ఆక్వా వ్యర్థాలను తీరానికి తరలించొద్దు
నరసాపురం రూరల్: భీమవరం మండలం తుందుర్రులో ని ర్మిస్తున్న గోదావరి ఆక్వాఫుడ్ పార్కులో వ్యర్థాలను, ఫ్యాక్టరీని తీరానికి తరలించవద్దంటూ తీర ప్రాంత గ్రామ మత్స్యకారులు మంగళవారం ఆందోళన చేశారు. ఎంపీటీసీ సభ్యుడు మైల వసంతరావు నేతృత్వంలో చినమైనవానిలంక గ్రామంలో సముద్రం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వసంతరావు మాట్లాడుతూ మోళ్లపర్రు నుంచి బియ్యపుతిప్ప వరకూ తీర ప్రాంత గ్రామాల్లో వేలాది మంది మత్స్యకారులు మత్స్య సంపదపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. ఆక్వా పార్క్ వ్యర్థాలతో వీరి ఉపాధికి గండి పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ వ్యర్థాలను పైపుల ద్వారా సముద్రంలోకి తరలించినా లేదా ఫ్యాక్టరీని తీర ప్రాంతంలో నిర్మించినా మత్స్యకారులకు నష్టం వాటిల్లుతుందన్నారు. జల కాలుష్యం కారణంగా ఇప్పటికే మత్స్య సంపద తగ్గిపోయిందని, ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ వల్ల మరిం త ప్రమాదం తప్పదని అన్నారు. ఒడుగు జనార్దన్, మైల అర్జునరావు, ఒడుగు సంబమూర్తి తదితరులు ఉన్నారు.