1979 నుంచి ఎన్నికల ‘చింత’ లేదు
సాక్షి, మెంటాడ (విజయనగరం): పంచాయతీ ఎన్నికలనగానే కొట్లా టలు... వివాదాలు... వర్గ విభేదాలు... గొడవలు... ఇవీ మనం ఎక్కడైనా చూస్తాం. కానీ మెంటాడ మండలంలోని ఇద్దనవలస, చింతలవలస మాత్రం వాటికి అతీతం. ఒక్కమాటపై నిలబడతారు. ఒకే బాట నడుస్తారు. ఐకమత్యంగా మెలుగుతారు. కలసి కట్టుగా జీవిస్తారు. ఎన్నికలు ఏకగ్రీవం చేసుకుంటారు. పంచాయతీలు ఆవిర్భవించినప్పటినుంచీ ఇదే వారి బాట. అందుకే ఎన్నికలు వస్తే ఆ ఊళ్లో హడావుడి ఉండదు. కేవలం అందరూ అనుకుని ఒకరిని ఎన్నుకుని వారిచేత నామినేషన్ వేయించి, వారికే పదవులు కట్టబెడతారు. తమ గ్రామాల్లో ఎన్నికలే వద్దు, అభివృద్ధి మాత్రమే ముద్దు అని అంతా భావిస్తారు. ప్రభుత్వాలు ఇచ్చే ప్రోత్సహకాలతో పాటు పంచాయతీ నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నారు.
1979 నుండి ఎన్నికల ‘చింత’ లేదు
చింతలవలస గ్రామం 1979 వరకూ పిట్టాడ పంచాయతీ మధురగ్రామంగా ఉండేది. తాడ్డి సన్యాసినాయుడు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో పిట్టాడ నుంచి చింతలవలస గ్రామాన్ని వేరే పంచాయతీగా మార్చారు. 1979లో పూర్తిస్థాయి పంచాయతీగా ఏర్పాటైనప్పటినుంచి ఎన్నికలకు వెళ్లకుండా గ్రామ పెద్దలంతా ఒకేమాటపై గ్రామంలో ఏకగ్రీవంగానే పాలకవర్గాన్ని ఎన్నుకుంటున్నారు. ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో కూడా అదే పంథా కొనసాగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఇద్దనవలస గ్రామం
యుద్ధానికి దూరం ఇద్దనవలస
రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైనప్పటినుంచి ఇద్దనవలసలో ఎన్నికలు ఏకగ్రీవమే. గ్రామ అభివృద్ధి కోసం పెద్దలంతా ఒకేమాటపై ఉండి పంచాయతీ ఎన్నికలు తమ గ్రామంలో జరగకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులతో పాటు, ఇతర నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు.
అంతా ఒకే మాటమీద ఉంటాం
మా గ్రామంలో ఎన్ని రాజకీయపారీ్టలు నాయకులు ఉన్నా పంచాయతీ ఎన్నికలు అనేసరికి ఊరంతా ఒకటే అవుతాం. ఎన్నికలు నిర్వహించకుండా గ్రామాన్ని ఏకగ్రీవం చేసుకుంటాం. నాకు ఊహ తెలిసిన దగ్గరనుంచి మాగ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు. అభివృద్ధే మా అజెండా.
– భవిరెడ్డి నారాయణ, చింతలవలస
పెద్దల నిర్ణయమే అంతిమం
రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైనప్పటినుంచి మా గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరగనేలేదు. గ్రామ మంతా ఒకే మాటపై ఉండి రామమందిరం వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని గ్రామ పెద్ద లు చెప్పిన మాటకు విలువ నిస్తూ ఏకగ్రీవం చేసుకుంటాం. ఏకగ్రీవం అవ్వడం వల్లే మా గ్రామం ఎంతో అభివృద్ధి సాధించింది.
– రాయిపిల్లి రామారావు, ఇద్దనవలస