రామాయంపేట/ చిన్నశంకరంపేట : ఏ ఒక్క ఎన్నికల హామీ నెరవేర్చని కేసీఆర్‌కు మెదక్ ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు అన్నారు. ఆదివారం ఆయన చిన్నశంకరంపేట మండలం జప్తిశివునూర్ గ్రామ శివారులో ఉన్న అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారన్నారు.
ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతారెడ్డి గెలుపు ఖాయమని, గ్రామాల్లో తమ ప్రచారానికి మంచి స్పందన వస్తుందన్నారు.ప్రస్తుతం పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్థుల్లో సునీతారెడ్డి మాత్రమే మచ్చలేని మహిళగా వెలుగొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ఇచ్చిన రుణమాఫీతోపాటు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్ల పెంపుదల, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్దీకరించడం వంటి హామీలన్నీ ప్రకటనలకే పరిమితమయ్యాయని ఆయన ఆరోపించారు.
ఇక బీజేపీకి అభ్యర్థులు దొరక్క జగ్గారెడ్డిని అరువు తెచ్చుకున్నారని, ఈ చర్య ఆపార్టీ దిగజారుడుతనానికి నిదర్శన మన్నారు. రెండు, మూడో స్థానం కోసమే బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీపడుతున్నాయని టీఆర్‌ఎస్ నేతలు ప్రకటించడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. వీహెచ్ వెంట పార్టీ జిల్లా నాయకుడు తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు అమరసేనారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామచందర్‌గౌడ్, నాయకులు అహ్మద్, చింతల యాదగిరి, మెట్టుగంగారాం తదితరులు ఉన్నారు.
నార్సింగిలో పొన్నాల లక్ష్మయ్య రోడ్ షో
చేగుంట: ప్రభుత్వం ఏర్పాటై మూడు నెలలు దాటినా హామీలు నెరవేర్చని టీఆర్‌ఎస్‌కు ప్రజలు ఉప ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి తరఫున ఆదివారం నార్సింగిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ.. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న సునీతాలక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. కేసీఆర్ హామీల్లో మొదటిదైన దళిత ముఖ్యమంత్రి, బలహీనవర్గాలకు ఇళ్ల నిర్మాణం, ఎస్సీ ఎస్టీలకు 3 ఎకరాల భూపంపిణీ హామీలు ఇంతవరకూ అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 160 మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోగా కరెంటు కోసం రోడ్డెక్కిన అన్నదాతలను లాఠీలతో కొట్టించిందని ఆరోపించారు. చెయ్యి గుర్తుకు ఓటేసి సోనియా రుణం తీర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రాంచందర్ కుంతియా, ఎంపీ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, సమన్వయకర్త డాక్టర్ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కిష్టారెడ్డి, మండల ఇన్‌చార్జ్ కత్తి వెంకటస్వామి, మండల శాఖ అధ్యక్షుడు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
హామీలు విస్మరించిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పండి
Published Sun, Sep 7 2014 11:51 PM | Last Updated on Mon, Oct 8 2018 7:44 PM
Advertisement
Advertisement