అధికారం మాటున ఇసుక దందా
►అడ్డుకున్న రైతులు
► ఇరువర్గాల మధ్య వాగ్వాదం
► ఇసుక తరలింపులో ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ కీలకపాత్ర
► ఎమ్మెల్యే కురుగొండ్లకు చెప్పి చేస్తున్నామని చెప్పిన వైనం
బాలాయపల్లి(వెంకటగిరి) : అధికారం మాటున జరుగుతున్న ఇసుక దందాను రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆదివారం మండలంలోని నిండలి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిండలి గ్రామ సమీపం వద్ద ఉన్న కైవల్యానదిలో ఆదివారం ఇసుక తరలించేందుకు స్థానిక అధికార పార్టీ సర్పంచ్ తనయులు వెంకటరమణయ్య, చిన్నికృష్ణయ్య పూనుకున్నారు. ప్రొక్లైనర్తో ఇసుక తవ్వి ట్రాక్టర్లలో తరలించారు. కొంత ఇసుకను నిండలి గ్రామం పాతచెరువు సమీపంలోని ఊట్లబొంద వద్ద డంప్ చేశారు. కాగా వీరిలో కృష్ణయ్య ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ కావడం విశేషం.
అవస్థలు పడుతున్నాం..
ఇసుక తవ్వకం గురించి తెలుసుకున్న రైతులు సంఘటన స్థలానికి చేరుకుని అడ్డుకున్నారు. వీరికి ఇసుక తవ్విస్తున్న వారు నిండలి పంచాయతీలో చెక్ డ్యామ్ వర్కులు మేమే చేస్తున్నాం. దీని కోసం ఇసుక తవ్వి డంప్ చేస్తున్నామని చెప్పారు. దీంతో రైతులు మనుషులను పెట్టి ఇసుక తీసుకెళ్లాలని, ఇలా యంత్రాలతో తవ్వకం చేపట్టడం తగదన్నారు. ఇప్పటికే వర్షాలు కురవక, భూగర్భ జలాలు అడుగంటిపోయి తాగు, సాగునీటికి తీవ్రఇక్కట్లు పడుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఎమ్మెల్యే మా మనిషి
సంఘటన స్థలానికి వెళ్లి ఫొటోలు తీస్తున్న విలేకరులపై కూడా ఇసుక తవ్వకం చేపట్టిన వారు ఎమ్మెల్యేకు చెప్పి ఇసుక తరలిస్తున్నామని వాగ్వాదానికి దిగారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మా మనిషి.. ప్రభుత్వం మాది ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు.. అవసరమైతే సీఎం చంద్రబాబుకు దగ్గరికి వెళ్తామని రైతులతో అన్నారు. దీంతో అన్నదాతలు ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఇలాచేయడం తగదని చిన్నికృష్ణయ్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వెంకటగిరి సీఐ శ్రీనివాసరావు వర్క్ ఆర్డర్ గురించి ఆరాతీశారు. తవ్వకాలు చేపట్టిన దాంట్లో ఇసుకకు సంబం ధించి ఎలాంటి పత్రాల్లేవు. దీంతో డంప్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేశారు. ఆయన వెంట బాలాయపల్లి ఎస్సై నాగరాజు, పోలీసులు అంకయ్య, వీఆర్వోఓ కృష్ణయ్య, వీఆర్ఏ మాధవయ్యలున్నారు.
అనుమతి లేదు
నిండలిలోని కైవల్యానది నుంచి ఇసుక తరలింపునకు అనుమతి లేదు. పాత చెరువు ఊట్లబొంద వద్ద, వాక్యం గ్రామంలోని దళితవాడలో 40 ట్రాక్టర్ల ఇసుక డంప్ చేయడంపై కేసు నమోదుచేశాం. – రాంబాబు, ఇన్చార్జి తహసీల్దార్
రైతులు ఇక్కట్లు పడుతున్నారు
ఇసుక తరలించేందుకు అనుమతి ఇవ్వలేదు. భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇసుక తవ్వుకునేందుకు అనుమతి ఎలా ఇస్తాం? – కే వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ