మొక్కక తప్పని చిల్లర దేవుళ్లు
లంబాడోళ్లు ఊరి మీద పడ్డారు. పెద్ద పెద్ద బాణాకర్రలు పట్టుకుని, జొన్నపిండి మూట గట్టుకుని, పిల్లా జల్లా ముసలీ ముతకా అంతా ఊరి మీద పడ్డారు. కరణం ఇంటి ముందు బైఠాయించారు. కరణం తండ్రి గతంలో వాళ్లకు ఠస్సా ఇచ్చాడు. డబ్బు తీసుకొని భూమి ఎగ్గొట్టాడు. కరణం చేతిలో ఇప్పుడు అధికారం ఉంది. తలుచుకుంటే భూమి ఇవ్వగలడు. కాని లంబాడోళ్లకు న్యాయంగా రావల్సిన భూమిని అతడు ఊరి పెద్ద నారయ్యకు అమ్ముకున్నాడు. దాని రాబడి అంతా నారయ్యే తింటున్నాడు. పాపం నోరులేని లంబాడోళ్లు. డబ్బూ పోయి భూమీ పోయి. అందుకే ఐసల్ ఫైసల్ తేల్చుకుందామని ఉగ్రంగా ఊరి మీద పడ్డారు.
ఇది తెలిసి కరణం గడగడా వొణికి ఇంట్లో దబ్కాయించాడు. ఊరి జనం తలుపులు బిడాయించుకుని సందుల్లో నుంచి భయం భయంగా మిర్రిమిర్రి చూస్తున్నారు. ఏ క్షణాన ఏదైనా జరగొచ్చు. కరణం ప్రాణాలు తీయడం ఖాయం. కాని ఆశ్చర్యం. తలుపు తీసుకుని కరణం ధైర్యంగా బయటకు వచ్చాడు. ‘ఏంరా లంజకొడుకుల్లారా. ఇంటి మీదకి హమ్ల చేయడానికి వస్తార్రా’ అని మీసం దువ్వాడు. ‘అదిగో కరణం’ అని లేచారు లంబాడోళ్లు. ఢాం. పిస్తోలు పేలింది. లంబాడోళ్లు అదిరిపడ్డారు. అమీన్ సాబ్. పోలీసులు. ఢాం... ఢాం... పేల్చుకుంటూ ఊడిపడ్డారు. దొరికినవాణ్ణి దొరికినట్టు తన్నారు. ఆడవాళ్ల సిగలు పట్టుకొని గుంజారు. చెట్లకు కట్టేశారు. కరణం అమీన్ సాబ్‌కు సారాయి పోయించి, విషం ఎక్కించి, చూపు ఆడవాళ్ల మీదకు పోనిచ్చాడు. ఒక లంబాడాది. మంచి వయసు మీద ఉన్నది. చచ్చింది. దాని మొగుడు? చచ్చాడు. అమీన్ సాబ్ ఇదంతా ఊహించలేదు. ఊరి మీదకు లంబాడోళ్లు వచ్చారు... ఇంటికొక రూపాయి ఇప్పిస్తాను... రక్షణగా రండి అని కరణం అంటే వచ్చాడు. ఆ చిల్లర ఇక్కడి దాకా తెచ్చింది. పోతే పోయాయి దిక్కులేని ప్రాణాలు. చిల్లరైతే చేతికి దక్కింది.
ఇదీ- చిల్లర దేవుళ్లు నవలలో ఒక భయానక సన్నివేశం.
ఏం బతుకులు అవి. నైజాం పాలకుని కాలంలో బతుకులు. పటేళ్లు, పట్వారీలు, దేశ్‌ముఖ్‌లు, దేశ్ పాండ్యాలు, భూస్వాములు.... అంతా పీక్కు తింటున్నారు. మూలవిరాట్టు- నైజాం నవాబు- పేరు చెప్పి ఈ చిల్లర దేవుళ్లందరూ ఊరేగుతున్నారు. వీరితో పోలీసులు మిలాఖాత్. దొర రామారెడ్డి తక్కువ తినలేదు. ఆ ఊరికి పేరు లేని దేవుడతడు. గడి కట్టుకొని, చేతిలో కొరడా పట్టుకొని, మదార్ సాబ్ వంటి కిరాతకులను రక్షణగా ఉంచుకొని, కరణం వంటి గుంటనక్కను పక్కన పెట్టుకొని... ఊరి మనుషులు బానిసలు. నీ బాంచన్ అని మోకాళ్ల మీదకు వొంగి, అరి చేతులను నేల మీద ఆనించి, ఆ మట్టిని ముఖానికి రాసుకుంటే తప్ప దొర దర్శనం ఇవ్వడు. రెండు కుండల గింజలు కావాలంటే దొరకు మొక్కాలి. సర్కారు తోపులో నాలుగు చింతకాయలు తెంపాలంటే దొరకు మొక్కాలి. పిల్లకు లగ్గం చేయాలంటే మొక్కాలి. ఏదైనా తకరారు వస్తే మొక్కాలి. భార్య, ఎదిగి ఏపుగా తయారైన కుమార్తె మూడో కంటికి కనపడరు. కాని ఊరి ఆడవాళ్లందరూ దొర కంట్లో పడాలి. వారు చల్లంగుండాలంటే దొరను చల్లబరచాలి. ఎక్కువ నచ్చితే గడిలో ఉంచుకుంటాడు. లేదంటే ఆడబాపను చేస్తాడు. ఆడబాప అంటే దాసి. అతిథుల శరీర సౌఖ్యాలను కూడా చూడాల్సిన బానిస.
వనజ!
ఎంత చక్కనిది. ఆ గడిలో ఆడబాప. పాపం దాని తల్లి ఎవరో. దొరే చెరబట్టాడు. కూతురు పుడితే కనికరం లేకుండా ఆడబాపను చేశాడు. అందరికీ తెలిసిన పాపాలు ఇవి. కాని ఎవరూ ఏమనకుండా నోరు కుట్టుకుని ఉండాలి. కరణం మాత్రం తక్కువా? మొగుణ్ణే బొందల పెట్టి వాని భార్యను ఇంట్లో పెట్టుకున్నాడు. ఇవన్నీ హైద్రాబాద్ దాకా పోతాయా? దర్బార్ వరకూ చేరుతాయా? ఆలా హజ్రత్- నిజామ్ ఉల్ ముల్క్- సర్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు తెలుస్తాయా?
ఈ గొడవ ఇలా ఉండగా అసలు దేవుళ్ల గొడవ ఇంకొకటి. ఇంత పెద్ద హైద్రాబాద్ స్టేట్, ఇంత పెద్ద ‘తురక’
పాలన, కాని రాష్ట్రంలో ఇంకా హిందువులు కనిపిస్తున్నారే. బ్రాహ్మణులు, వెలమలు, రెడ్లు, యాదవులు, గౌండ్లు... కడాన మాలలు, మాదిగలు. అల్లాహ్ పర్వర్దిగార్ వెలుగు వీరిని చేరదా? ఇస్లాం అజాన్ వీరికి వినిపించదా? తమ సరసన కూచోబెట్టుకోకుండా తాకితే మైల అని, చదువుకుంటే చెవుల్లో సీసం పోస్తామని, ఎదురు తిరిగితే కోసి పాతరేస్తామని హిందువులు అణచి ఉంచిన దళితులను కదా మొదట విముక్తం చేయాల్సింది. నిజాం తలపోత ఏదైనా చుట్టూ ఉండే చిల్లర దేవుళ్లు ఇస్లాం మార్పిడులు మొదలుపెట్టారు. మగాళ్ల మొలతాళ్లు తెంచి, తలలు గొరిగి, ఆడవాళ్ల మంగళ సూత్రాలు తెంచి, బొట్టు చెరిపి, వాళ్లను ఇస్లాంలోకి తెచ్చే పని. రెండు మంచి నీటి బావులు, నాలుగు కొత్త బట్టలు ఇస్తే దరిద్రులకు ఏ మతమైతే ఏంటి? ఇది క్రియ. దానికి ప్రతిక్రియ? చాలా సులభం. రాత్రికి రాత్రి రావడం. సీసాలో నుంచి కాసింత గంగా జలం మీద చిలకరించడం. మళ్లీ హిందువులను చేయడం. మన అల్లాహ్ గొప్పవాడు. మన హిందూమతానికి వేల ఏళ్లు. ఏ దేవుడు ఎలాగున్నా డబ్బున్న ముస్లిం మాసిన గడ్డాం వాణ్ణి కావలించుకోడు. పై కులంవాడు మాదిగ సరసన కూచుని ముద్ద ముట్టడు. చిల్లర బతుకులు ఎప్పటికీ చిల్లర బతుకులే.
ఇత్తహాదుల్ ముస్లమీన్ పుట్టింది. ప్రతిగా ఆర్య సమాజ్ ఆవిర్భవించింది. హిందూ మతానికి ఆలంబనగా తెలుగు భాష పేరున ఆంధ్ర జన సంఘం ఊపిరిపోసుకుంది. దేవుళ్ల హస్తముద్రల కింద, చిల్లర దేవుళ్ల ఇనప పాదాల కింద పుటపుటమని నలిగిపోతున్న జనం హాహాకారాలు.
ఇదంతా ఈ నవల కళ్లకు కట్టినట్టు చూపుతుంది. పాత తెలంగాణ పల్లెల్లోకి చేయి పట్టుకుని నడిపించుకుని- వారి వేష, భాష, రీతి, రివాజు, మోటు మనుషుల మానవత్వం, మెత్తనివాళ్ల దుర్మార్గ స్వభావం, అధికారం పేరు చెప్పి పీల్చి పిప్పి చేసే వ్యవస్థ, మిగిలిన అరా కొరా దేవుడి హుండీలో. ఇదంతా కళ్లకు కట్టినట్టు చూపుతుంది.
ఈ దుర్మార్గం నుంచి విముక్తి ఎప్పుడు? తమసోమా జ్యోతిర్గమయ ఎప్పుడు? అని వేదనతో చేసిన అక్షర
ఆక్రందన ఈ నవల.
ఏళ్లు గడిచిపోయాయి. ఇవాళ పాలనలో ఆంధ్ర పెత్తనం ఎక్కువైందని తెలంగాణ ఉద్యమం వచ్చింది. గతంలో హైద్రాబాద్ పాలనలో ముస్లింల పెత్తనం ఎక్కువైందనే ముఖ్యకారణాన నిజాం వ్యతిరేకత ఊపిరిపోసుకుంది. రాష్ట్రాలు విడిపోవచ్చు. కొత్త రాజధానులు ఏర్పడవచ్చు. కాని ఏలికలు మారరు. పాలకులు మారరు. చిల్లర దేవుళ్లూ మారరు. ఇవాళ బీదా బిక్కీ దేశాలను, వారి ఖనిజాలను, వారి ఇంధనాన్ని పీల్చి పిప్పి చేసి బెదిరించి అవసరమైతే అభయ హస్తం చూపించి ఆ చిల్లర మీద బతికే అతిపెద్ద మెగా చిల్లర దేవుడిగా అమెరికా ఆవిర్భవించింది. దీనిని కాచుకోవడం ఒకవైపు. మరోవైపు ఈ ప్రపంచంలో ఇంకా వేరే మతాలు ఉన్నాయా ఇది ఎలా సాధ్యం అని డాలర్లు కుమ్మరించే అగ్రరాజ్యాల క్రిస్టియన్ ఆసాములూ, రాత్రికి రాత్రి అంతా ఇస్లాంలోకి మారిపోలేదేమిటబ్బా అని దినార్లను ముష్టి రాల్చే అరబ్బు పెద్దలూ, మన హిందూ మతానికి ఈ గతి ఏమిరా అని బోరోమని ఏడ్చి, చానెళ్లతో కలిసి అక్కడా ఇక్కడా ఉన్న బీదాబిక్కీలను తిరిగి తమ పవిత్ర గంగాజల పరంపరలోకి తెచ్చే సరికొత్త స్వామీజీలూ... వీరిని కాచుకోవడం ఇంకో వైపు. ఎవరు ఏం చేసినా కథ మాత్రం అంతే. నోరులేనోళ్ల బతుకులంతే. మనిషికి చదువు కావాలని, వికాసం కావాలని, వాడు జ్ఞానం తెచ్చుకుని, ఒకరికి లొంగని బతుకు బతుకుతూ, నలుగురి హితం కోరుతూ, తనలోని దైవాన్ని- తాను తెలుసుకోదగ్గ దైవాన్ని- తెలుసుకునే రోజూ సమాజమూ ఏర్పడనంత కాలమూ ‘చిల్లర దేవుళ్లు’ చిరంజీవి.