శవాన్ని మమ్మీని చేసి పూజలు..
చెక్కిన రాతి శిల్పాన్ని దేవుడిగా భావిస్తారు కొందరు. బతికున్న 'బాబా'లను భగవంతుని స్వరూపమంటూ కొలుస్తారు ఇంకొందరు. నిష్క్రమించిన మహాపురుషుల సమాధుల చుట్టూ ఆలయాలు నిర్మిస్తారు మరికొందరు. కానీ, శవాన్ని మమ్మగా చేసి పూజించడం ఎప్పుడైనా విన్నారా! జాతిపిత అంతటి మావో జెడాంగ్ భారీ విగ్రహాన్ని నేలమట్టంచేసి, వ్యక్తి ఆరాధనను వ్యతిరేకిస్తామని గొప్పగా ప్రకటించుకున్న జన చైనాలోనే ఈ వింత దృశ్యం చోటుచేసుకుంది!
ఫూ హోయ్ తన 13వ యేట బౌద్ధ భిక్షువుగా మారారు. ధమ్మ సూత్రాలను నలుగురికీ బోధిస్తూ, అనతికాలంలోనే గొప్ప గురువుగా పేరుపొందారు. తన 94 ఏళ్ల జీవితమంతా క్వాంజువా (దక్షిణ చైనా)లోని చాంగ్ ఫూ టెంపుల్ లోనే గడిపారు. నాలుగేళ్ల కిందట (2012లో) ఆయన పరమపదించారు. ఫూ మోయ్ మరణం ఆయన శిష్యులను తీవ్రంగా కలిచివేసింది. గురువుగారు లేని చాగ్ ఫూ ఆలయాన్ని వాళ్లు ఊహించుకోలేకపోయారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు.
చనిపోయిన ఫూ హోయ్ మృతదేహానికి ప్రాచీన పద్ధతిలో రకరకాల రసాయనాలు పూసి, పెద్ద జాడీలో భద్రపరిచారు. దాన్నొక రహస్యప్రదేశంలో దాచి, ఇటీవలే వెలికి తీశారు.బతికున్నప్పుడు ఆయన ఎలాగైతే కూర్చునేవారో అదే ఆకారంలో ఉన్న మమ్మీకి బంగారం పోతపోశారు. గురువుగారి మనసులాంటి స్వచ్ఛమైన బంగారం పోతతో ధగధగా మెరిసిపోతోన్న ఆ మమ్మీ విగ్రహం వద్ద పూజలు గట్రా నిర్వహించడంతోపాటు ధ్యానం అదీ చేస్తున్నారు శిష్యులు! కొందరు దీనిని గురువుగారికి లభించిన 'సముచిత గౌరవం' అంటున్నారు. మీరేమంటారు?