Chinna shankarampeta
-
ఏకంగా 47 నాగు పాములు ...
సాక్షి, మెదక్ : సాధారణంగా పాము మన కంటపడితేనే గుండె అదిరి అల్లంత దూరం పారిపోతాం. అలాంటి ఏకంగా 47 నాగుపాములు ఓ ఇంట్లో దర్శనమిస్తే..! నమ్మశక్యంగా లేదు కదూ. కానీ ఇది నిజం. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. గ్రామానికి చెందిన కొంక లచ్చల్ అనే వ్యక్తి తన ఇంటికి మరమ్మతులు చేసేందుకోసం మెట్లకింద ఉన్న పాత సామగ్రిని తీస్తుండగా 47 నాగు పాములు బయట పడ్డాయి. ఒకేసారి అన్ని పాములు బయట పడడంతో భయాందోళకు గురైన లచ్చల్, ఇరుగుపొరుగు వారి సాయంతో వాటిని మట్టుబెట్టాడు. -
హత్యచేసి బావిలో పడేశారు
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): అనుమానస్పద మృతిగా బావించిన మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన శ్రీలతను హత్యచేసి బావిలో పడేసినట్లు నిర్దారణకు వచ్చినట్లు తూప్రాన్ డీఎస్పీ కిరణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం చిన్నశంకరంపేట మండలంలోని మల్లుపల్లిలో మృతురాలి శవం లభించిన బావి వద్ద ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీలత బంధువులతో మాట్లాడి వివరాలు సేకరించారు. శ్రీలత కనిపించకుండాపోయి బావిలో శవమై తేలడంతో ఆగ్రహించిన శ్రీలత బంధువులు దాడులకు దిగిన విషయం తెలిసిందే. ముందు నుంచి శ్రీలతను హత్యచేసి బావిలో పడేశారని పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. మల్లుపల్లిలో విచారణ చేపడుతున్న డీఎస్పీ కిరణ్‌కుమార్ ఈ విషయంపై గ్రామంలో విచారణ జరిపిన డీఎస్పీ కేసుకు సంబంధించి మరిన్ని వివరాల నమోదు కోసం వ్యవసాయ బావి వద్ద పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీలత అనుమానస్పద మృతిపై విచారణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీలతను హత్యచేసి బావిలో పడేసినట్లు నిర్దారణకు వచ్చినట్లు తెలిపారు. నిందితులు ఎవరనేది తమ విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు. శ్రీలత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ ఉన్నారు. -
బోనమెత్తిన ఎమ్మెల్యే
సాక్షి, చిన్నశంకరంపేట(మెదక్): చిన్నశంకరంపేటలో కొలువైన శ్రీ సోమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బోనమెత్తారు. బుధవారం రాత్రి శ్రీసోమేశ్వర స్వామికి పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన బోనాన్ని ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి సమర్పించారు. -
సెల్ చార్జర్‌ను తీస్తుండగా.
చిన్నశంకరంపేట(మెదక్): సెల్‌పోన్ చార్జర్‌ను ప్లగ్ నుంచి తొలగిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో ఆదివారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మెంతం గారి నర్సింలు కుమారుడు శ్రీకాంత్(20) ఆదివారం ఉదయం ఇంట్లో సెల్‌పోన్‌కు చార్జింగ్ పెట్టాడు. అనంతరం ప్లగ్ నుంచి చార్జింగ్ తీస్తుండగా షాక్‌కి గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌ని తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకునే లోపే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు.∙ -
ఆ యువకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ
చిన్నశంకరంపేట(మెదక్): ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవాలని దళిత యువతిని వేధిస్తున్న యువకుడిని త్వరలో అరెస్టు చేస్తామని తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. సోమవారం చిన్నశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో బాధితులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నశంకరంపేటకు చెందిన దళిత యువతిని అదే గ్రామానికి చెందిన నిద్రబోయిన స్వామి ఐదు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని తెలిపారు. పెళ్లి చేసుకోవాలని బెదిరిస్తున్నాడని యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు తెలిపారు. యువకుడిని త్వరలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలతో నేరాల అదుపు సీసీ కెమెరాలతో నేరాలను అదుపు చేయడానికి చర్యలు చేపట్టినట్లు తూప్రాన్ డీఎస్పీ రామ్‌గోపాల్‌రావు తెలిపారు. తూప్రాన్ సబ్‌డివిజన్‌లో ఇప్పటికే 450 సీసీ కెమెరాలను అమర్చినట్లు తెలిపారు. -
అంధకారంలో చిన్నశంకరంపేట
చిన్నశంకరంపేట : సమాచారం లేకుండా రోజంతా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చిన్నశంకరంపేట మండలంలో గురువారం అంధకారం నెలకొంది. మండల కేంద్రంతోపాటు గ్రామాల్లో రాత్రి 9 గంటల వరకు కూడా కరెంట్ సరఫరా కాలేదు. ప్రభుత్వ కార్యాలయాలతోపాటు బ్యాంకుల్లో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. పలు పరిశ్రమల్లో పనులు స్తంభించాయి. మీర్జాపల్లి రైల్వేస్టేషన్లో ఆన్లైన్ వ్యవస్థ పనిచేయలేదు. మరోవైపు సిగ్నలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాన్స్‌కో ఏఈ అహ్మద్అలీ దీనిపై మాట్లాడుతూ టి.మాందాపూర్ వద్ద రోడ్డు నుండి గ్రామంలోకి వచ్చే విద్యుత్ వైర్లను సరిచేసేందుకు సరఫరా నిలిపివేసినట్లు చెప్పారు. -
పంట ఎండిందని ప్రాణం తీసుకున్నాడు
కష్టంచేసి పండించిన పంట కళ్లెదుటే ఎండిపోతుండటం తట్టుకోలేక ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కేశవ రాజయ్య(65) తన రెండెకరాల పొలంలో వరి, మొక్కజొన్న సాగుచేశాడు. పొలంలోని బోరులో నీరు తగ్గడంతో మరో బోరు వేశాడు. కాని అది ఫెయిలైంది. ఇంతకు ముందు రెండు బోర్లు వేసినా ఫలితం లేకపోయింది. నీళ్లకోసం ఇప్పటి వరకు రూ.2 లక్షలు అప్పుచేశాడు. పంటలు చేతికొస్తే అప్పు కొంతైన తీరుతుందని ఆశపడ్డ రాజయ్యకు నిరాశే ఎదురైంది. కళ్ల ముందే పంట ఎండిపోతుండటంతో మానసిక వేదనకు గురై.. గురువారం తెల్లవారుజామున ఇంటికి సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హామీలు విస్మరించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి
రామాయంపేట/ చిన్నశంకరంపేట : ఏ ఒక్క ఎన్నికల హామీ నెరవేర్చని కేసీఆర్‌కు మెదక్ ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు అన్నారు. ఆదివారం ఆయన చిన్నశంకరంపేట మండలం జప్తిశివునూర్ గ్రామ శివారులో ఉన్న అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు. ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి గెలుపు ఖాయమని, గ్రామాల్లో తమ ప్రచారానికి మంచి స్పందన వస్తుందన్నారు.ప్రస్తుతం పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో సునీతారెడ్డి మాత్రమే మచ్చలేని మహిళగా వెలుగొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీతోపాటు విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్ల పెంపుదల, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించడం వంటి హామీలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆయన ఆరోపించారు. ఇక బీజేపీకి అభ్యర్థులు దొరక్క జగ్గారెడ్డిని అరువు తెచ్చుకున్నారని, ఈ చర్య ఆపార్టీ దిగజారుడుతనానికి నిదర్శన మన్నారు. రెండు, మూడో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీపడుతున్నాయని టీఆర్ఎస్ నేతలు ప్రకటించడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. వీహెచ్ వెంట పార్టీ జిల్లా నాయకుడు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు అమరసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామచందర్‌గౌడ్, నాయకులు అహ్మద్, చింతల యాదగిరి, మెట్టుగంగారాం తదితరులు ఉన్నారు. నార్సింగిలో పొన్నాల లక్ష్మయ్య రోడ్ షో చేగుంట: ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు దాటినా హామీలు నెరవేర్చని టీఆర్ఎస్కు ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరఫున ఆదివారం నార్సింగిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. కేసీఆర్ హామీల్లో మొదటిదైన దళిత ముఖ్యమంత్రి, బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణం, ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూపంపిణీ హామీలు ఇంతవరకూ అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 160 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోగా కరెంటు కోసం రోడ్డెక్కిన అన్నదాతలను లాఠీలతో కొట్టించిందని ఆరోపించారు. చెయ్యి గుర్తుకు ఓటేసి సోనియా రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రాంచందర్ కుంతియా, ఎంపీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, సమన్వయకర్త డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కిష్టారెడ్డి, మండల ఇన్చార్జ్ కత్తి వెంకటస్వామి, మండల శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.