హైవే వెంట మొక్కల పరిశీలన
చౌటుప్పల్ : రెండో విడత హరితహారంలో కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలో నాటిన మొక్కలను ఆదివారం ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణ డ్వామా పీడీ దామోదర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. కొయ్యలగూడెం వద్ద ఆగి మొక్కలను పరిశీలించి వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవాటిని నాటాలని డ్వామా పీడీకి సూచించారు. అనంతరం ఇన్చార్జి కలెక్టర్ తిరిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి మల్కాపురం వరకు మొక్కలను పరిశీలించారు. మొక్కల రక్షణకు రాతి కడీలు పాతి, ఇనుప తీగలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు. హైవే వెంట నాటిన మొక్కలను చౌటుప్పల్ మండల పరిధిలో హెచ్ఎండీఏ, మిగతా హైవే పరిధిలో అటవీ శాఖ పర్యవేక్షిస్తుందన్నారు. మొక్కలకు నెంబర్లను ఏర్పాటు చేసి, డీయోట్యాపింగ్‌తో అనుసంధానం చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా మొక్కల ఎదుగుదలను ఆన్లైన్లో చూసుకోవచ్చన్నారు.