chukka Ramulu
-
సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో రాములు మాట్లాడుతూ సిద్దిపేటరెడ్డి సంక్షేమ భవన్లో నిర్వహించే మహాసభల ప్రాంగణానికి మల్లు స్వరాజ్యం, సున్నం రాజయ్యల పేర్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 600 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరవుతారన్నారు. మూడు రోజులపాటు జరిగే మహాసభలకు ఇతర కార్మిక సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నాని చెప్పారు. మహాసభల చివరి రోజు జరిగే బహిరంగ సభకు కేరళ మంత్రి శివమ్స్ కుట్టి వస్తారన్నారు. కార్మిక చట్టాలు, ధరల పెరుగుదల, విద్యుత్ చట్టం, రైతాంగ సమస్యలపై ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, శశిధర్, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణ ఏదీ?
కొండాపూర్(సంగారెడ్డి): బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం దూసుకెళ్తుందని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం పల్లెలో మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట వేశాయనీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్కా రాములు పేర్కొన్నారు.దివారం మండల పరిధిలోని గంగారం గ్రామంలో ఆయన పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా నేటికీ చాలా గ్రామాలలో మురికి కాల్వలు, రహదారులు, మంచి నీటికి కూడా నోచుకోకపోవడం బాధాకరమన్నారు.ప్రభుత్వం సామాజిక అంశాలపై కాలాయాపన చేయకుండా అర్హులైన దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేయాలన్నారు. ప్రతీ గ్రామంలో శ్మశాన వాటికలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ నిర్మించి దళితుల సమస్యలను పరిష్కరించాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులపై దాడులను అరికట్టాలనీ ప్రభుత్వాన్ని కోరారు.ఎస్సీ, ఎస్టీ నిధులను సక్రమంగా వినియోగించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సబ్సిడీ రుణాలను అందించాలన్నారు. విద్యా , వైద్యం సామాన్యుడికి అందడంలేదని, విద్యా, వైద్యం ప్రతీ పేదవాడికి అందినప్పుడే బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందనీ తెలిపారు. రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనీ ఆశించిన యువతకు నిరాశే మిగిలిందనీ, రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశారో, ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, ప్రాజెక్టుల పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు పాల్పడుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, యాదగిరి, మండల నాయకులు రాజయ్య, రాంచెందర్, పవీణ్,ఎల్లేశ్,చంద్రయ్య, రాజు,సత్య తదితరులు పాల్గొన్నారు. -
సామాజిక తెలంగాణ కోసం మరో పోరాటం
సంగారెడ్డిజోన్: సామాజిక తెలంగాణ కోసం రాష్ట్రంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. మహాజన పాదయాత్ర వార్షికోత్సవం సందర్భంగా ‘సరళీకరణ విధానాలు– సామాజిక తరగతులపై ప్రభావం’ అనే అంశంపై సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవనలో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సామాజిక న్యాయం – తెలంగాణ సమగ్రాభివృద్ధికి గత ఏడాది అక్టోబర్ 17న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైన ‘మహాజన పాదయాత్ర’ తెలంగాణ అంతా పర్యటించిందన్నారు. ఈ యాత్రలో 9 మంది బృందం 4,200 కిలో మీటర్ల కాలినడకతో లక్షల మందిని కలుసుకున్నారన్నారు. ప్రజా సమస్యలను నాయకులు తెలుసుకున్నారని తెలిపారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, కార్మికులు, కూలీలు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, యువకులు, వికలాంగులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి బి.మల్లేశం, జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు జయరాజు, జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, నర్సింలు, మల్లేశ్వరి, నాయకులు కృష్ణ, అశోక్, రమేష్, బాల్‌రాజ్, స్వాతి, నాగభూషణం, అనంతయ్య, లక్ష్మయ్య ఉన్నారు. -
హామీలను విస్మరించిన సర్కార్
రెండో ఏఎన్ఎంల డిమాండ్లు పరిష్కరించాలి సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు సంగారెడ్డి జోన్: వైద్యశాఖలో పని చేస్తున్న రెండో ఏఎన్ఎంలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు అన్నారు. సంగారెడ్డిలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట రెండో రోజు జరిగిన ముట్టడి కార్యక్రమానికి చుక్కరాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 18 నుంచి ఆందోళన నిర్వహిస్తున్నా పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. జీవో 14 ప్రకారం పెంచిన వేతనాలను రెండో ఏఎన్ఎంలకు వర్తింపజేయాలన్నారు. రెగ్యులరైజేషన్, వేతనాల పెంపు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున్, జిల్లా అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు మల్లేషం, రాజయ్య, బాలమణి, నర్సమ్మ, రెండవ ఏఎన్ఎం నాయకులు వినోద, విజయలక్ష్మి, పద్మ, కృష్ణవేణి, సంగీత తదితరుల పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మికులు..
- సంగారెడ్డిలో భారీ ప్రదర్శన, కలెక్టరేట్ ముట్టడి - కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలి - కనీస వేతనం రూ.15వేలు ఇవ్వాలి - సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు సంగారెడ్డి క్రైం : రాష్ట్రంలో కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న సమ్మెలు, ఉద్యమాలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు ధ్వజమెత్తారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనంగా రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు కార్మికులు స్థానిక ఐటీఐ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా చుక్క రాములు మాట్లాడుతూ కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తామన్న సీఎం మాట తప్పారన్నారు. గత నెల 15 నుంచి కార్మికుల సమస్యలపై కార్మిక పోరుబాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశామన్నారు. సర్వేలో ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావడం లేదని తేలిందన్నారు. కోట్లాదిరూపాయలు ఖర్చు చేసి ఆర్భాటాలు చేస్తున్న ప్రభుత్వం అసంఘటిత కార్మికులకు, స్కీం వర్కర్లకు వేతనాలు పెంచడం లేదన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తదితరులకు వేతనాలు పెంచినప్పటికీ, రోడ్లపైకి వచ్చి పోరాడుతున్న అసంఘటిత కార్మికులకు మాత్రం వేతనాలు పెంచకపోవడం శోచనీయమన్నారు. కార్యక్రమంలోసీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి కె.రాజయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం, సీఐటీయూ నాయకులు సర్దార్, ప్రవీణ్, నాగేశ్వర్రావు, నర్సమ్మ,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్వో దయానంద్‌కు అందజేశారు. -
‘టీఐడీసీ’లో నాయిని ఓటమి
జిన్నారం : మెదక్ జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి పారిశ్రామిక వాడలోని టీఐడీసీ ఇండియా పరిశ్రమలో బుధవారం జరిగిన యూనియన్ ఎన్నికల్లో హెచ్ఎంఎస్ అభ్యర్థి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిపై సీఐటీయూ అభ్యర్థి చుక్కా రాములు విజయం సాధించారు. పరిశ్రమలో మొత్తం ఓట్లు 171 ఉండగా, 168 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 100 ఓట్లు రాములుకు రాగా, నాయినికి 68 ఓట్లు పోలయ్యాయి. ఫలితం వెలువడగానే సీఐటీయూ నాయకులు, పరిశ్రమ కార్మికులు పారిశ్రామిక వాడలో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. -
టీ సర్కార్ వల్లే రాష్ట్రంలో సంక్షోభం
సంగారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తన పనితీరును మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు చుక్క రాములు అన్నారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వాకం వల్లే రాష్ట్రంలో సంక్షోభం ఏర్పడిందన్నారు. తెలంగాణ వచ్చిన 5 నెలల కాలంలోనే 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రస్తుతం వ్యవసాయానికి 3గంటల కరెంటు కూడా అందడం లేదని మండిపడ్డారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి మహిళా సమస్యల పరిష్కారానికి కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కందిమల్ల ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్నారు. మెదక్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలని కోరారు. నాయకులు రాజయ్య, మల్లేశం, జయరాజు, మల్లికార్జున్, రాంచందర్, మాణిక్యం, సాయిలు, అడివయ్య,ప్రవీణ్, అశోక్, రవి, సీపిఐ నాయకులు పవన్, తాజొద్దీన్, ఆహ్మద్, బాబూమియా, అశోక్, మంజుల, స్వరూప ఉన్నారు.