పునరావాసం.. వనవాసం
కదిలిస్తే కన్నీళ్లు
ఇరుకుగదులు.. చీకట్లో జీవితాలు
పిల్లపాపలతో రాత్రంతా జాగారం
చెట్టుకొకరు.. గుట్టకొకరు చీర్లవంచ నిర్వాసితులు
పునరావాస కాలనీలో దుర్భరజీవితం
ముంపులో అత్యధిక బాధితులు దళిత కుటుంబాలే..
సిరిసిల్ల రూరల్: నిన్నమొన్నటి వరకు వారు పది మందికి అన్నం పెట్టి ఆదుకున్న ఆపద్బాంధవులు. నేడు మధ్యమానేరులో సర్వం కోల్పోయారు. పునరావాస కేంద్రంలో ఓ పూట తిండి కోసం ఎదురుచూడాల్సిన దుర్భర పరిస్థితి. కనీస సౌకర్యాలు లేకపోవడంతో పునరావాస కేంద్రాలు వనవాసాలుగా మారాయి. దీంతో నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిరిసిల్ల మధ్యమానేరులో ముంపునకు గురై ఊరి ఖాళీ చేసి పుట్టెడు దుఃఖంతో వెళ్లిపోయి పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న చీర్లవంచ నిర్వాసితులపై కథనం.
సిరిసిల్ల మండలం చీర్లవంచలో నిర్వాసితులను ఎవరు కదిలించినా కన్నీళ్లే కనిపిస్తున్నాయి. మధ్యమానేరులో సుమారు నాలుగు టీఎంసీల నీరు నిలిచి బ్యాక్‌వాటర్ గ్రామాన్ని ముంపుకు గురిచేసింది. దీంతో అధికారులు ౖహె అలర్ట్ ప్రకటించి 500 కుటుంబాలను ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. పూర్తిస్థాయి పరిహారం రాకున్నా ప్రాణభయంతో పిల్లాపాపలతో సామానులు సర్దుకుని తాత్కాలిక పునరావాస కేంద్రాల్లోకి పరుగులుతీశారు. కరెంట్, మరుగుదొడ్లు లేని చోట తలదాచుకున్నారు. వర్షానికి రాత్రంతా నిద్రలేకుండా జాగారంచేశారు. ఎన్నాడు ఇతరులకు పెట్టడమే తప్ప తాము తీసుకునే పరిస్థితో బతికిన వారు పునరావాస కేంద్రాల్లో పేట్లు పట్టుకుని బుక్కెడు బువ్వకోసం నిలబడాల్సిన పరిస్థితిని తలచుకుని బోరున విలపించారు. నిర్వాసితులను చూసేందుకు ఇతర గ్రామాలనుంచి వచ్చి బం«ధువులు, పుట్టింటివారిని చూసి దుఃఖం ఆపుకోలేక రోదించారు. చంటిపిల్లలను పట్టుకుని ఫ్యాన్లు, కరెంట్ లేని చిన్న గదుల్లో పదేసి కుటుంబాలు తలదాచుకున్నాయి. ఈ చీకటి రాత్రిని చీర్లవంచ నిర్వాసితులు మరచిపోలేకపోతున్నారు. ఆదివారం రాత్రి ఎలాగో పునరావాకేంద్రంలో తలదాచుకుని తెల్లవారి బంధువుల ఇంటికి చాలామంది తమ పిల్లలను తీసుకుని వెళ్లిపోయారు. ఏ ఆధారంలేని వారు ఈ పునరావాస కేంద్రాల్లోనే జీవనం వెళ్లదీస్తున్నారు. గ్రామంలోని నీరుపోతే మళ్లీ అదే ఇంట్లోకి వెళ్లి ఉందామని చాలామంది నిర్వాసితులు వేచిచూస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ యంత్రాంగం పునరావాస కేంద్రంలోని నిర్వాసితులకు భోజనఏర్పాట్లు చేస్తున్నారు.
బతికుండగానే చంపుతున్నారు..?
‘గ్రామంలో ఇంకా 600 మందికి పూర్తిస్థాయి పరిహారం రాలేదు. 450 మందికి ఇళ్ల పైసలు రాలేదు. చాలామంది అర్హులకు ప్లాట్లు కేటాయించలేదు. మరికొందరికి కోరుకున్న చోట కాకుండా మరోచోట పట్టాలిచ్చారని’ నిర్వాసితులు గోడు వెల్లబోసుకున్నారు. ‘మా డబ్బులు మాకిస్తే ఎక్కడో ఓ జాగల బతుకుతాం కదా. ఇలా బతికుండా ఎందుకు మమ్ములను చంపుతున్నారు’ అని ప్రశ్నించారు. మేం చచ్చాక పరిహారం ఇస్తారా.. అంటూ నిలదీశారు. ఏ ప్రభుత్వం వచ్చిన నిర్వాసితుల గోడును పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఆశలు పెట్టుకునన్నామని, తమకు న్యాయం చేయాలని, పరిహారం ఇవ్వకముందే తమను ఊళ్లో నుంచి వెళ్లగొట్టొద్దని వేడుకున్నారు.
జాగ లేక రేకులు వేసుకున్నాం..
–ఆలుగొండ మల్లవ్వ
ఒక్కసారిగా నీరు రావడంతో ఇల్లు మునుగుతుందోనని అధికారులు ఏర్పాటుచేసిన వ్యాన్‌లో సామానులు సర్దుకుని నాయినూరిపల్లి పునరరావాస కేంద్రానికి వచ్చాం. ఇక్కడ ఉండడానికి జాగలేదు. మాకు కేటాయించిన స్థలంలో అప్పటికప్పుడు రేకుల షెడ్డు ఏర్పాటు చేసుకుని ఉంటున్నం. ఈ రేకులు కూడా వాన వచ్చినా.. గాలివచ్చినా కూలిపోతుంది.
రాత్రంతా నిద్ర పోలే..
– మాన్వాడ దుర్గవ్వ
సీకట్ల పొరగండ్లను పట్టుకుని ఇక్కడికి వచ్చి గోసపడ్డం. సార్లు ఇంత బువ్వపెట్టిండ్రు. కరెంటు లేదు ఏంలేదు. రాత్రంతా నిద్రపోకుండా మెలకువతోనే జాగారం చేసినం. ఎప్పడు తెల్లరుతుంది అని చూసినం.
గింత పరిస్థితి వస్తదనుకోలేదు
–నెల్లుట్ల కనకయ్య
గింత బతుకు బతికి గీ పరిస్థితి వస్తదనుకోలే. ఒక్కసారిగా ఇండ్లలోకి నీళ్లు వస్తే గీ ముసలిదాని పట్టుకుని గీ వయసుల ఎక్కడికని పోతాం. అయ్యో భగవంతా.. అని ఈ బడిలకు వచ్చి తలదాచుకున్నం. ఉన్న నాలుగెకరాలు డ్యాంల పోయింది. గిప్పుడు ఇల్లు మునిగింది. ఉండానికి ఇల్లు కూడా లేదు. మేం ఎట్ల బతికేది.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
– మచ్చ లక్ష్మణ్.ఉపసర్పంచ్, చీర్లవంచ
చీర్లవంచ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వడంలో, సర్వేలు చేయడంతో అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. ఉన్నోడికి ఒక విధంగా, లేనోడికి ఒక విధంగా పరిహారం ప్రకటించి మా పొట్ట కొట్టారు. ఇప్పుడు ఊళ్లోకి నీళ్ల వస్తాయని కుటుంబాలను తరలించి ఇబ్బందులు పెడుతున్నారు.