సీఎంతో విభేదాల్లేవు: మంత్రి బాలరాజు
నర్సీపట్నం(విశాఖ జిల్లా), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రికి, తనకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని, అన్నీ తొందర్లోనే సర్దుకుంటాయని మంత్రి బాలరాజు పేర్కొన్నారు. ఆయన మంగళవారమిక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చోడవరం సభకు వచ్చినప్పుడు గిరిజన శాఖ పథకాన్ని తాను లేకుండా ప్రారంభించడం సమంజసం కాదన్నారు. దీనిపై అవసరమైతే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. రాష్ట్ర విభజన జరిగితే విశాఖను కోస్తాంధ్రకు రాజధానిగా చేయాలని కేంద్ర కేబినెట్ బృందానికి ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జిల్లాలుగా మార్చాలని, అలాగే వాటిని కలిపే పలు రోడ్లను జాతీయ, రాష్ట్ర రహదారులుగా మార్చాలని ప్రతిపాదించినట్టు ఆయన వివరించారు. విశాఖ కేంద్రంగా ఆంధ్రా సెంట్రల్ యూనివర్సిటీని నెలకొల్పాలని, చింతపల్లిలో గిరిజన యూనివర్సిటీ అవసరమని సూచించామన్నారు.