్ల క్రితం, తన ఆరేళ్ల వయసులో తొలిసారి ఈ దేశాన్ని నివ్వెరపరిచాడు. సమకాలీన వార్తా విశేషాలు, భౌగోళిక గణాంకాలు, లౌకిక విషయాలలో కౌటిల్య గ్రాహ్య, జ్ఞాపక శక్తులు అపారమైనవని గ్రహించిన కురుక్షేత్ర విశ్వవిద్యాలయ ఆచార్యులు అతడి మస్తిష్క సామర్థ్యాలపై పరిశోధన జరపాలన్న ఉత్సుకతను కూడా కనబరిచారు! విశ్వవిద్యాలయ చైర్మన్ సి.ఆర్.దరోలియా.. కౌటిల్య ఐ.క్యూ. దాదాపు 150 పాయింట్లకు మించడాన్ని గమనించారు. ఆరేళ్ల వయసుకు అది ఎక్కువే. హరియాణాలోని కర్నాల్ జిల్లా వాడైన ఈ చిన్నవాడి భవిష్యత్తు లక్ష్యాల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల రూపాయల నగదు బహుమతిని ఇవ్వడమే కాకుండా, అతడికి అన్ని విధాలుగా సహాయం అందిస్తామని ప్రకటించింది. ఆ ప్రకటన సమయంలోనే ముఖ్యమంత్రి భూపేంద్ర సింగ్ హూడా చేతుల మీదుగా తను అందుకున్న ప్రశంసాపత్రంలో ఉన్న చిన్న పొరపాటును కౌటిల్య ఆ వేదిక మీదనే ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చాడు! ఆ దృశ్యాన్ని టీవీలో ప్రత్యక్షంగా తిలకించిన హరియాణా ప్రజలు ఆ చిన్నారి సూక్ష్మ బుద్ధిని, తెలివితేటల్ని చూసి ముచ్చటపడ్డారు. అంతకు పూర్వం బాలల దినోత్సవం సందర్భంగా 2013 నవంబర్‌లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్లో ఆ కార్యక్రమ వ్యాఖ్యాత అమితాబ్‌బచ్చన్‌ని కూడా ఇలాగే ఈ బుడతడు తన పరిజ్ఞానంతో మంత్రముగ్ధుణ్ణి చేశాడు. ఆ తర్వాతి ఏడాది బ్రహ్మకుమారీల ‘ప్రపంచ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం’ ప్రధాన గురువు దాది గుల్జార్ ఆహ్వానంపై ఆమెను కలిసి ఆశీస్సులు అందుకున్నాడు. కౌటిల్య జన్మస్థలం కొహండ్. మూడు నాలుగేళ్ల వయసులోనే.. ఏమిటి, ఎక్కడ, ఎవరు, ఎలా, ఎందుకు అనే ప్రశ్నలతో పీక్కుతినేవాడని ఇతడి తల్లిదండ్రులు మురిపెంగా చెప్పుకుంటారు. కౌటిల్య తండ్రి సతీశ్ శర్మ ఆ ఊళ్లోనే ఒక పాఠశాల నడుపుతున్నారు. కౌటిల్య సెలబ్రిటీ అయ్యాక అతడితో కలిసి ఫొటో దిగడానికి ఆ ఊరికి వచ్చేవారు ఎక్కువైనట్లే, అతడి పాఠశాలలో పిల్లల్ని చేర్పించేందుకు వస్తున్న తల్లిదండ్రుల సంఖ్యా ఏటికేడాది పెరుగుతూనే ఉంది.
10. వేగానికి కొత్త కొలమానం
పేరు: ప్రియాంశి సోమాని రంగం : మనోగణన (మెంటల్ కాలిక్యులేషన్)
ఘనత : 12 ఏళ్ల వయసులో ప్రపంచ విజేత
నాలుగు ప్రపంచ పోటీల్లో అసాధారణ ప్రతిభ
లిమ్కా, గిన్నిస్ రికార్డులు! జీనియస్ కేటగిరీలో అవార్డు.
2010లో జరిగిన ‘మెంటల్ కాలిక్యులేషన్ వరల్డ్ కప్’ పోటీలతో ప్రియాంశి సోమానీ ప్రావీణ్యం వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల వయసులో ఆమె ఆ కప్పును గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన మరో మూడు పోటీలలో కూడా కూడికలు, హెచ్చవేతలు, స్క్వేర్ రూట్లలో వంద శాతం కచ్చితత్వాన్ని ప్రదర్శించి, గణిత మేధావుల ప్రశంసలు అందుకుంది. తొలి పోటీలో 16 దేశాల నుంచి వచ్చిన 37 మంది ప్రత్యర్థుల్ని ఓడించి మరీ ప్రియాంశి విజేతగా నిలబడింది. అదే ఏడాది (2010) జరిగిన ‘పోగో అమేజింగ్ కిడ్స్ అవార్డు’ పోటీలోని జీనియస్ కేటగిరీలో టైటిల్ సాధించింది. ప్రియాంశి గుజరాతీ అమ్మాయి. తండ్రి సత్యేన్ సోమాని బిజినెస్‌మ్యాన్. తల్లి అంజు సోమాని గృహిణి. కూతురిలోని అపరిమితమైన గణాంశ శక్తిని ఆమె పసితనంలోనే గమనించిన ఈ తల్లీతండ్రీ గణితాంశాలలో ఆమెను ప్రోత్సహించారు. తండ్రి బిజినెస్ మానుకుని, తల్లి నిద్ర మానుకుని కూతురి ప్రతిభ పదునెక్కేందుకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చారు. అంతర్జాతీయ పోటీలకు ఆమె చేత దరఖాస్తు పెట్టించారు. ప్రియాంశి ప్రస్తుతం ముంబై ఐ.ఐ.టి.లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తోంది. ఆమె కోసం కుటుంబం కూడా ముంబైకి తరలివెళ్లింది. ఎలక్ట్రానిక్ కాలిక్యులేటర్ కన్నా వేగంగా లెక్కలు వెయ్యడం ప్రిశాంశి ప్రత్యేకత. అందుకే ఆమె ‘మెంటల్ కాలిక్యులేటర్’గా ప్రసిద్ధి చెందింది. ఏ వయసు వారితోనైనా అంకెలు, సంఖ్యలు ఒక ఆట ఆడుకుంటాయి. ప్రియాంశి దగ్గర ఆ లెక్కలు ఉడకవు. ఆమే వాటితో ఆడుకుంటుంది. నిమిషాల్లో కఠినమైన పజిల్స్‌ని సైతం తేలగొట్టేస్తుంది. ఈ ప్రత్యేకతే ఆమెను 2011లో ‘వరల్డ్ మేథ్ డే’కి భారతీయ రాయబారిని చేసింది.
‘‘వేగాన్ని నేను ఇష్టపడతాను. కళ్ల ముందు ఒక గణిత సమస్య ఉన్నప్పుడు, దాని పరిష్కారం కోసం నా మెదడు వేగం అందుకుంటుంది. ఎంత వేగం అందుకుంటుందో చెప్పలేను. ఆన్సర్ ఎలాగూ కనిపెడతాను. కానీ ఎంత వేగంగా కనిపెట్టగలననేదే నా సమస్య’’ అంటుంది ప్రియాంశి. ప్రస్తుతం ఈ బాల మేధావిపై స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకరు పీహెచ్.డి. చేస్తున్నారు!
11. పాకశాస్త్ర ప్రవీణుడు
పేరు: నిహాల్ రాజ్ వయసు: ఆరేళ్లు రంగం: పాకశాస్త్రం
ఘనత: వంటల ద్వారా వచ్చిన సొమ్మును ఆటిజం పిల్లలకు డొనేట్ చేస్తున్నాడు.
కొచ్చికి చెందిన నిహాల్ అద్భుతమైన వంటగాడు. యేడాది నుంచి వీడియో ద్వారా వంటలు నేర్పించే ట్యూటర్‌గా మారాడు. నోరూరుంచే రకరకాల పాయసాలను, ఐస్‌క్రీములు, కేక్‌లను తయారు చేయడం ఎలాగో చెప్తున్నాడు. పిల్లలకే కాదు పెద్దలకూ పనికొచ్చేలా. నిహాల్ తండ్రి రాజగోపాల్ వి కృష్ణన్. తల్లి రూబీ. ఆమె బేకర్. నిహాలకు వంటలో నైపుణ్యం తల్లి నుంచే అబ్బినట్టుంది. ఆమె వంట చేస్తుంటే చుట్టూ తిరిగేవాడట. అంత చిన్న వయసులోనే వంటకు కావల్సిన పదార్థాలు అందించడం, అమ్మ వంట చేస్తుంటే ఆసక్తిగా గమనించడం చేస్తుండేవాడట. అది గమనించిన రూబీ కొడుకుకు వంట చేయడం నేర్పించింది. అయితే తల్లి దగ్గర వంట ప్రక్రియ మాత్రమే నేర్చుకొని సొంత రెసిపీలు కనిపెట్టడం మొదలుపెట్టాడు ఈ బుల్లి షెఫ్. కొడుకు పాకానికి ముగ్ధుడైన తండ్రి ఆ సింపుల్, స్వీట్ అండ్ డిలీషియస్ రెసిపీలను స్క్రిప్ట్ లేకుండా పదిమందికీ తెలియజెప్పేందుకు ఓ ట్యూబ్చానెల్ను క్రియేట్ చేశాడు. ఒక్క యేడాదిలో ఆ చిన్నోడు వంటల్ని మొత్తం 20 వీడియోలుగా తీశాడు తండ్రి. ఈ లిటిల్ షెఫ్ తయారు చేసిన మిక్కిమౌజ్ మ్యాంగో ఐస్‌క్రీమ్ వీడియో హక్కులను 2వేల డాలర్లకు ఫేస్బుక్ కొనుక్కొంది. ఆ డబ్బును ఏంచేద్దామని తల్ల్లీదండ్రి అడిగితే స్పెషల్లీ చాలెంజ్డ్ పిల్లలకు ఇద్దామన్నాడట. కొడుకు చెప్పినట్టే ఆ డబ్బును ఆటిజం పిల్లల కోసం డొనేట్ చేశారు.
12. ఒడుపైన నైపుణ్యం
పేరు: దిలీప్ కుమార్ వయసు : పదమూడు రంగం : క్రీడలు
ఘనత : ఏఐఎఫ్ఎఫ్ అండర్-14 క్యాంప్‌కి ఎన్నికయ్యాడు.
దిలీప్ కుమార్ సొంతూరు అనంతపురం జిల్లా, కొడిగినహళ్లిలోని కలవపల్లి. ఇద్దరు సంతానంలో రెండోవాడు. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయ కూలీలు. దిలీప్ కాళ్లల్లోని వేగం, కళ్లల్లోని చురుకుదనం చూసి.. మెరుపులా కదలడం గమనించిన కోచ్ అరుణ్‌కుమార్‌కు దిలీప్లో భవిష్యత్ ఫుట్‌బాల్ ప్లేయర్ కనిపించాడు. దిలీప్ కూడా తక్కువ సమయంలోనే తన నైపుణ్యాన్ని ప్రదర్శించి అరుణ్ మనసు చూరగొన్నాడు. యేడాదిలోనే మెళకువలు నేర్చుకుని 2014 -15 అనంతపురం జిల్లా ఫుట్‌బాల్ లీగ్ పోటీలకు సన్నద్ధుడయ్యాడు. అందులో ఆ అబ్బాయి ప్రతిభను చూసిన కోచ్ ఇంకా మంచి శిక్షణ అందితే దిలీప్ అంతర్జాతీయస్థాయి ఆటగాడవుతాడని భావించాడు. అలా కోచ్ సహాయంతో 2015లో అనంతపురం స్పోర్ట్స్ విలేజ్‌లో చేరాడు. ఫుట్‌బాల్‌లో శిక్షణ తీసుకుంటున్నా చదువునూ నిర్లక్ష్యం చేయలేదు. శిక్షణ సమయంలోనే మూడు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తన సత్తా చాటాడు. ఆ ప్రతిభే దిలీప్‌ను ఏఐఎఫ్ఎఫ్ అండర్ 14 క్యాంప్‌కి ఎన్నికయ్యేలా చేసింది. రోజుకు రెండుగంటల ప్రయాణం, పేదరికం.. వంటి ప్రతికూలతలను పట్టించుకోకుండా చక్కటి ఆటగాడిగా పేరుతెచ్చుకోవాలనే గోల్పైనే దృష్టి నిలిపి ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ ఆటలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
13. మిత్ర కళాకారిణి పేరు: ఆరుషి భట్నాగర్ వయసు : పదమూడు రంగం: చిత్రలేఖనం
ఘనత: ఏడాది వయసులోనే యంగెస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు.
ఏడాది వయసులోనే రాష్ట్రస్థాయి చిత్రలేఖన పోటీలలో ట్రోఫీని, ఇండోర్ యంగెస్ట్ ఆర్టిస్ట్ అవార్డ్‌తో పాటు మరో 9 అవార్డులను సొంతం చేసుకుంది ఆరుషి. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫెస్టివల్లో సోలో ఎగ్జిబిషన్‌తో పాటు దేశ, విదేశాలలో 16 సోలో ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసింది. 23 కార్యక్రమాలకు గౌరవఅతిథిగా పాల్గొంది. తొమ్మిది కళాఖండాలను విక్రయించి దాని ద్వారా వచ్చిన డబ్బును ‘రేఖాంకన్’ పేరుతో పేద విద్యార్థులకు సాయం చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు మూడు వేలకు పైగా పెయింటింగ్స్ వేసిన ఆరుషి 2005లోనే యంగెస్ట్ పోగో అమేజింగ్ కిడ్స్ అవార్డ్‌నూ కైవసం చేసుకుంది. ఇంత చిన్న వయసులో పెయింటింగ్ ఎలా సాధ్యమైంది? అని ఆరుషిని అడిగితే ‘నేను పాకే వయసులోనే మా నాన్న నాకు ఆడుకోవడానికి కొన్ని కలర్స్ ఇచ్చేవారంట. వాటితో నేలమీదనే ముచ్చటైన డిజైన్స్‌ను గీసేదాన్నట. అలా నా చిత్రలేఖన కళ మొదలైంది’ అని నవ్వుతూ చెబుతుంది. ‘నేను అబ్స్ట్రాక్ట్ ఆర్టిస్ట్‌ను’ అని చెప్పే ఆరుషి క్రేయాన్స్, వాటర్ కలర్స్, ఆక్రిల్, ఆయిల్ కలర్స్, గ్లాస్, ఇంక్ కలర్స్‌ను వాడుతుంది. ఆరుషి చేతులు పెయింటింగ్‌లోనే కాదు ఫొటోగ్రఫీలోనూ మేటి అనిపించుకున్నాయి. జాతీయస్థాయి ఫొటోగ్రఫీలో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. 9 ఏళ్ల ఆరుషి చదువులో ముందుంటుంది. ‘రేఖాంకన్’ పేరుతో స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి సామాజిక పిల్లల్లో చిత్రలేఖనాసక్తిని పెంచుతోంది. తన కళ ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థకు, ఆర్ట్ వర్క్‌కు వినియోగిస్తుంది. నాలుగేళ్ల క్రితం తాను చదివే స్కూల్లో ఒకమ్మాయి తల్లి ప్రమాదంలో చనిపోవడంతో తన రెండు కళాఖండాలను అమ్మి దాని ద్వారా వచ్చిన లక్షరూపాయలతో ఆర్థిక సాయం చేసింది. ఆరుషికి ఎన్నో తెలివితేటలు, ముందు చూపు, మానవతా దృక్పథం ఉందనడానికి ఇదో చిన్న ఉదాహరణ.
14. స్వశక్తి స్వరూపిణి పేరు: దామినీసేన్
ఘనత: కాలి వేళ్లతో రాయడం
రికార్డ్: గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
అందరూ చేతులతో రాస్తుంటే దామిని కాలివేళ్లతో పుస్తకాల్లో అక్షరాలను లిఖిస్తుంది. తన పనులే కాదు, ఇంటి పనులను కూడా కాలివేళ్లతో చేసేస్తూ తల్లికి సాయంగా ఉంటుంది. పదవ తరగతి పరీక్షలో 80 శాతం మార్కులు తెచ్చుకున్న దామినీ వికలాంగురాలు అన్నవారి నోటనే ఔరా అనిపించింది. కాలివేళ్లతో ఒక గంటలో 38 చిత్రాలను గీసిన ఆర్టిస్ట్‌గా దామినీసేన్ గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సొంతం చేసుకుంది. బాల్యం నుంచే ఎన్నో రికార్డులను తన కాలి గోటితో సొంతం చేసుకుంది దామిని. మన దేశంలోని ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌కు చెందిన దామినీసేన్ పుట్టుకతోనే వికలాంగురాలు. రెండు చేతులు లేకుండా పుట్టిన ఆమెను అంతా వింతగా చూశారు. ‘చేతులు లేకుండా ఎలా బతుకుతుంది’ అని మొహమ్మీదే అనేవారు. ‘మా అమ్మాయికి మేమే రెండు చేతులం’ అనేవారు అమ్మానాన్న. అంతటి భరోసా ఇవ్వడంతో ఏదైనా సాధించి, వారిని సంతోషపెట్టాలను కున్నాను’ అంటుంది దామిని. ఇరుగుపొరుగు పిల్లలు దామినీతో ఆడుకోవడానికి కూడా వెనుకంజ వేసేవారు. దామినీకి చదువుపట్ల ఉన్న ఆసక్తి గమనించి ఆమెను గురుకుల పాఠశాలలో చేర్చారు తల్లీదండ్రి. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న దామిని తన లాంటి ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తుంది.
మాధవ్ శింగరాజు