కే ఎఫ్‌సీని నిషేధించాలి
బాలల హక్కుల సంఘం డిమాండ్
- ఈ కొలి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లు
- మలమూత్ర విసర్జకాల్లో ఉండే పాథోజెన్స్ ఉనికి బట్టబయలు..
- తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులకు కారణమయ్యే విష పదార్థాలు..
- తెలంగాణ రాష్ట్ర ఆహార నాణ్యత పరిశోధన సంస్థ పరీక్షల్లో వెల్లడి
పంజగుట్ట: చూడగానే నోరూరించే కేఎఫ్‌సీ (కెంటకీ ఫ్రైడ్ చికెన్)లో అత్యంత విషతుల్యమైన అవశేషాలు ఉన్నట్లు వెల్లడైందని బాలల హక్కులసంఘం స్పష్టం చేసింది. మలమూత్ర విసర్జకాల్లో ఉండే పాథోజెన్స్తో ఈకొలి, సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉన్నట్లు తెలంగాణ ఆహార నాణ్యత పరిశోధన సంస్థ ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో నిర్ధారనైనట్టు సంఘం సభ్యులు తెలిపారు . వీటిని తిన డం వల్ల తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నట్టు చెప్పారు.
మ్యాగీ వివాదం మొదలైన తర్వాత కేఎఫ్‌సీ కెంటకీ ఫ్రైడ్ చికెన్‌లో నాణ్యత ప్రమాణాలపై తమకు అనుమానం వచ్చిందన్నారు. ఇటీవల హిమాయత్‌నగర్‌లోని కేఎఫ్సీలో చికెన్‌ను కొనుగోలు చేసి తెలంగాణ ఆహార నాణ్యత పరిశోధన సంస్థకు పంపగా, ఇందులో ఆరోగ్యానికి హాని చేసే అత్యంత విష పదార్థాలు ఉన్నట్లు తేలిందన్నారు. పిల్లల ఆరోగ్యానికి హాని చేస్తూ పరోక్షంగా వారి చావుకు కారణం అవుతున్న కేఎఫ్‌సీ కెంటకీ ఫ్రైడ్ చికెన్ విక్రయాలపై నిషేధం విధించి, నిర్వాహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలల హక్కుల కమిషన్ సభ్యుడు అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధ, ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ సుజాతాస్టీఫెన్ మాట్లాడుతూ కేఎఫ్‌సీ చికెన్‌లో టైఫాయిడ్, ప్యారాటైఫాయిడ్, అమిబియాసిస్, విరోచనాలకు కారణమవుతున్న విష పదార్థాలు ఉన్నాయని, వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చెప్పారు. దీనికి 68 శాతం సాల్మోనెల్లా బ్యాక్టీరియానే కారణమన్నారు.