మార్కెట్లోకి టయోటా ఇన్నోవా ‘క్రిస్టా’
ధర శ్రేణి రూ. 14.06 లక్షలు- రూ. 21.13 లక్షలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ టయోటా తాజాగా ఇన్నోవాకి సంబంధించి రెండో తరం వాహనం ‘క్రిస్టా’ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 14.06 లక్షలు-రూ. 21.13 లక్షల దాకా (ఎక్స్-షోరూం హైదరాబాద్) ఉంటుంది. టయోటా కిర్లోస్కర్ మోటార్ జీఎం ఆర్ వెంకటకృష్ణన్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దీన్ని ఆవిష్కరించారు. ఇన్నోవాకు మరిన్ని అదనపు హంగులు జోడించి 7 ఎయిర్‌బ్యాగ్స్ తదితర ఫీచర్లతో రూపొందిన క్రిస్టా.. ఆటోమేటిక్, మ్యాన్యువల్ వేరియంట్స్‌లో లభిస్తుందని తెలిపారు. మైలేజి లీటరు డీజిల్‌కు 14.29-15.10 కి.మీ. ఉంటుందన్నారు.
క్రిస్టా రాకతో తొలితరం ఇన్నోవాల విక్రయం నిలిపివేస్తున్నట్లు వెంకటకృష్ణన్ చెప్పారు. క్రిస్టాకు 2-4 నెలల పరిమాణం మేర బుకింగ్స్ వచ్చినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎంపీవీ విభాగంలో తమకు 43 శాతం మార్కెట్ వాటా ఉందని పేర్కొన్నారు. మొత్తం 3.10 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్ధ్యం గల రెండు ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. డీజిల్ వాహనాల అమ్మకాలపై ఆంక్షలు తొలగించాలంటూ అత్యున్నత న్యాయస్థానానికి పరిశ్రమ విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.