Childrens Health
-
ఈ బరువును ఏం చేద్దాం?
స్కూల్లో టీచర్‌గానీ హెడ్మాస్టర్ గానీ ఎవరైనా పిల్లవాడి స్కూల్‌బ్యాగ్ వీపున తగిలించుకుని ఒక పదిహేను నిమిషాలు నిలబడగలరా? అన్నీ టెక్స్›్టలు అన్ని నోట్సులూ రోజూ తేవాలంటే పిల్లల వీపున పెరుగుతున్న బరువు ఎంత? టెక్ట్స్బుక్కుల పేజీలు పెరిగితే చదువు భారం. వీపున ఈ బరువు భారం. తల్లిదండ్రులు, న్యాయస్థానాలు పదే పదే చెప్పినా స్కూలు యాజమాన్యాలు మాత్రం ఈ బరువును పట్టించుకోవడం లేదు. పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఈ బరువును ఏం చేద్దాం? నైట్ డ్యూటీ చేసి వచ్చే ఆ తండ్రి ఉదయాన్నే లేవక తప్పదు. ఇద్దరు కూతుళ్లను స్కూల్ బస్ ఎక్కించాలి. ఒకరు ఆరు, ఒకరు ఎనిమిది. వాళ్లు వెళ్లి ఎక్కగలరు. కాని వాళ్ల స్కూల్ బ్యాగులను మోస్తూ మాత్రం వెళ్లి ఎక్కలేరు. వాళ్ల ఇంటి నుంచి ఒక ఫర్లాంగు దూరంలో ఉన్న రోడ్డు మీద బస్సు ఆగుతుంది. సెకండ్ ఫ్లోర్లో ఉన్న పోర్షన్ నుంచి వాళ్లు బ్యాగులను మోసుకుంటూ బస్ దగ్గరకు వెళ్లి ఎక్కేసరికి వాళ్ల పని అయిపోతుంది. నాలుగు రోజులు ఇలా చేస్తే ఐదో రోజు ఒళ్లు నొప్పులు అని స్కూల్ ఎగ్గొడతారు. అందుకే తండ్రి లేచి ఆ స్కూల్ బ్యాగులను స్కూటర్ మీద పెట్టుకుని బస్ వరకు వెళ్లి ఎక్కిస్తాడు. మళ్లీ స్కూల్లో బస్ ఆగిన చోటు నుంచి క్లాస్ రూమ్ వరకూ వారు ఆ బ్యాగ్ మోయాల్సిందే. ఏం అంత బరువా? అనంటే ఆరో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు 8 కిలోలు ఉంటుంది. ఎనిమిదో క్లాసు అమ్మాయి బ్యాగు బరువు పది కిలోలు ఉంటుంది. నిజం! వెన్ను వంచే బరువు స్కూలుకు పిల్లలు చదువుకోవడానికే వెళతారు. కాని చదువు పేరుతో బరువు లెత్తే కూలీలుగా వారు వెళ్లకూడదు. జాతి తన వెన్నుముక మీద నిలబడాలని కోరుకునే మనం చిన్న వయసు నుంచి పిల్లల వెన్ను వంచేస్తున్నాం. శాస్త్రీయ సూచన ప్రకారం ఒక విద్యార్థి స్కూల్ బ్యాగ్ బరువు అతని శరీర బరువులో పది శాతం ఉండాలి. అంటే 20 కిలోల అమ్మాయి/ అబ్బాయి కేవలం రెండు కిలోల స్కూల్ బ్యాగ్‌ను మోయాలి. 30 కిలోల బరువుంటే మూడు కిలోలే మోయాలి. ఒక అంచనా ప్రకారం ఇవాళ ప్రైమరీ లెవల్లో అంటే 5 వ తరగతి వరకూ పిల్లలు 6 నుంచి 12 కిలోల బరువున్న స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. హైస్కూలు పిల్లలు 12 నుంచి 17 కిలోల బరువు స్కూల్ బ్యాగులు మోస్తున్నారు. ఎన్.సి.ఇ.ఆర్.టి. తాజా స్కూల్ బ్యాగ్ పాలసీ ప్రకారం 5 వ తరగతి లోపు పిల్లలకు రెండున్న కేజీలకు మించి బరువు ఉండరాదు. 6 నుంచి 10 చదివే పిల్లలకు నాలుగున్నర కేజీలకు మించి బరువు ఉండరాదు. ఈ పాలసీను స్కూళ్లు గౌరవిస్తున్నాయా? ఆరోగ్య సమస్యలు స్కూల్ బ్యాగును మోయడం కూడా తప్పేనా అని కొందరు వితండంగా మాట్లాడవచ్చు గాని అవసరానికి మించిన బరువు వీపు మీద పిల్లలు రోజూ మోయడం వల్ల వారికి వెన్ను సమస్యలు వస్తాయి. పాదంపై పట్టు మారుతుంది. నడక తీరు మారుతుంది. భుజం నొప్పి వంటివి బాధిస్తాయి. రోజూ ఆ బరువు మోసుకెళ్లే విషయం వారికి ఆందోళన గురి చేస్తుంది. కొంతమంది పిల్లలు ఈ మోత మోయలేక ఏదో ఒక వంక పెట్టి స్కూల్ ఎగ్గొడుతున్నారన్న సంగతి నిపుణులు గమనించారు కూడా. ఇంత బరువు ఎందుకు? ప్రభుత్వం కాని/ ప్రయివేటు కాని/ ఛారిటీ స్కూళ్లుగాని పిల్లలు బాగా చదవాలని ఆరు నుంచి ఎనిమిది పిరియడ్లు చెబుతున్నారు. ప్రతి సబ్జెక్ట్ ప్రతిరోజూ ఉండేలా చూస్తున్నారు. ఆ సబ్జెక్ట్‌కు టెక్స్›్టబుక్, నోట్ బుక్, వర్క్‌బుక్... ఇవిగాక స్పెషల్ నోట్‌బుక్కులు... ఇన్ని ఉంటున్నాయి. నీటి వసతి లేకపోయినా తల్లిదండ్రుల జాగ్రత్త వల్ల వాటర్ బాటిల్ ఒక బరువు. లంచ్ లేని చోట లంచ్ బ్యాగ్. ఒక్కోసారి స్పోర్ట్స్ అని బ్యాట్లు కూడా మోసుకెళతారు. ఇన్ని బరువులు 15 ఏళ్ల లోపు పిల్లలు మోయడం గురించి ఎన్నోసార్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా, కోర్టులు మందలించినా పరిస్థితిలో మార్పులేదు. ఏం చేయాలి? స్కూళ్లల్లో ప్రతి పిల్లవాడూ టెక్స్›్టబుక్ తేవాల్సిన అవసరం లేని విధానం ఉండాలి. కొన్ని టెక్ట్స్›బుక్కులను క్లాసుల్లో ఉంచాలి. అలాగే ప్రతి క్లాస్‌లో తాళాలు ఉన్న బుక్షెల్ఫ్లను ఏర్పాటు చేసి విద్యార్థులు తమకు ఆ రోజుకు అవసరం లేని పుస్తకాలను అందులో పెట్టుకుని వెళ్లేలా చూడాలి. పిరియడ్లను తగ్గించాలి. రోజూ అన్ని సబ్జెక్ట్‌లు చెప్పాల్సిన అవసరం లేని రీతిలో టైంటేబుల్ వేయాలి. టైంటేబుల్లో లేని సబ్జెక్ట్ పుస్తకాలు తేవాల్సిన పని లేదని పిల్లలకు చెప్పాలి. అలాగే ప్రభుత్వాల వైపు నుంచి ఒక క్లాసు విద్యార్థికి అన్ని క్లాసుల టెక్స్›్టబుక్కులు ఎంత బరువు అవుతున్నాయో, ఏ సబ్జెక్ట్‌కు ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు ఉన్నాయో అంచనా వేయించాలి. ఒక సబ్జెక్ట్‌తో సంబంధం లేకుండా మరొక సబ్జెక్ట్ వారు పాఠ్యపుస్తకాలను తయారు చేసేలా కాకుండా అన్ని సబ్జెక్ట్‌ల వారూ ఆ ఫలానా క్లాసుకు మొత్తం ఎన్ని పేజీల పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నారో చూసుకోవాలి. అసలు ‘ఎక్కువ సిలబస్సే మంచి చదువు’ భావన పై చర్చ జరగాలి. ఇక తల్లిదండ్రులైతే ఎప్పటికప్పుడు పిల్లల బ్యాగులు చెక్ చేస్తూ వాటిలో అనవసరమైన వస్తువుల బరువు లేకుండా చూసుకోవాలి. టైమ్‌టేబుల్ చెక్ చేసి ఆ పుస్తకాలే ఉంచాలి. బస్ ఎక్కేప్పుడు దిగేప్పుడు ఆ బరువును అందుకునే వీలుంటే తప్పక అందుకోవాలి. పిల్లల భుజాలకు అనువైన సరైన బ్యాగ్‌లు కొనివ్వాలి. -
చిన్నారుల ఆరోగ్యానికి పాలు...
యూనివర్సల్ హెల్త్ డ్రింక్ ప్యాకేజీలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి బి1, బి2, బి12, విటమిన్లతో పాటు విటిమిన్ డి కూడా ఉంటుంది. తీపి పదార్ధాలతో పాటు అనేక డైరీ ఉత్పత్తులకు మూలం పాలు కాబట్టి.. వీటి వినియోగం అనేక లాభాలను అందిస్తుంది. పిల్లలకు పాల అవసరంపై పోషకాహార నిపుణులు, సిథ్స్ఫార్మ్స్ నిర్వాహకులు కిషోర్ ఇందుకూరి చెబుతున్న విశేషాలివే... అత్యుత్తమ పోషకాలు... పాలలో పొటాషియం మరియు కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎదుగుదల దశలో ఎముకల పెరుగుదలకు సహకరిస్తుంది. పాలు అనేది అన్ని పోషకాలను కలిగి ఉన్న ఏకైక పానీయం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, 6 నెలల నుంచి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలలో పాల వినియోగం తగ్గితే అది వారి 1.9% తక్కువ ఎదుగుదలకి దారితీస్తుంది. అలాగే పాలు తాగిన పిల్లల బరువు, ఎత్తులో తాగని వారితో పోలిస్తే 20% అధిక పెరుగుదల ఉంటుందని అంచనా వేసింది. అధ్యయనాల సారాంశం.. పిల్లలలో పాల వినియోగం ప్రభావాన్ని గుర్తించే అధ్యయనాలెన్నో వెలువడ్డాయి. పాలను క్రమం తప్పకుండా తీసుకున్న తర్వాత రక్తహీనత ఉన్న పిల్లల సంఖ్య తగ్గిందని ఫోర్టిఫైడ్ మిల్క్ ప్రోగ్రామ్ తేల్చింది. పిల్లలలో దృష్టి లోపాన్ని తగ్గించడంలో పాలు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పలు అధ్యయనాలు తేల్చాయి. పాలను ఎక్కువగా తాగడం ఐక్యు స్థాయిలలో గణనీయమైన మెరుగుదల, ఆటలు వంటి శారీరక శ్రమలపై వారికి ఆసక్తిని పెంచుతుందని కూడా ఇవి స్పష్టం చేశాయి. ఉత్పత్తిలో మిన్న కానీ... పాల ఉత్పత్తిలో భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారు అయినప్పటికీ 2018 గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి 10 మంది పిల్లలలో ముగ్గురు కంటే ఎక్కువ మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ నేపధ్యంలో పాల ప్రాముఖ్యత, పోషక విలువల దృష్ట్యా ఎన్డిబిబి ఫౌండేషన్ ఫర్ న్యూట్రిషన్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలోని ట్రస్ట్ బలవర్థకమైన ఫ్లేవర్డ్ మిల్క్ ను ప్రవేశపెట్టింది. చిన్న పిల్లలకు ఆహారంగా పాలప్రాముఖ్యత తెలియజెప్పేలా ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ జూన్ 1ని ప్రపంచ పాల దినోత్సవంగా ప్రకటించింది. – తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను, నాణ్యమైన ప్రోటీన్ అందించే గొప్ప వనరు పాలు. ఇది వయస్సు–సంబంధిత కండర నష్టాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది – కఠిన వ్యాయామం తర్వాత కండరాలు కోలుకోవడానికి సహకరిస్తుంది. –విటమిన్ డి, విటమిన్ కె, ఫాస్పరస్, మెగ్నీషియంతో సహా కాల్షియంను సరిగ్గా గ్రహించడానికి పాలు శరీరానికి సహాయపడతాయి. – బరువు తగ్గడానికి పాలు ఒక గొప్ప మార్గం ఊబకాయం ప్రమాదాన్ని నివారిస్తుంది కూడా. – పాలు అందరికీ నప్పకపోవచ్చు. వీరి కోసం నాన్–డైరీ మిల్క్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. – పాలను 3 నిమిషాల కంటే ఎక్కువ ఉడికిస్తే.. విలువైన పోషకాలను కోల్పోతుంది. – ప్లాస్టిక్ డబ్బాల్లో పాలను నిల్వ ఉంచడం లేదా మైక్రోవేవ్ చేయడం అనేవి క్యాన్సర్ కారకాలు. –కిషోర్ ఇందుకూరి, పోషకాహార నిపుణులు -
వాతావరణమే.. విలన్
పారిస్: వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచవ్యాప్తంగా పసిమొగ్గల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. శిలాజ ఇంధన ఉద్గారాలను కట్టడి చేయకపోతే భారత్ ఒకతరం ఆరోగ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తేల్చింది. భారత్‌లో దీని ప్రభావం అత్యధికంగా కనబడుతోందని వెల్లడించింది. గత 50 ఏళ్లుగా చిన్నారుల ఆరోగ్యానికి భారత్ ఎంతో కృషి చేసిందని, కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటివరకు చేసినదంతా వృథా కానుందని అంచనా వేసింది. ఇవాళ పుట్టిన ప్రతీ బిడ్డ భవిష్యత్‌ను వాతావరణంలో మార్పులే నిర్దేశిస్తాయని నివేదిక సహ రచయిత్రి పూర్ణిమ చెప్పారు. లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్, క్లైమేట్ ఛేంజ్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు సహా మరో 35 సంస్థలకు చెందిన 120 మంది పర్యావరణ నిపుణులు అధ్యయనం చేశారు. వాతావరణంలో మార్పులు, ప్రభావానికి సంబంధించి 41 అంశాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఆరోగ్యంపై ప్రభావం చూపించే అంశాలు ► కరువు పరిస్థితులు ► అంటు వ్యాధులు ► వరదలు ► వడగాడ్పులు ► కార్చిచ్చులు ఏయే వ్యాధులు వచ్చే అవకాశం ► నీటి కాలుష్యంతో డయేరియా ► వాయు కాలుష్యంతో ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు ► చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు ► డెంగీ వ్యాధి విజృంభణ ► గుండెపోటు ఏయే దేశాలపై ప్రభావం ► అత్యధిక జనాభా కలిగిన దేశాలు, వైద్య ఖర్చులు పెనుభారంగా మారిన దేశాలు, అసమానతలు, పేదరికం, పౌష్టికాహార లోపాలు కలిగిన భారత్ వంటి దేశాలపై వాతావరణంలో వస్తున్న మార్పులు పసివాళ్ల ఉసురు తీస్తున్నాయి. ► భారత్‌లో 2.1 కోట్ల మందిపై వాతావరణ మార్పుల ప్రభావం ► చైనాలో 1.7 కోట్ల మందికి ఆరోగ్య సమస్యలు ► 196 దేశాలకు గాను 152 దేశాలపై వాతావరణంలో మార్పులు అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయి. ► 2015లో భారత్‌లో వీచిన వడగాడ్పులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఇకపై సర్వసాధారణం కానున్నాయి. పరిష్కార మార్గాలేంటి ? ► ప్రతీ ఏడాది ప్రపంచ దేశాలు సగటున 7.4 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తే 2050 నాటికి 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోగలరు ► భారత్ థర్మల్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సంప్రదాయేతర ఇంధనంపైనే ఆధారపడాలి. ► ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి ► చెత్త, పంట వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. -
ఐఫోన్ల వ్యసనాన్ని మరింత తగ్గించండి
చిన్న పిల్లలు స్మార్ట్ఫోన్ల వాడకం రోజురోజుకి విపరీతంగా పెరిగిపోతుంది. ఈ స్మార్ట్ఫోన్ల వాడకంతో పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతూనే ఉంది. దీనిపై కేవలం తల్లిదండ్రులు మాత్రమే కాక, ఇటు కంపెనీలు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా చిన్నపిల్లల్లో రోజురోజుకి పెరుగుతున్న స్మార్ట్‌ఫోన్ వ్యసనంపై ఆపిల్ మరింత చర్యలు తీసుకోవాల్సిందిగా కంపెనీకి చెందిన ఇద్దరు ప్రముఖ ఇన్వెస్టర్లు వాదిస్తున్నారు. ఈ మేరకు ఈ టెక్నాలజీ దిగ్గజానికి వీరు ఓ లేఖ కూడా రాశారు. పిల్లలపై గాడ్జెట్లు, సోషల్ మీడియా వల్ల పెరిగిపోతున్న ప్రతికూల ప్రభావాన్ని హైలెట్ చేస్తూ న్యూయార్క్‌కు చెందిన జన పార్టనర్స్ ఎల్ఎల్సీ, ది కాలిఫోర్నియా స్టేట్ టీచర్స్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ఈ లేఖ రాశాయి. తమ డివైజ్‌ల్లో పిల్లలను స్మార్ట్ఫోన్ల వ్యసనం బారిన నుంచి కాపాడే టూల్స్‌ను మరిన్ని ఆఫర్ చేయాలని ఆపిల్‌ను ఈ ఇన్వెస్టర్లు కోరారు. దీంతో భవిష్యత్తులో ఆపిల్‌కు, పెట్టుబడిదారులకు ఎంతో మేలు చేకూరనుందని పేర్కొన్నారు. ఈ విషయంపై ఆపిల్ వెంటనే స్పందించలేదు. సోషల్ మీడియా, స్మార్ట్ఫోన్లు ఎక్కువ వాడకంతో పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపుతుందో నివేదించిన పలు రిపోర్టులను ఈ లేఖలో పేర్కొన్నారు. డిజిటల్ టెక్నాలజీ క్లాస్‌రూంలో అంతరాయం సృష్టిస్తుందని, విద్యాపరమైన అంశాలపై విద్యార్థుల దృష్టిని తగ్గిస్తుందని, ఆత్మహత్య, ఒత్తిడి వంటి వాటిన బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వీరు తమ లేఖలో తెలిపారు. తమ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మొబైల్ డివైజ్‌ల్లో ఆపిల్ సరికొత్త సాఫ్ట్వేర్లను ఆఫర్ చేయడం ప్రారంభించింది. -
బాలల ఆరోగ్య పరిరక్షణకు కృషి
కాట్రేనికోన : అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న బాలల ఆరోగ్య పరిరక్షణకు కృషిచేస్తున్నట్టు మహిళా శిశు సంజీవిని మిషన్ (యూనిసెఫ్) జిల్లా కోఆర్డినేటర్, కలెక్టర్ భార్య శ్రీదేవి పేర్కొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా శిశు సంజీవిని మిషన్ సభ్యుల బృం దం శనివారం దొంతికుర్రు పెదచెరువుపేట అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. బృం దాలుగా ఏర్పడి అంగన్వాడీ కేంద్రం పరిధిలోని పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ఆట వస్తువులు తదితర అంశాలను పరిశీలించారు. మరికొన్ని బృందాలు గ్రామంలో పర్యటించి సర్వే చేపట్టారు. అంగన్వాడీ కే ంద్రం గాలి వెలుతురు లేకుండా ఇరుకుగా ఉన్నాయి. పరిసరాలలో నీటి గుంత ఉండటంతో దోమలు పెరిగే పరిస్థితి ఉన్నట్టు గుర్తించారు. నీటిగుంత పూడ్చివేసేందుకు సహకరించాలని సర్పంచ్ పెయ్యల సత్యనారాయణను కోరారు. అనంతరం కాట్రేనికోన మండల పరిషత్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన దత్తత అంగన్వాడీ కేంద్రంలో బృంద సభ్యు లు పరిశీలించిన అంశాలను సమావేశంలో చర్చించారు. శ్రీదేవి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ,మహిళా శిశు సంజీవిని మిషన్ జిల్లా 11 సీడీపీఓల పరిధిలోని 50 కేంద్రాలను మోడల్ కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు దత్తత తీసుకున్నామన్నారు. ఆయా అంగన్వాడీ కేంద్రాలలో సమస్యలు, పిల్లల పౌష్టికాహారం తదితర అంశాలను గుర్తించి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎంపీడీఓ కనకలింగేశ్వరరావు, కాకినాడ, తుని, సామర్లకోట సీడీపీఓలు సావిత్రి, మాధవి, శారద సంపత్‌కుమారి, యూనిసెప్ ప్రతినిధులు కె.దుర్గాప్రసాద్, ఎం.గణేష్ తదితరులు ఉన్నారు. -
మీ సరదా కోసం మీ పిల్లల్ని బలి చేయకండి!
కొత్త పరిశోధన తండ్రులకు పొగతాగే అలవాటు ఉంటే, ఆ పొగ కుటుంబసభ్యులందరూ పీల్చడం (ప్యాసివ్ స్మోకింగ్)వల్ల అమాయకులైన వారి చిన్నపిల్లల ఆరోగ్యం దెబ్బతింటుదన్న సంగతి తెలిసిందే. ఇది ఇటీవలి రెండు అధ్యయనాల్లో ఈ విషయం మరింత స్పష్టంగా తేలింది. ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు దాదాపు 26 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ పరీక్ష ద్వారా తేలిన విషయం ఏమిటంటే... తండ్రులకు పొగతాగే అలవాటు ఉంటే, వారి పిల్లలు పెద్దయ్యాక వారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని తేలింది. పొగతాగే తండ్రుల ఈ పిల్లలను పెద్దయ్యాక పరీక్షించి చూస్తే... గుండె నుంచి మెదడుకు రక్తాన్ని చేరవేసే ‘కెరోటిడ్’ రక్తనాళాలు బాగా సన్నబడిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఈ పిల్లలు పెద్దవారయ్యాక పొగతాగకపోయినా, ఈ పరిణామాలు సంభవించడం పరిశోధనవేత్తలను తీవ్రంగా ఆందోళన పరిచింది. దాంతో పొగతాగని తండ్రుల పిల్లలతో పోలిస్తే, పొగతాగే అలవాటున్న తండ్రుల పిల్లలకు గుండెజబ్బు, పక్షవాతం వచ్చే అవకాశాలు 1.7 రెట్లు ఎక్కువ. పిల్లలకు ఈ రిస్క్‌ను తప్పించాలంటే తండ్రులు పొగతాగడం పూర్తిగా మానేయాలని ఈ పరిశోధనవేత్తలు ‘ద సర్క్యులేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో సూచిస్తున్నారు.