తిట్టడం సులభం.. ఫలితం అనూహ్యం
ఇంటికి రెండు గంటలు ఆలస్యంగా వచ్చిన టీనేజ్ కుమారుణ్ణి తల్లిదండ్రులు మందలిస్తే ఆ కుర్రవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన ఇది. తల్లిదండ్రులు పిల్లల నడవడికను సరి చేయాలని ఆందోళన చెందడం మంచిదే కాని పిల్లల వయసును దృష్టిలో పెట్టుకుని వారి పొరపాట్లకు కారణాలను తెలుసుకోకుండా వారు చెప్పేది అర్థం చేసుకోకుండా తిడితే అసలుకే ప్రమాదం వస్తుంది. టీనేజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలి?
ఇంటర్ చదివే కుర్రాడు కాలేజ్ అయిపోయాక రెండు గంటల ఆలస్యంగా ఇంటికొచ్చాడు.
తల్లిదండ్రుల ఆలోచన: వీడు టైమ్ వేస్ట్ చేస్తున్నాడు. ఏ పనికిమాలిన బ్యాచ్తోనో తిరుగుతున్నాడు. ఏదో సినిమాకు వెళ్లి ఉంటాడు. ఇలా అయితే వీడు ర్యాంక్ తెచ్చుకున్నట్టే. వీడు ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. ఇవాళ వీడికి బాగా పడాలి.
కుర్రాడి ఆలోచనలు: ఉదయం నుంచి సాయంత్రం వరకూ క్లాసులు చాలా స్ట్రెస్‌గా ఉంటున్నాయి. కొంచెం కూడా రిలాక్స్ అవడానికి లేదు. మా బ్యాచ్ అంతా కాసేపు బేకరీకి వెళ్దామంటున్నారు. నేను వెళ్లకపోతే వాళ్లు నన్ను ఐసొలేట్ చేస్తారు. అలుగుతారు. బ్యాచ్ నుంచి కట్ చేస్తారు. అందరూ వెళుతుంటే నేనెందుకు వెళ్లకూడదు. వెళ్లి ఇంటికి వెళతా.
రెండు వెర్షన్లు సరైనవే. కాని ఒక వెర్షన్ వారికి ఆధిపత్యం ఉంటుంది. మరో పక్షం వారికి ఆందోళన ఉంటుంది. తల్లిదండ్రులు ఇంటి యజమానులు. కుర్రాడికి కూడా యజమానులు. వారు యజమానులు కాకుండా తల్లిదండ్రులు ఎప్పుడవుతారంటే ఆ కుర్రాడు ఏదీ దాచకుండా తల్లిదండ్రులకు చెప్పినప్పుడు. చెప్పుకునే వాతావరణం ఉన్నప్పుడు. దానిని అర్థం చేసుకుని ఎంతవరకు అలౌ చేయాలో అంత వరకూ అలౌ చేయగలిగినప్పుడు.
పై సందర్భంలో ఆ కుర్రాడు ‘మా బ్యాచ్ అంతా బేకరీకి వెళ్దామంటున్నారు’ అని కాల్ చేస్తే తల్లిదండ్రులు ‘సరే.. వెళ్లు. కాని దాని వల్ల నీ టైమ్ వేస్ట్ అవుతుంది. అలాగని వెళ్లకపోతే బాగుండదు. ఒక గంట సేపు ఉండి వచ్చెయ్’ అనగలిగితే ఆ కుర్రాడు 45 నిమిషాలే ఉండి వచ్చే అవకాశం ఉంది. కాని తిడతారనే భయంతో చెప్పకుండా, లేట్‌గా ఇంటికొచ్చినప్పుడు... తల్లిదండ్రులు ముందు వెనుకా చూడకుండా చెడామడా తిడితే ఆ చిన్న హృదయం ఎంత ఇబ్బంది పడుతుంది? సెన్సిటివ్ పిల్లలు అయితే అఘాయిత్యానికి పాల్పడితే?
అంగీకరించాలి: టీనేజ్‌లోకి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల ప్రస్తుత స్థితిని అంగీకరించాలి మొదట. తమ టీనేజ్ కాలానికి ఇప్పటి టీనేజ్ కాలానికి కాలం చాలా మారిపోయి ఉంటుందని గ్రహించాలి. తమలాగే తమ పిల్లలు ఉండాలనుకుంటే అది కాలానికి విరుద్ధం. ఈ కాలంలో పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉంటారు. అందులో ఏ మేరకు చెడు ఉందో చూసి దానిని పరిహరించడానికి మాత్రమే తల్లిదండ్రులు ప్రయత్నించాలి.
పిల్లలకు సవాళ్లు: మీ పిల్లలు మీకు సమస్య సృష్టిస్తున్నారా? లేదా మీరు మీ పిల్లలకు సమస్య సృష్టించారా? మీ పిల్లలు వారికి ఇష్టమైన కోర్సు చదివేలా చూశారా? వారు యావరేజ్ స్టూడెంట్ అయినా ఫస్ట్ ర్యాంక్ రావాలని వెంట పడుతున్నారా? వారి జ్ఞాపకశక్తి పరీక్షలకు వీలుగా ఉందా? వారికి అన్ని సబ్జెక్ట్‌లు అర్థం అవుతున్నాయా? వారికి పరీక్షల వొత్తిడి ఎలా ఉంది? వారికి ఏ మాత్రమైన ఆహ్లాదం అందుతోంది? ఇవన్నీ గమనించకుండా పిల్లలు మరబొమ్మల్లా ఎప్పుడూ చెప్పినట్టల్లా వింటూ కేవలం పుస్తకాలు మాత్రమే పట్టుకుని కూచోవాలని ఆశిస్తే ఆ పిల్లలకు ఉక్కిరిబిక్కిరి ఎదురవుతుంది. దాని నుంచి బయటపడాలని తల్లిదండ్రులకు తెలియకుండా దొంగపద్ధతులకు దిగుతారు. అది తల్లిదండ్రులకు ఇంకా తప్పుగా కనిపిస్తుంది. వారు తప్పు చేసేలా చేసింది తల్లిదండ్రులే మరి.
పనిష్మెంట్ వద్దు ఇన్స్పిరేషన్ ముఖ్యం: పిల్లలు టీనేజ్‌లోకి వచ్చాక మానసికంగా, శారీరకంగా ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటారు. ఆ సమయంలో వారు ఫోకస్ పెట్టి చదవాలని అనుకున్నా కొన్ని డిస్ట్రాక్షన్లు ఉంటాయి. అంతేగాక ఈ సమయంలో వారు ఎన్నో సందేహాలతో ప్రవర్తనకు సంబంధించి సంశయాలతో ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో సన్నిహితంగా ఉంటూ వారితో సంభాషిస్తూ ‘ఏదైనా మాతో చెప్పి చేయండి’ అనే విధంగా మాట్లాడితే చాలా సమస్యలు తీరుతాయి. చదువు పట్ల, ప్రవర్తన పట్ల వారిని తల్లిదండ్రులు ఇన్‌స్పయిర్ చేసేలా ఉండాలి తప్ప పనిష్మెంట్ చేసేలా ఉండకూడదు. తిట్టడం, కొట్టడం అనేవి కాదు చేయాల్సింది. బుజ్జగించడం, బతిమాలడం కూడా కాదు. కేవలం స్నేహంగా గైడ్ చేయడం. వారి వల్ల జరిగే తప్పులను, పొరపాట్లను జడ్జ్ చేయకుండా వారి వైపు నుంచి ఆలోచించి వారికి అర్థమయ్యేలా సరి చేయడం.
టీనేజ్‌లో ఉన్న పిల్లలకు పెద్దవాళ్లు చెప్పేది అర్థమవ్వాలంటే వారు పెద్దవాళ్లంత వయసుకు చేరాలి. కాబట్టి తల్లిదండ్రులే పిల్లల వయసుకు దిగి పిల్లలతో వ్యవహరించడం ఇరుపక్షాలకు శ్రేయస్కరం.