కడపలో బాలుడు కిడ్నాప్
కడపలో ఓ చిట్‌ఫండ్స్ కంపెనీని నెలకొల్పి రూ.8 కోట్లకు ఐపీ పెట్టేందుకు ప్రయత్నించిన వ్యాపారి కుమారుడిని ఓ బాధితుడు తన స్నేహితులతో కలిసి సోమవారం ఉదయం కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన కడపలో కలకలం సృష్టించింది. చివరకు కిడ్నాప్ చేసిన వ్యక్తే పోలీసులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది.
కడప అర్బన్ :
వల్లూరు మండలం అంబవరానికి చెందిన దేవగుడి మనోహర్‌రెడ్డి రామాంజనేయపురంలో నివసిస్తున్న మునిరెడ్డి కుమార్తె సునీతను 2003లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇరువురు కుమారులు ఉన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం కడపలోని చెన్నూరు బస్టాండు సమీపంలో హనుమాన్ చిట్‌ఫండ్ పేరుతో ఓ సంస్థను నెలకొల్పాడు. 8 కోట్ల రూపాయలకు గత సంవత్సరం అనంతపురం జిల్లాలో ఐపీ దాఖలు చేశారు. అయితే ఐపీ డిగ్రీ కానట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొందరు అప్పులిచ్చిన వారు మనోహర్‌రెడ్డిని భయపెట్టి, బ్రతిమాలి తమ డబ్బులు రాబట్టుకున్నారు. పాత కడపకు చెందిన రామచంద్రారెడ్డి ఇటీవల కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు.
‘కీమోథెరఫీ’ చికిత్స చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాడు. రెండు నెలలకొకసారి 50వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అనేకసార్లు పెద్ద మనుషులతోను, నేరుగాను మనోహర్‌రెడ్డిని తన డబ్బు ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో మనోహర్‌రెడ్డి భార్య సునీత, కుమారుడు పార్థివకుమార్‌రెడ్డి (11)ని తీసుకొని దసరా పండుగకు కడపలోని రామాంజనేయపురంలో ఉన్న తన తండ్రి మునిరెడ్డి వద్దకు వచ్చింది. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల సమయంలో మునిరెడ్డి ఇంటి వద్దకు రామచంద్రారెడ్డి, తన స్నేహితులతో కలసి వెళ్లాడు. మనోహర్‌రెడ్డి గురించి వాకబు చేశారు. లేకపోవడంతో అతని కుమారుడు పార్థివకుమార్‌రెడ్డిని కిడ్నాప్ చేశారు. దీంతో సునీత తన కుమారుడిని కిడ్నాప్ చేశారని సీఐ నాయకుల నారాయణ దగ్గరకెళ్లి ఫిర్యాదు చేసింది. రామచంద్రారెడ్డి అనే వ్యక్తి తన మరిది ప్రభాకర్‌రెడ్డి మొబైల్‌కు ఫోన్ చేసి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు సదరు మొబైల్ ఫోన్‌కు ఫోన్‌చేసి విచారించారు. వెంటనే రామచంద్రారెడ్డి మనోహర్‌రెడ్డి కుమారుడు పార్థివకుమార్‌రెడ్డిని రిమ్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారిస్తున్నారు. బాలుడిని కిడ్నాప్ చేశారని సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామచంద్రారెడ్డి, మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాయకుల నారాయణ తెలిపారు.