‘పిల్లల నోట్ల’తో పంగనామం
జంగారెడ్డిగూడెం : నోట్ల మార్పిడి పేరిట పిల్లలు ఆడుకునే నోట్లు ఇచ్చి రూ.నాలుగు లక్షల కొత్తనోట్లతో ఉండాయించిన ఓ ముఠా ఘరానా మోసమిది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో కమీషన్‌కు కక్కుర్తిపడి మధ్యవర్తిగా ఉన్న పాపానికి ఓ వ్యక్తి చిత్రవధ అనుభవిస్తున్నాడు. దీనిపై బాధితుడు దాట్ల రవీందర్ పోలీసులను ఆశ్రయించాడు. అతని కథనం ప్రకారం.. గోపాలపురం మండలం హుకుంపేటకు చెందిన గిరిజనుడైన దాట్ల రవీందర్‌కు డిసెంబర్ 20న ఏలేటి శేఖర్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తమ వద్ద రూ.5లక్షల విలువైన రూ.500 పాత నోట్లు ఉన్నాయని, కొత్తనోట్లు కావాలని అడిగాడు. రూ.4 లక్షలు ఇస్తే మిగిలిన రూ.లక్ష కమీష¯ŒSగా తీసుకోవచ్చని ఆశ చూపాడు. దీంతో రవీందర్ తన వద్ద కొత్తనోట్లు లేవని, గోపాలపురానికి చెందిన సుతాపల్లి రామకృష్ణ వద్ద ఉన్నాయని, తాను మార్చి పెడతానని ఒప్పుకున్నాడు. సుతాపల్లి రామకృష్ణతో మాట్లాడి అతనికి పాత రూ.500 నోట్లు రూ.4.50 లక్షలు ఇచ్చేలా, మిగిలిన రూ. 50వేలు రవీందర్ కమీషన్‌గా తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ మేరకు డిసెంబర్ 21న సాయంత్రం గోపాలపురం గుడ్డిగూడెం రోడ్డులోని నిద్రగన్నేరు చెట్టు వద్దకు నగదు తీసుకుని రావాలని జంగారెడ్డిగూడెంలో సెల్‌షాపు నిర్వహిస్తున్న వెంకట్ రవీందర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో రవీందర్, సుతాపల్లి రామకృష్ణ , త్రినా«థ్ అనే మరోవ్యక్తి రూ.4 లక్షలు (రూ.2వేల కొత్తనోట్లు) తీసుకుని వెళ్లారు. అక్కడకు వంశీ, కోన రవి అలియాస్ జాన్ అనే వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై వచ్చి మైకా కవర్లో ప్యాక్ చేసిన రూ.500 పాత నోట్ల కట్టలు తెచ్చి వీరికిచ్చి, వీరి నుంచి కొత్త రూ. 2వేల నోట్లు రూ.4లక్షలు తీసుకుని మోటార్‌సైకిల్‌పై వేగంగా వెళ్లిపోయారు. మైకా కవర్లో ఉన్న బండిల్ తీసి చూసే సరికి అవి పిల్లలు ఆడుకునే చిల్ర్టన్ బ్యాంక్ రూ.500నోట్లుగా గుర్తించారు. దీంతో అసలు నగదు ఇచ్చిన సుతాపల్లి రామకృష్ణ గోపాలపురంలోని ఒక టీడీపీ నేత వద్ద అదే రోజు రాత్రి పంచాయితీ పెట్టాడు. దీంతో దాట్ల రవీందర్‌తోపాటు అతనితో ఉన్న స్నేహితుడు ప్రసాద్‌ను టీడీపీ నేత పిలిపించి నిర్బంధించాడు. పోలీసులకు ఇవ్వాలని రవీందర్ నుంచి రూ.25వేలు తీసుకున్నాడు. అయినా వారిని వదలకుండా ఆ రోజు రాత్రంతా ఇద్దరినీ నిర్బంధించి తీవ్రంగా కొట్టాడు. డిసెంబర్ 22న సాయంత్రం వారి నుంచి రెండు ఖాళీ చెక్కులు, రెండు ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు తీసుకుని వదిలారు. సుతాపల్లి రామకృష్ణ పోగొట్టుకున్న రూ.నాలుగు లక్షల్లో రూ.లక్షను డిసెంబర్ 31న రవీందర్ చెల్లించాడు. మిగిలిన సొమ్ము కోసం గోపాలపురానికి చెందిన టీడీపీ నేత రవీందర్‌ను వేధిస్తున్నాడు. దీంతో రవీందర్ ఈనెల 4న పోలీసులను ఆశ్రయించాడు.
దొంగనోట్ల ముఠా పనే
దొంగనోట్లు మార్చే కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి రవీందర్‌కు ఉచ్చువేసినట్ట తెలుస్తోంది. రవీందర్ ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న వ్యక్తులు గతంలో దొంగనోట్ల కేసులో అరెస్టైన వారే. ద్వారకాతిరుమల మండలం తూరల లక్షీ్మపురం గ్రామానికి చెందిన సుంకర ఆంజనేయులు, కోన రవి, జంగారెడ్డిగూడానికి చెందిన వెంకట్ , వంశీ, గోపాలపురం మండలం పెద్దగూడానికి చెందిన ఏలేటి శేఖర్, మధు, బుచ్చియపాలెంకు చెందిన కొండే ప్రభాకర్ ఒక ముఠాగా ఏర్పడి ఏలేటి శేఖర్ ద్వారా రవీందర్‌కు ఫోన్ చేయించి రూ.నాలుగు లక్షల కొత్తనోట్లు కొట్టేశారు.
4న పోలీసులకు ఫిర్యాదు
ఈనెల 4న రవీందర్ జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావుకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ గోపాలపురం పోలీసులకు కేసు విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం మొత్తం తనకు తెలుసునని ప్రభాకర్ అనే వ్యక్తి రంగంలోకి దిగాడు. తాను వ్యవహారం సెటిల్చేస్తానని, రూ. 4లక్షలు అంతా పంచేసుకున్నారని, తనకు రూ.లక్ష ఇస్తే వ్యవహారం సెటిల్ చేస్తానని రవీందర్‌కు ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఇంతలో పూర్వం నుంచి దొంగనోట్ల కేసుల్లో నిందితుడిగా ఉన్న సుంకర ఆంజనేయులును తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి పోలీసులు విచారణ కోసం తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా పిల్లలు ఆడుకునే చిల్ర్టన్ బ్యాంక్ రూ.500 నోట్లు గోపాలపురానికి చెందిన తెలుగుదేశం నాయకుడు తనవద్దే ఉంచుకుని రవీందర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం.
విచారణ చేస్తున్నాం
నోట్ల మార్పిడి కేసును విచారణ చేస్తున్నాం. దీనిని లోతుగా విచారణ చేయాలని జంగారెడ్డిగూడెం సీఐ, గోపాలపురం ఎస్సైలను ఆదేశించాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం. దీనిపై ప్రత్యేక సిబ్బందిని కూడా నియమిస్తాం – జె.వెంకటరావు, డీఎస్పీ