అంతర్ జిల్లాల దొంగలకు సంకెళ్లు
సాక్షి, చీరాల రూరల్: ఒంటరిగా రాత్రి సమయంలో ప్రయాణించే ప్రయాణికులను గుర్తించి వెంబడించి దాడి చేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నగదును దోచుకుంటున్న ఐదుగురు దారి దోపిడీ దొంగల ముఠాను సోమవారం చీరాల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద రూ.9 వేల నగదు, నేరాలకు ఉపయోగించే ఆటో, రెండు స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు అపహరించిన నాలుగున్నర సవర్ల బంగారు వస్తువులను ముత్తుట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ లక్ష రూపాయలు ఉంటుంది. సోమవారం స్థానిక ఒన్‌టౌన్ పోలీసుస్టేషన్లో సీఐ ఎన్.నాగ మల్లేశ్వరరావుతో కలిసి డీఎస్పీ వై.జయరామ సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్టుపురానికి చెందిన దేవర నవీన్, తమ్మిశెట్టి శ్రావణ్, తమ్మిశెట్టి సుభాష్ (వీరు అన్నదమ్ములు), గుంటూరు జిల్లా తెనాలి మురిప్పేటకు చెందిన గరిక గోపి, తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన గరిక సంపత్‌లు ముఠాగా ఏర్పడ్డారు.
వీరు అతి తక్కువ సమయంలో డబ్బులు సంపాదించి జల్సాలు చేయాలని భావించారు. అందుకు దారి దోపిడీలకు పాల్పడాలని ప్రణాళికలు రచించారు. వారంతా అనుకున్నదే తడవుగా తమ ప్రణాళిను కార్యరూపంలోకి తీసుకొచ్చి అమలు పరిచారు. వీరందరిపై అనేక జిల్లాల్లోని పోలీసుస్టేషన్‌ల్లో కేసులు నమోదయ్యాయి. వీరిలో తమ్మిశెట్టి శ్రావణ్‌పై కావలిలో ఒక దారిదోపిడీ కేసు, వెదుళ్లపల్లి పోలీసుస్టేషన్లో సస్పెక్టు షీటు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. ముఠాగా ఏర్పడిన వీరంతా ముందుగా బస్టాండ్, రైల్వేస్టేషన్ల వద్ద రాత్రి సమయంలో సంచరిస్తుంటారు. ఒంటరిగా ఊళ్లకు వెళ్లే ప్రయాణికులను లక్ష్యంగా ఎంచుకుంటారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం ఐదుగురు దొంగలు మూడు కేసుల్లో పట్టుబడ్డారు.
ఇదీ..బాధితుల చిట్టా
ఈ ఏడాది ఏప్రిల్‌లో చీరాల నవాబుపేటకు చెందిన పఠాన్ కాలేషా వలి రాత్రి సమయంలో రైల్వేస్టేషన్ రోడ్డులో సైకిల్‌పై వెళ్తుండగా ఈ ఐదురుగు దొంగల ముఠా సభ్యులు కాలేషా వలిని అడ్డగించిæ అతనిపై దాడి చేసి రూ.9 వేల నగదు దోచుకున్నారు. పొన్నూరుకు చెందిన బచ్చు వెంకట శివప్రసాద్ బాపట్లలో వ్యాపారం చేస్తుంటాడు. అతడు ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన తన వ్యాపారం ముగించుకుని రాత్రి సమయంలో బైకుపై తన స్వగ్రామం పొన్నూరుకు వెళ్తున్నాడు. అప్పికట్ల సమీపంలో వెంకట శివ ప్రసాద్‌ను అడ్డగించి అతడిపై దాడి చేసి రెండు బంగారు ఉంగరాలు అపహరించారు. పర్చూరుకు చెందిన కోట భార్గవ్ తేజ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడు ఈ నెల 14న రాత్రి 11:45 గంటలకు చీరాలలో రైలు దిగి తన బైకుపై పర్చూరు వెళ్తున్నాడు పట్టణ శివారు ప్రాంతం కారంచేడు రోడ్డులోని మంచినీటి చెరువు సమీపంలో భార్గవ్‌ను అనుసరించి అతడిపై దాడి చేసి రెండున్నర సవర్ల బంగారు గొలుసు తీసుకెళ్లారు. ఈ కేసులను సంబంధించి బాధితులందరూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదులు చేశారు.
ఎస్పీ ఈ కేసులపై ప్రత్యేక దృష్టి సారించారు. డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక బృందాలు చీరాల ఒన్‌టౌన్ సీఐ ఎన్.నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తును వేగవంతం చేశారు. సీపీ టీవీ పుటేజీల ఆధారంగా కేసులను అతి తక్కువ సమయంలో ఛేదించి నిందితులను సోమవారం చీరాలలోని దండుబాట రోడ్డులో అరెస్టు చేశారు. బాధితుల వద్ద నిందితులు అపహరించిన నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసులపై ప్రత్యేక దృష్టి సారించి నిందితులను అరెస్టు చేసిన సీఐ, ఎస్ఐలు పి.సురేష్, నాగ శ్రీను, హెడ్ కానిస్టేబుళ్లు పిల్లి రవికుమార్, తన్నీరు శ్రీనివాసరావు, బొల్లెద్దు అచ్చయ్య, కానిస్టేబుల్ రమేష్‌లను డీఎస్పీ అభినందించారు. వీరందరికి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ చేతుల మీదుగా రివార్డులు అందించనున్నట్లు డీఎస్పీ చెప్పారు.
ప్రయాణికులను అనుసరించేదిలా..
దొంగల ముఠాగా ఏర్పడిన వీరంతా రాత్రి సమయంలో రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల్లో సంచరిస్తుంటారు. ఒంటరిగా నిలబడి వాహనాల కోసం ఎదురు చూసే ప్రయాణిలను ముఠా సభ్యులు గుర్తిస్తారు. ఎంచుకున్న ప్రయాణిలను అనుసరించేందుకు దొంగల ముఠా సభ్యుల వద్ద ఒక ఆటో, రెండు స్కూటీలు రెడీగా ఉంటాయి. దొంగలు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వారి వద్ద ఉండే ఆటోతో ముఠాలోని సభ్యుడు ఆటోవాలా మాదిరిగా పోజులిచ్చి వాహనం కోసం ఎదురు చూసే ప్రయాణికుని వద్ద ఆటో నిలుపుతాడు. ఈ లోగా ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు ఆటోలో తామూ వస్తామంటూ ప్రయాణికునికి వినబడే విధంగా ఆటోవాలాతో మాట్లాడుతారు.
మరో ఇద్దరు ప్రయాణికులు తనకు తోడుగా ఉంటారనుకున్న అసలైన ప్రయాణికుడు దొంగల ముఠాకు చెందిన ఆటో ఎక్కుతాడు. దొంగల ముఠాలోని మరో ఇద్దరు సభ్యులు ఆటోను అనుసరిస్తుంటారు. ఆటో నిర్జన ప్రదేశంలోకి వెళ్లిన తర్వాత ముఠాలోని ఐదుగురూ ప్రయాణికుడిపై దాడి చేసి అతడి వద్ద ఉ జండే నగదు, బంగారు వస్తువులను అవలీలగా అపహరిస్తారు. రాత్రి సమయంలో ఒంటరిగా ఆటోల్లో ప్రయాణించవద్దని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి సూచించారు. రాత్రి సమయంలో అనుమానాస్పదంగా రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద సంచరించే వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.