టపాసుల దుకాణాలు దగ్ధం
ఆసిఫాబాద్ : దీపావళి పండుగ టపాసుల వ్యాపారుల్లో చీకటి మిగిల్చింది. మంగళవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో 12 దుకాణాలు, అక్కడే నిలిపి ఉంచిన ఐదు మోటారుసైకిళ్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. పట్టణంలోని జెడ్పీ గ్రౌండ్ ఆవరణలో దీపావళిని పురస్కరించుకుని రెండ్రోజులుగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి దుకాణాల వద్ద కొనుగోళ్లు సాగుతున్నాయి. దుకాణం నం8 ఎదుట చిన్నారి చైనా పిస్టల్ పేల్చడంతో నిప్పురవ్వలు దుకాణంలోని టపాసుల పడ్డాయి. దీంతో ఒక్కసారిగా టపాసులు పేలడం ప్రారంభమైంది.
అప్రమత్తమైన మిగితా దుకాణదారులు, కొనుగోలుదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. కొంతమంది వ్యాపారులు వ్యాపారులు అమ్మకం గళ్లపెట్టెలతో పరుగులు తీయగా.. మరికొందరు అక్కడే వదిలేసి ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నం చేశారు. క్షణాల్లో దుకాణాల్లోని బాణాసంచాతోపాటు దుకాణాల్లోని ఫర్నిచరల్, తక్త్ బల్లాలు, షెడ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు పక్క దుకాణాలకు వ్యాపించడంతో టపాసులు పేలి ఆ ప్రాంతం భయానంగా మారింది. మంటలు పెద్దయెత్తున ఎగిసిపడ్డాయి.
సమాచారం అందుకున్న ఫైర్‌సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. పేలుడు శబ్దానికి పట్టణవాసులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటి వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదురైంది. విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, సీఐ వెంకటేశ్, ఎస్సై రాంబాబు, తహశీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఆర్ఐ విష్ణు, మాజీ ఏఎంసీ చైర్మన్ చిలువేరు వెంకన్న సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.
నష్టపోయిన యవకులు
పట్టణంలోని నిరుద్యోగులు సీజనల్ వ్యాపారంలో భాగంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. సుమారు రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు విలువైన టపాసులతో దుకాణాలు ఏర్పాటు చేశారు. పెట్టుబడి పోగా, ఎంతో కొంత లాభం చేకూరుతుందనుకున్న వ్యాపారులకు ఈ ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.