అ‘ధన’పుదోపిడీ
ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లలో ఉత్సాహం
ఆశించిన స్థాయిలో ‘క్రిస్మస్’ వ్యాపారం
కొత్త సంవత్సరం, సంక్రాంతిపైనే దృష్టి
టికెట్లు బ్లాక్ చేసి రెట్టింపు ధరకు విక్రయించే యోచన
పట్టించుకోని రవాణాశాఖ అధికారులు
మర్రిపాలెం : ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లలో ఉత్సాహం ఉరకలేస్తోంది. క్రిస్మస్ పండగలో వ్యాపారాలు ఆశించిన స్థాయిలో జరగడంతో కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగపై దృష్టిసారించారు. ఆ సీజన్లో కోట్ల రూపాయల అమ్మకాలకు కసరత్తు ప్రారంభించారు. రాకపోకలకు ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో అడ్డగోలుగా దోచుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ముందస్తు బుకింగ్‌లు ఆపేశారు. పండగ రోజుల్లో అవకాశాన్ని బట్టి సొమ్ము రాబట్టుకోవాలని వేచి చూస్తున్నారు. ఆన్లైన్, ట్రావెల్స్ కార్యాలయాల్లో టికెట్ల అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. కొ త్త సంవత్సరానికి 50 శాతం చార్జీలు అధికం చేసి అమ్మకాలు చేస్తున్నారు. జనవరి 12 నుంచి 17 తేదీల్లో టికెట్లు అందుబాటులో ఉంచకపోవ డం విశేషం. పండగ రోజుల్లో రెట్టింపు వసూళ్లకు పాల్పడేందుకు ట్రావెల్స్ యాజమాన్యాల ఎత్తుగడ.
కన్నెత్తి చూడలేని పరిస్థితి..
గతేడాది పండగ సీజన్లో ప్రైవేట్ ట్రావెల్స్ ఆపరేటర్లు గడ్డుకాలం ఎదుర్కొన్నారు. రోడ్డెక్కడానికి భయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం దుర్ఘటనతో ఆపరేటర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ప్రైవేట్ బస్సులపై దాడులు జరగడం లేదు. ఆరు నెలలుగా ఒక్క బస్సును కూడా అధికారులు సీజ్ చేయలేదు. రాష్ట్రంలో ప్రముఖ ట్రావెల్స్‌కు చెందిన ఆపరేటర్లు ఇద్దరు ఎంపీలుగా ఉండటంతో కన్నెత్తి చూడలేని దుస్థితిలో ఉంటున్నారు. ఇది మా ప్రభుత్వం! రోజులు మావి! అన్నట్టుగా ఆపరేటర్లు వ్యవహరించడం రవాణా అధికారులకు మింగుడుపడటం లేదు. మా బస్సుల్సి ఆపే దమ్ము ఎవరికి ఉంది! అనే రీతిలో వ్యాపారులు హవా చేయడం విమర్శలకు దారితీస్తోంది.
ఆపరేటర్ల ఇష్టారాజ్యం!
కాంట్రాక్ట్ క్యారియర్ పర్మిట్‌తో స్టేజి క్యారియర్‌గా రాకపోకలు చేస్తున్నా అడిగే నాథుడు లేకపోవడంతో ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులు బహిరంగంగా ప్రయాణిస్తున్నా రవాణా అధికారులు నోరు మెదపడం లేదు. కళ్ల ముందు రాకపోకలు చేస్తున్నా కనీసం తనిఖీలు జరపడం లేదు. అడపా దడపా తనిఖీలు జరిపినా పై స్థాయి నుంచి సిఫార్సులు రావడం, కొన్ని సందర్భాలలో చీవాట్లు పెట్టడంతో మాకెందుకులే! అన్న రీతిలో ఉంటున్నారు. నిబంధనల పేరుతో దాడులకు దిగితే తమ పోస్టింగ్‌లకు ముప్పు తప్పదన్న ఆలోచనలతో అధికారులు నడుచుకుంటున్నారు. ఈసారి ఎలాగూ దాడులకు అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లు దండిగా దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు.