chit funds company
-
చిట్‌ఫండ్ అక్రమాలు బట్టబయలు
సాక్షి, అమరావతి: చిట్‌ఫండ్ కంపెనీల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, మోసాలు బట్టబయలయ్యాయి. రాష్ట్రంలోని అనేక కంపెనీలు చిట్ల పేరుతో సామాన్యులు చెమటోడ్చి సంపాదించుకున్న సొమ్మును దుర్వినియోగం చేస్తున్నట్లు స్పష్టమైంది. చిట్‌ఫండ్ కంపెనీలపై జిల్లాల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ఇటీవల రిజిస్ట్రేషన్లశాఖ రాష్ట్రవ్యాప్తంగా పలు కంపెనీల్లో తనిఖీలు చేసింది. జీఎస్టీ, పోలీసు అధికారులను కూడా తనిఖీ బృందాల్లో ఉంచి ఆ కంపెనీల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ తనిఖీల్లో పలు కంపెనీల్లో అక్రమాలు, మోసాలు జరిగినట్లు గుర్తించారు. చాలా కంపెనీలు చిట్స్ ద్వారా వసూలు చేసిన డబ్బును ఇతర కార్యకలాపాలకు మళ్లిస్తున్నట్లు గుర్తించారు. పలు కంపెనీలు చిట్‌ఫండ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆ డబ్బును వడ్డీలకు తిప్పుతున్నట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినట్టు స్పష్టమైంది. కొన్ని కంపెనీలు వసూలు చేసిన చిట్స్ డబ్బును తమ అనుబంధ కంపెనీలకు మళ్లించి వ్యాపారం చేసుకుంటున్నట్లు తేలింది. చిట్ల రికార్డులు, ఖాతాలు కూడా సరిగ్గా నిర్వహించడం లేదని వెల్లడైంది. చిట్స్ పాడుకున్నవారికి వాటి కాలం తీరిన తర్వాత కూడా చెల్లించని ఘటనలు లెక్కలేనన్ని ఉన్నట్లు తెలిసింది. అనుమతులు లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ కొన్ని కంపెనీలు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నట్టు తేలింది. చిట్లు పాడిన తర్వాత, గ్యారెంటీల ప్రక్రియ ముగిసేలోపు ఆ డబ్బును ప్రత్యేక బ్యాంకు ఖాతాలకు కాకుండా వేరేరకంగా వినియోగించుకున్నట్లు వెల్లడైంది. కొన్నిచోట్ల ప్రత్యేక ఖాతాల్లో ఉంచిన డబ్బును అదేరోజు వెనక్కి తీసుకున్న సందర్భాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే తాము నిర్వహిస్తున్న చిట్లపై ప్రభుత్వానికి తప్పుడు ఓచర్లు సమర్పిస్తున్నట్టు తేలింది. నగదు నిర్వహణలో తీవ్ర ఉల్లంఘనలు జరిగాయి. చిట్ల డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయకపోవడం, ఆ డబ్బుకు సంబంధించి నగదు రశీదులు.. వోచర్లు ఇవ్వకపోవడాన్ని తనిఖీ అధికారులు గుర్తించారు. కొన్ని లావాదేవీలపై నేరుగా ఆదాయపన్ను శాఖ పెనాల్టీ పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. జీఎస్టీ చట్టాన్ని కూడా చిట్‌ఫండ్ కంపెనీలు ఉల్లంఘిస్తున్నట్టు తేలింది. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అక్రమాలు జరిగిన కంపెనీలు, వాటి వివరాలను అందులో పొందుపరిచారు. వాటి ఆధారంగా అక్రమాలు జరిగిన కంపెనీలపై చట్టప్రకారం చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. -
చిట్‌ఫండ్’కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: చట్టబద్ధ చిట్‌ఫండ్స్ కంపెనీలకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చిట్స్ నిర్వహిస్తున్న వ్యక్తి తీసుకునే కమీషన్‌ను ప్రస్తుతం ఉన్న 5% నుంచి 7 శాతానికి పెంచుతూ ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. అలాగే, చిట్ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. ‘ది చిట్‌ఫండ్స్ (అమెండ్మెంట్)బిల్, 2019’పై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ మాట్లాడుతూ.. చిట్‌ఫండ్స్‌ను అనధికార, అనియంత్రిత డిపాజిట్ పథకాలు, లేదా పోంజీ స్కీమ్స్‌తో పోల్చకూడదని పేర్కొన్నారు. ఒకరు లేదా నలుగురి లోపు వ్యక్తులు నిర్వహించే చిట్స్ గరిష్ట మొత్తాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షలకు పెంచేలా.. నలుగురు లేదా ఆపై సంఖ్యలో నిర్వాహకులున్న చిట్‌ఫండ్ సంస్థల్లో చిట్స్ మొత్తాన్ని రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షలకు పెంచేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చిట్‌ఫండ్ నిర్వాహకుడి కమిషన్‌ను 5% నుంచి పెంచి 7% చేశారు. ‘చిట్ అమౌంట్’ను ఇకపై ‘గ్రాస్ చిట్ అమౌంట్’ అని, డివిడెండ్‌ను ‘షేర్ ఆఫ్ డిస్కౌంట్’ అని, ‘ప్రైజ్ అమౌంట్’ను ‘నెట్ చిట్‌ఫండ్’ అని పేర్కొనాలని బిల్లులో స్పష్టం చేశారు. కనీస మొత్తం (బేస్ అమౌంట్) రూ. 100 అని పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఆ కనీస మొత్తాన్ని నిర్ధారించే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించారు. అవసరమనుకుంటే, చిట్‌ఫండ్ వినియోగదారులు చిట్ మొత్తానికి బీమా చేయించుకోవచ్చు కానీ వినియోగదారులపై భారం మరింత పెరుగుతుందనే ఆలోచనతో.. బీమాను కచ్చితం చేయాలనుకోవడం లేదని బిల్లుపై చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ తెలిపారు. -
చిట్స్ కార్యాలయంలో కానిస్టేబుల్ వీరంగం
రాజంపేట: రాజంపేట పట్టణం ప్రధాన రహదారిలో ఉన్న విజయ్ప్రగతి చిట్స్ ప్రైవేటు లిమిటెడ్ కార్యాలయంలో కడపకు చెందిన కానిస్టేబుల్ రామ్మోహన్‌రెడ్డి వీరంగం సృష్టించాడు. బుధవారం సాయంత్రం జరిగిన సంఘటనపై సంస్థ యాజమాన్యం తరపున ఫోర్‌మెన్ యల్లటూరు శివకుమార్‌రాజు పట్టణ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేశారు. రాజంపేట పట్టణంలో విజయ్ ప్రగతి చిట్ ప్రైవేటు లిమిటెడ్‌ను 2013లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు ఎండీగా గిరిరాజు వ్యవహరించారు. చిట్ బిజినెస్ కొనసాగిస్తున్న క్రమంలో కడపకు చెందిన కానిస్టేబుల్ రామ్మోహన్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డికి చిట్కు సంబంధించిన రూ.3లక్షలు రావాల్సి ఉంది. అందులో రూ.1.50 లక్షకు చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు బౌన్స్ కావడంతో తన అన్నకు రావాల్సిన డబ్బు రాలేదని రామ్మోహనరెడ్డి చిట్ కార్యాలయంపై దాడి చేశాడు. కార్యాలయంలోని కంప్యూటర్‌తో ఫర్నిచర్,ఇతర సామాగ్రిని, అద్దాలను ధ్వంసం చేశాడు. వాటిని కార్యాలయం బయటికి తీసుకొచ్చి ఆటోను పిలిపించి వాటిలో ఎక్కించే ప్రయత్నం చేశాడు. జనం భారీగా గుమికూడి అతన్ని ప్రశ్నించేసరికి అక్కడి నుంచి కానిస్టేబుల్ పారిపోయాడు. జరిగిన సంఘటనపై సంస్థ ఫోర్‌మెన్ శివకుమార్‌రాజు, డైరెక్టర్ మౌలాలిలు పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా గత కొంతకాలంగా ఈ సంస్థ చిట్స్ మొత్తం చెల్లింపులో జాప్యం ఏర్పడటంతో పలువురు తమకు రావాల్సిన మొత్తాలను చెల్లించాలని కోరుతున్నారు. -
కడపలో బాలుడు కిడ్నాప్
కడపలో ఓ చిట్‌ఫండ్స్ కంపెనీని నెలకొల్పి రూ.8 కోట్లకు ఐపీ పెట్టేందుకు ప్రయత్నించిన వ్యాపారి కుమారుడిని ఓ బాధితుడు తన స్నేహితులతో కలిసి సోమవారం ఉదయం కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన కడపలో కలకలం సృష్టించింది. చివరకు కిడ్నాప్ చేసిన వ్యక్తే పోలీసులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. కడప అర్బన్ : వల్లూరు మండలం అంబవరానికి చెందిన దేవగుడి మనోహర్‌రెడ్డి రామాంజనేయపురంలో నివసిస్తున్న మునిరెడ్డి కుమార్తె సునీతను 2003లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇరువురు కుమారులు ఉన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం కడపలోని చెన్నూరు బస్టాండు సమీపంలో హనుమాన్ చిట్‌ఫండ్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పాడు. 8 కోట్ల రూపాయలకు గత సంవత్సరం అనంతపురం జిల్లాలో ఐపీ దాఖలు చేశారు. అయితే ఐపీ డిగ్రీ కానట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు అప్పులిచ్చిన వారు మనోహర్‌రెడ్డిని భయపెట్టి, బ్రతిమాలి తమ డబ్బులు రాబట్టుకున్నారు. పాత కడపకు చెందిన రామచంద్రారెడ్డి ఇటీవల కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ‘కీమోథెరఫీ’ చికిత్స చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. రెండు నెలలకొకసారి 50వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అనేకసార్లు పెద్ద మనుషులతోను, నేరుగాను మనోహర్‌రెడ్డిని తన డబ్బు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో మనోహర్‌రెడ్డి భార్య సునీత, కుమారుడు పార్థివకుమార్‌రెడ్డి (11)ని తీసుకొని దసరా పండుగకు కడపలోని రామాంజనేయపురంలో ఉన్న తన తండ్రి మునిరెడ్డి వద్దకు వచ్చింది. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో మునిరెడ్డి ఇంటి వద్దకు రామచంద్రారెడ్డి, తన స్నేహితులతో కలసి వెళ్లాడు. మనోహర్‌రెడ్డి గురించి వాకబు చేశారు. లేకపోవడంతో అతని కుమారుడు పార్థివకుమార్‌రెడ్డిని కిడ్నాప్ చేశారు. దీంతో సునీత తన కుమారుడిని కిడ్నాప్ చేశారని సీఐ నాయకుల నారాయణ దగ్గరకెళ్లి ఫిర్యాదు చేసింది. రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తన మరిది ప్రభాకర్‌రెడ్డి మొబైల్‌కు ఫోన్ చేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సదరు మొబైల్ ఫోన్‌కు ఫోన్‌చేసి విచారించారు. వెంటనే రామచంద్రారెడ్డి మనోహర్‌రెడ్డి కుమారుడు పార్థివకుమార్‌రెడ్డిని రిమ్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారిస్తున్నారు. బాలుడిని కిడ్నాప్ చేశారని సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రారెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాయకుల నారాయణ తెలిపారు.