ఇద్దరు వ్యక్తుల సజీవదహనం
చందర్లపాడు: తాటిమట్టలు నరుకుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ హృదయవిదారక సంఘటన చందర్లపాడు మండలం చింతలపాడు గ్రామంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన వలిబోయిన వెంకటేశ్వరరావు (35) ఇంటిముందు పందిరి వేసుకునేందుకు తాటాకుల కోసం మునేటి ఒడ్డున ఉన్న పామాయిల్ తోటకు వెళ్లాడు.
ఆ తోటకు కావలి కాస్తున్న ధారావత్ అర్జానాయక్ (55) సహాయంతో ఇనుప పైప్‌నకు కొడవలి కట్టి తాటిమట్టలు నరుకుతున్నాడు. ఇనుప పైప్ అదుపుతప్పి పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్‌పై పడడంతో ఒక్కసారిగా మంటలు వచ్చి ఇద్దరూ అక్కడికక్కడే కాలిపోయారు. వెంకటేశ్వరరావు కూలి పనులకు వెళుతుంటాడు. కాగా అర్జానాయక్ ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం మండలం కండ్రికకు చెందినవాడు.