మూడుచక్రాల కారుతో.. అదరగొట్టిన బుడ్డోడు!
చిన్నతనంలో మీరు మూడు చక్రాల కారు నడిపించారా? మామూలుగా అయితే ఇంట్లో.. మహా అయితే మీ సందులో ఎవరైనా పెద్దవాళ్లతో కలిసి మాత్రమే వెళ్లి ఉంటారు కదూ. కానీ, చైనాలో ఈ బుడ్డోడు మాత్రం అక్కడి కార్ల వాళ్లతో పాటు ట్రాఫిక్ పోలీసులకు కూడా చుక్కలు చూపించాడు. తన బొమ్మకారు తీసుకుని ఏకంగా మెయిన్ రోడ్డులోకి వెళ్లిపోయి.. మంచి బిజీగా ఉన్న రోడ్డులో పెద్దపెద్ద వాహనాల మధ్య నుంచి దూరి మరీ వెళ్లిపోయాడు. ఎదురుగుండా కార్లు వస్తున్నా, బస్సులు వస్తున్నా కూడా ఏమాత్రం భయం లేకుండా చకచకా తన మూడు చక్రాల కారు తీసుకుని రయ్యిమంటూ వెళ్లిపోయాడు.
చైనాలోని ఝెజియాంగ్ రాష్ట్రంలోగల లిషుయి నగరంలో ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం రికార్డయింది. ట్రాఫిక్కు కొంత అంతరాయం కలుగుతుండటంతో ఏంటా అని వచ్చి చూసిన పోలీసు.. ఈ బుడ్డోడిని చూసి కాసేపు ఆశ్చర్యపోయాడు. కాసేపు వాడితో కబుర్లు చెప్పి, నెమ్మదిగా వాడిని ఎత్తుకుని.. వాడి బొమ్మకారు కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జాగ్రత్తగా వాడి తల్లిదండ్రులకు అప్పగించాడు. చైనా సోషల్ మీడియా అయిన వైబోలో ఈ వీడియో చూసి అందరూ ముక్కు మీద వేలేసుకుంటున్నారు. వేలెడంత లేడు గానీ.. ఎంత పని చేశాడని ఆశ్చర్యపోతున్నారు. దాని మీద రకరకాల కామెంట్లు కూడా వచ్చాయి. కొంతమంది ట్రాఫిక్ పోలీసును మెచ్చుకుంటే.. మరికొందరు నిర్లక్ష్యంగా పిల్లవాడిని వదిలేసిన తల్లిని తిట్టారు. మరికొందరైతే.. చాలామంది డ్రైవర్లు ఆ పిల్లాడిని చూసినా, వాడిని రక్షిద్దామని మాత్రం ఎవరికీ అనిపించలేదా అంటూ సామాజిక స్పృహను ప్రశ్నించారు.