నా మెడికల్ సీటు కేవీపీకి ఇచ్చారు
సాక్షి, నరసరావుపేట :తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే పిల్లల వైద్య నిపుణుడినయ్యేవాడినని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ గుల్బర్గాలో మెడిసిన్ చదివేందుకు వెళ్లానని, అయితే రాజకీయాలపై మక్కువతో వెనుదిరగడంతో ఆ సీటును కేవీపీ రామచంద్రరావుకు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
రాష్ట్ర సమైక్యత, సమగ్రతపై అసెంబ్లీలో రాజకీయాలను పక్కనపెట్టి సమైక్యవాదాన్ని వినిపించాలని కోరారు. రాష్ట్ర సమైక్యత విషయంలో ఆ టర్న్, ఈ టర్న్ అనే పదాలు లేకుండా ఐక్యతతో ముందుకెళ్లాలని చెప్పారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులంతా సమావేశం నిర్వహించి ఆ సమావేశానికి మంత్రులతో పాటు అన్ని రాజకీయ పక్షాలను ఒకచోటకు చేర్చడం హర్షణీయమన్నారు.
జాతీయ, రాష్ట్ర నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రాజీవ్‌గాందీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనపై డీజీపీతో మాట్లాడానని, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు.
నరసరావుపేట పట్టణంలో తెల్లవారుజామున మూడు గంటలకే మద్యం దుకాణాలు తెరుస్తున్నారని కొందరు మంత్రి కాసు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, లేనిపక్షంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ ఈఎస్‌ను హెచ్చరించారు.సమావేశంలో డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు, మిట్టపల్లి కోటేశ్వరరావు, పెనుగొండవెంకటేశ్వర్లు, ఏలూరి సుబ్బారెడ్డి, నేలటూరి మురళి, దుర్గాబాబు తదితరులు ఉన్నారు.