విద్యార్థులకు పర్సనల్ గైడ్ అయిన సీఎం
రాయ్‌పూర్: వీఐపీలకు, సామాన్యులకు మధ్య అంతరం తగ్గించడంకోసం చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 100 మంది విద్యార్థులకు ఆయన పర్సనల్ గైడ్‌గా వ్యవహరించారు. ఆ రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతానికి చెందిన విద్యార్థులను ముఖ్యమంత్రి తన నివాసానికి ఆహ్వానించారు. రెండు రోజుల విహారయాత్ర కోసం వారు రాయ్‌పూర్‌కు వచ్చేందుకు సీఎం ఏర్పాట్లు చేయించారు.
రాయ్‌పూర్‌లో విద్యార్థులు సైన్స్ సిటీ, ప్లాంటోరియం చూశారు. షాపింగ్ మాల్, సినిమాకు వెళ్లారు. 6, 7, 8 వ తరగతులకు చెందిన విద్యార్థులతో రమణ్ సింగ్ తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పక్షులు, చెట్లు గురించి వారితో చర్చించారు. విద్యార్థుల సమస్యలు, చదువు గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి తమతో ఆప్యాయంగా మాట్లాడేసరికి విద్యార్థులు సంతోషించారు.