సీమ రైతు ఆవేదనకు అద్దం పట్టిన ‘చినుకుదీవి’
కర్నూలు (కల్చరల్) : ప్రముఖ కవి, రచయిత వెంకటకృష్ణ రచించిన ‘చినుకు దీవి’ కవితా సంకలనం సీమ రైతు ఆవేదనకు అద్దం పట్టిందని ప్రముఖ కవి, విమర్శకుడు రాధేయ తెలిపారు. స్థానిక మద్దూర్నగర్లోని పింగళిసూరన తెలుగు తోట ప్రాంగణంలో జరిగిన చినుకుదీవి పుస్తక పరిచయ సభలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. వెంకటకృష్ణ కవిత్వంలో రైతన్నల ఆక్రందనలు, నేతన్నల ఆపసోపాలు, ప్రస్తుత సమాజంలోని వికృత రూపం, మేధావుల, అభ్యుదయ వాదుల, తక్షణ కర్తవ్యం గురించిన సమాలోచన ఉందన్నారు. ఉద్యమ కాంక్ష కలిగిన కవిత్వ దృష్టికి అతడి కవిత్వమే నిజమైన ఉదాహరణ అన్నారు. ప్రముఖ రచయిత పాణి మాట్లాడుతూ భాషను భిన్నంగా ఉపయోగించడమే కవిత్వమన్నారు.
మనిషికి, కవిత్వానికి ఒక ప్రాచీన బంధం ఉందన్నారు. భౌతిక ప్రపంచమే ఆత్మిక ప్రపంచాన్ని దేదీప్యమానం చేస్తుందన్నారు. వెంకటకృష్ణ ‘లోగొంతుక’ దగ్గర నుంచి ‘దున్నే కొద్దీ దుఖం.. హంద్రీగానం.. చినుకుదీవి’ వరకు అణగారిన వర్గాల ఆక్రందనకు బలమైన గొంతుకగా నిలిచారన్నారు. కవిత్వం తనకు చాలా ఇష్టమైన ప్రక్రియ అని పేర్కొంటూనే రచయిత వెంకటకృష్ణ తాను పరిశీలిస్తున్న ప్రతి అంశాన్ని కవిత్వంగా, కథగా మార్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రముఖ కవి రచయిత జంధ్యాల రఘుబాబు, కవి వెంకటకృష్ణ, నవలా రచయిత ఎస్డీవీ హజీజ్, కవి కెంగారమోహన్, సాహితీ వేత్త ఏవీ రెడ్డి పాల్గొన్నారు.