Christian Medical College
-
సీఎం జగన్‌ను కలిసిన సీఎంసీ ప్రతినిధుల బృందం
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్(సీఎంసీ), వేలూరు, చిత్యూరు క్యాంపస్ ప్రతినిధుల బృందం గురువారం కలిసింది. సీఎంసీ వేలూరు ఆసుపత్రికి అనుబంధంగా చిత్తూరు క్యాంపస్ ఉంది. దీని అభివృద్ధికి సంబంధించి సీఎం జగన్‌తో చర్చించింది సదరు బృందం. చిత్తూరు క్యాంపస్‌లో మెడికల్ సెంటర్‌తో కూడిన మెడికల్ కాలేజ్, హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్, ఆరోగ్య సేవలకు అనుబంధంగా ఉండే కోర్సులతో కూడిన కాలేజ్‌ల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సీఎంసీకి ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారం ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. సీఎంసీ ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు ఏపీ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషకరమని, ఏపీ ఆరోగ్యం రంగంలో ఇదొక గొప్ప విజయంగా భావిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే చిత్తూరులో సెకండరీ కేర్ ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్లు, దానిని అతి త్వరలో 300 పడకల ఆసుపత్రిగా విస్తరించనున్నట్లు సీఎం జగన్‌కు సీఎంసీ బృందం వివరించింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, సీఎంసీ డైరెక్టర్ డా.విక్రమ్ మాథ్యూస్, మాజీ డైరెక్టర్ డా.సురంజన్ తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో ప్రజారోగ్య విభాగం ఏర్పాటు కావాలి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ లాంటి మహమ్మారి ఇంకొకటి తాకేలోపు దేశంలో ప్రజారోగ్య విభాగం ఏర్పాటు తప్పనిసరి అని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (వెల్లూరు) సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జాకబ్ జాన్ స్పష్టంచేశారు. ఇలాంటి విభాగం లేనందున కోవిడ్ వ్యాధి నిర్వహణ బాధ్యతలు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థల చేతుల్లో పెట్టాల్సివచ్చిందని వాపోయారు. దీంతో పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరాల్సి వచ్చిందని, మరణాలు కూడా భారీగానే నమోదయ్యాయని అన్నారు. ‘కోవిడ్ నేర్పిన పాఠాలు’ అన్న అంశంపై సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) ఆధ్వర్యంలో గురువారం జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వచ్చిన తొలినాళ్లలో 2020 మే 3 నాటికి కేసుల సంఖ్య 6.4 లక్షలకు చేరుకోవచ్చునని భారత వైద్య పరిశోధన సమాఖ్య జరిపిన సర్వే తెలిపిందని, కానీ ఆ రోజుకు అధికారికంగా నమోదైన కేసులు 42 వేలు మాత్రమేనని చెప్పారు. 2020 మార్చిలో కేరళలో మూడు కేసులు దిగుమతి కాగా.. విదేశాల నుంచి వచ్చిన వారిని పరిశీలించగలిగే వ్యవస్థ లేకపోవడంతో అసలు కేసులెన్ని అన్నది స్పష్టం కాలేదని వివరించారు. ప్రజారోగ్య వ్యవస్థ ఉంటే దేశంలో ఏమూలనైనా కారణాలు తెలియకుండా ఎవరైనా మరణించినా, కొత్త లక్షణాలతో ఎవరికైనా వ్యాధి సోకినా ఆ విషయం వెంటనే అన్ని స్థాయిల్లోని అధికారులకు తెలిసిపోతుందని, కట్టడి చర్యలు సులువు అవుతాయని తేల్చిచెప్పారు. జిల్లాస్థాయిలో నిర్ణయాలు తీసుకునేలా.. కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడాన్ని అడ్డుకోకపోవడమే భారత్ చేసిన అతిపెద్ద తప్పిదమని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. తొలిదశ కరోనాను సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ ఆ తరువాతి కాలంలో ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రెండో దశ అనివార్యమైందన్నారు. సెరోసర్వేల ప్రకారం 60 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారని.. అయితే ఈ యాంటీబాడీలు వైరస్‌ను నాశనం చేసేవా? కాదా? అన్నది ఎవరూ పరిశీలించలేదని పేర్కొన్నారు. కోవిడ్ తరహా మహమ్మారులను సమర్థంగా కట్టడి చేయాలంటే జిల్లాస్థాయిలోనే నిర్ణయాలు తీసుకోగల వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి, మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. -
Gagandeep Kang: వాక్సినాలజిస్ట్ చల్లనమ్మ
థర్డ్ వేవ్ కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నప్పుడు హటాత్తుగా ఆకాశం మేఘావృతమై ఓ చినుకు రాలినట్లుగా వినిపించిన మాట ఇది! కరోనా వ్యాప్తి ఈ నెల మధ్యలో తగ్గడం ప్రారంభించి, నెలాఖరుకు క్షీణ దశకు చేరుకుంటుందని గగన్‌దీప్ కాంగ్ అనే వ్యాక్సినాలజిస్ట్ గురువారం ఓ వెబినార్‌లో చెప్పారు! ఊరికే ధైర్యం చెప్పడం కోసం ఆమె ఆ మాట అనలేదు. నిరుడు మార్చి నెలలో దేశంలో కరోనా కేసులు అరవైకి చేరి, ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళనకు చేరువవుతున్న దశలో సైతం గగన్‌దీప్ మరీ బెంబేలెత్తి పోనవసరం లేదని భరోసా ఇవ్వడంతో పాటు కనీస జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అలెర్ట్ చేశారు మంచి మాటల చల్లనమ్మ గగన్ దీప్ కాంగ్! గగనదీప్ వైరాలజిస్ట్. వైరస్ల మీద పరిశోధనలు చేస్తుంటారు. ప్రస్తుతం వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్‌లో ‘గ్యాస్ట్రోఇంటెస్టెనల్ సైన్సెస్’ విభాగం ఫ్రొఫెసర్‌గా ఉన్నారు. బ్రిటన్‌లోని ‘రాయల్ సొసైటీ’ ఫెలోషిప్‌ను పొందిన తొలి భారతీయ మహిళ గగన్‌దీప్. అయితే ఆమె అసలైన గుర్తింపు మాత్రం ఐదేళ్ల చిన్నారులకు సోకే రోటా వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తగానే! రోటా వైరస్ వల్ల వచ్చే డయారియాతో ఏటా లక్షమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయేవారు. ఆ వైరస్‌కు వ్యాక్సిన్‌తో అడ్డుకట్టవేశారు గగన్‌దీప్. ఏడాదిన్నరగా ఆమె కరోనా వైరస్ స్వభావాన్ని పరిశోధిస్తున్నారు. ఆ ఫలితాల గురించి ఉమెన్ ప్రెస్ కోర్స్ వెబినార్‌లో చెబుతున్నప్పుడే.. ‘‘ఇప్పుడు మేము పరిశీలిస్తున్న కరోనా వైరస్ గుణాలను బట్టి మే నెల మధ్య నుంచీ వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి’’ అని గగన్‌దీప్ చెప్పారు. ∙∙ ఏ విషయాన్నైనా ‘భయం లేదు’ అన్నట్లే ప్రకటిస్తారు గగన్‌దీప్. అదే సమయంలో ‘నిర్లక్ష్యంగా ఉండేందుకూ లేదు’ అని భుజం తట్టినట్లు చెబుతారు. ‘‘శాస్త్రవేత్తలుగా మా దగ్గర పరిష్కారాలు ఉంటాయి. మీ దగ్గర జాగ్రత్తలు ఉండాలి’’ అంటారు. ఇప్పుడీ కరోనా పరిస్థితులకు చక్కగా సరిపోయే మాటే. భయం అక్కర్లేదు. కానీ అతి ధైర్యమూ పనికి రాదు. ఇక ఆమె చెప్పే ఏ మాటైనా మనం నిశ్చింతగా ఎందుకు నమ్మేయాలంటే.. తను వైరాలజిస్ట్, వాక్సినాలజిస్టు కూడా కాబట్టి. గగన్‌దీప్‌కు చిన్నప్పట్నుంచీ.. రూఢీ కానిదేదీ నమ్మదగినది కాదనే నమ్మకం ఉంది. ఆమె తండ్రి రైల్వేస్‌లో మెకానికల్ ఇంజనీరు. తల్లి ఇంగ్లిష్, మేథ్స్ సబ్జెక్టుల టీచర్. íసిమ్లాలో పుట్టారు గగన్‌దీప్. తండ్రి ఉద్యోగంలో ఉండే బదిలీల వల్ల పదో తరగతికి వచ్చేలోగా పది స్కూళ్లు మారారు. దేశమంతటా తిరిగి చదివినట్లు లెక్క. బయాలజీ, ఫిజిక్సు, కెమిస్ట్రీ ఆమెకు ఇష్టమైన పాఠ్యాంశాలు. తండ్రి చేత ఇంట్లోనే ఒక ల్యాబ్ ఏర్పాటు చేయించుకుని పరిశీలనలు, ప్రయోగాలు చేస్తుండేవారు. ఆ ఆసక్తే ఆమె చేత మెడిసిన్ చదివించింది. మైక్రో బయాలజీలో పీహెచ్డీ చేయించింది. ఇక పలు రకాలైన వైరస్లు, బాక్టీరియాల వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు ఆమె చేసిన పరిశోధనలు, వాక్సిన్లు కనిపెట్టేందుకు చేసిన కృషి ఆమెకు 2019లో రాయల్ సొసైటీ గౌరవాన్ని సాధించిపెట్టాయి. గగన్‌దీప్ ప్రస్తుతం వెల్లూరులో ప్రొఫెసర్‌గా ఉంటూనే కరోనాను ఎదుర్కొనే విషయంలో ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలకు సలహాదారుగా ఉన్నారు. -
కార్డన్ సెర్చ్‌లో..నోరెళ్లబెట్టిన పోలీసులు
డిచ్పల్లి(నిజామాబాద్): మండలంలోని అమృతాపూర్ పంచాతీయ పరిధిలో గల ఒడ్డెర కాలనీ, దేవునగర్ లెప్రసీ క్యాంపులో పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన తనిఖీలు ఉదయం 10 గంటల వరకు కొనసాగాయి. నిజామాబా ద్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో డిచ్పల్లి సీఐ తిరుపతి, ఎస్సైలు కట్టా నరేందర్‌రెడ్డి, శ్రీదర్‌గౌడ్, ము రళి, ప్రొబేషనరీ ఎస్సై నవీన్‌కుమార్, ఏఎస్సై గంగారాం, సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా లభించిన సామగ్రిని చూసి పోలీసులు నోరెళ్లబెట్టారు. దాదాపు ప్రతి ఇంట్లో క్రిస్టియన్ మెడికల్ కళాశాల (సీఎంసీ)కు చెందిన సామగ్రి లభించడంతో విస్తుబోయారు. కళాశాలలోని మంచాలు, టేబుళ్లు, బెంచీలు, ఫ్రిజ్‌లు, బీరువాలు, సీలింగ్‌ఫ్యాన్లు ఆ ఖరికి పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన బెడ్లు లభించడంతో సిబ్బంది విస్మయానికి గురయ్యారు. కొందరైతే అవసరం లేకున్నా గదులకు ఉన్న తలుపులు ఎత్తుకొచ్చి ఇళ్లల్లో దాచుకున్నారు. సామగ్రిని ఐదు ట్రాక్టర్లలో తరలించి విక్టోరియా హాస్పిటల్ ఆవరణలోని భవనంలో ఉంచారు. పత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలు, ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ.. సంఘ విద్రోహ శక్తులను అరికట్టేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించామని తెలిపారు. ప్రతి ఇంట్లో సీఎంసీ కళాశాలకు చెందిన సామాగ్రి లభించడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. త్వరలో మరోసారి కార్డన్ సెర్చ్ నిర్వహిస్తామని, చోరీ చేసిన సామాగ్రి లభిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న సామగ్రి వివరాలు నమోదు చేసుకుని సీఎంసీ ప్రతినిధులకు అప్పగిస్తామని తెలిపారు.