ఒడి బియ్యం.. జోడు బాసింగాలు
కల్యాణ క్షేత్రాలు
స్వామిది కోర మీసం. అమ్మవారిది చిరు దరహాసం. చూడముచ్చటైన జంటతో భక్తుల పూజలందుకుంటోంది శ్రీలక్ష్మీనర్సింహుని ఆలయం. పెళ్లి కాని వారు ఇక్కడ మొక్కుకుంటే పెళ్లవుతుందని నమ్మకం. పెళ్లి ఇక్కడే చేసుకుంటే శుభకరం అని విశ్వాసం. ఇక పెళ్లిళ్ల తర్వాత రిసెప్షన్లకి ఈ క్షేత్రం పెట్టింది పేరు.
పెళ్లి- ప్రతి మనిషి జీవితంలో ముఖ్య ఘట్టం. అబ్బాయికి అమ్మాయి నచ్చడం అమ్మాయికి అబ్బాయి నచ్చడం ఎంత ముఖ్యమో శుభకరంగా పెళ్లి జరగడం కూడా అంతే ముఖ్యం. తెలంగాణ రాష్ట్రంలో పెళ్లిళ్లకు వాసికెక్కిన క్షేత్రాలు అనేకం ఉన్నాయి. చుక్కాపూర్లో తలంబ్రాలు కురుస్తూనే ఉంటాయి.
నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీప్రాంతపు శ్రీ లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రం పెళ్లిళ్లకు శుభకరం అని నమ్మిక. అందుకే ఇక్కడకు నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది వస్తుంటారు. పెళ్లిళ్లు జరుపుకుని లేదా మొక్కులు తీర్చుకుని బంధుమిత్రులకు విందులు ఏర్పాటు చేస్తుంటారు. అందుకే ఆదివారం, సోమవారం, శనివారాలతో పాటు సెలవు దినాల్లో ఇక్కడంతా ఒక పండుగ వాతావారణం.
ఆలయ చరిత్ర....
ఈ ఆలయానికి సంబందించి 17వ శతాబ్దం నాటి కథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయం సమీపంలోని అడవిలో పరుపుబండ ఒకటి ఉండేదట. ఆ పరుపు బండ మీద రెండు పురాతన హరహరాదుల ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలోని శ్రీ నర్సింహస్వామి స్వయంభువుగా వెలిశాడని నమ్మిక. అయితే ఆ కాలంలో పిండారుల దాడులు ఎక్కువగా ఉండేవి. వారు ఒకసారి దాడి చేసి స్వామివిగ్రహం దోచుకోవాలనుకున్నారు. అందుకోసమని ముందుగా ఆలయం ముందు నల్లని గోవును బలి ఇచ్చారు. దీంతో స్వామికి ఆగ్రహం వచ్చింది. ఉగ్రరూపంతో ఆలయం పైన ఉన్న బండరాళ్లను తన్ని ఆలయ సమీపంలో ఉన్న ‘మంగబావి’కి చేరుకున్నాడు. తెల్లవారి యధావిధి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలు చేయడానికి వెళ్లగా స్వామి విగ్రహం లేదు. అదే రోజు రాత్రి అర్చకులకు స్వామి స్వప్నంలో కనబడి
ఆలయానికి సమీపంలోని మంగబావిలో ఉనాననని వేరే ఆలయం కట్టమని చెప్పినాడు. దీంతో అర్చకులు విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పడంతో అందరూ కలిసి మంగబావి వద్దకు వెళ్లి చూడగా విగ్రహం ఉన్నది. దీంతో విగ్రహాన్ని బావిలో నుంచి బయటకు తీసి తెల్లని గుర్రంపై పెట్టుకుని గ్రామంలోనికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా ప్రస్తుతం ఆలయం ఉన్న చోటకు రాగానే గుర్రం అక్కడే ఆగిపోయింది. గుర్రాన్ని ఎంత కొట్టినా అది ముందుకు కదలలేదు. అదే సమయంలో తనను ఇక్కడే ప్రతిష్టించమని స్వామి మాట్లాడిన మాటలు వినబడి గ్రామస్తులు అక్కడే స్వామివారిని ప్రతిష్టించారు.
ఆలయ స్థల విశిష్టత...
శ్రీ లక్ష్మీనర్సింహస్వామిని భక్తిభావముతో సేవించిన శత్రు బాధ నివారణమగునని, ప్రయోగములు శమించునని, భూత, ప్రేత, పిశాచ బాధలు నివారించబడునని పండితులు చెబుతారు. దీర్ఘరోగములు నయమగునని, శాంతి, సంతానము, ఉద్యోగము, వ్యాపారం, వివాహ సంబంధాలు కుదురుతాయని చెబుతారు. స్వామిఆలయం ప్రాంగణంలోని మూలబావి నీటితో స్నానం చేసి భక్తితో స్వామివారిని సేవిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని నానుడి.
మొక్కులు...
నర్సింహుని ఆలయంలో టెంకాయ ముడుపు కట్టడానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా వివాహాలు కానివారు, సంతానం లేనివారు, ఇతర సమస్యలతో ఇబ్బందిపడేవారు కొబ్బరికాయ ముడుపు కడుతారు. అలాగే తమ పిల్లలకు మాటలు సరిగా రాకపోతే స్వామివారికి గంట కడతామని మొక్కుతారు. పిల్లలకు మాటలు వచ్చిన తరువాత గంటలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే వివాహం కాని భక్తులు వివాహం కలిగిన వెంటనే జోడి బాసింగాలు కడుతామని, ఒడి బియ్యం సమర్పించుకుంటామని మొక్కుకుని, కోరిక తీరిన తరువాత మొక్కులు తీరుస్తారు.
నర్సింహుని పేర ‘బేడీ’లు...
పిల్లల ఆరోగ్య సమస్యలు, అల్లరి, చదువుకు వెళ్లకపోవడం వంటి సమస్యలు ఉన్నపుడు వారికి స్వామి పేరిట వెండి బేడీ చేయించి తొడుగుతారు. శనివారం రోజున బేడీని స్వామివారి సన్నిధిలో పూజలు చేయించి కాలుకు తొడుగుతారు. తద్వారా వారికి మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. కొందరు కుడికాలుకు, మరికొందరు కుడి చేతికి ధరిస్తారు.
ఏటా వివాహాలు...
శ్రీ లక్ష్మీనర్సింహుని ఆలయంలో ఏటా అనేక వివాహాలు జరుగుతుంటాయి. కామారెడ్డి ప్రాంతంలో యాభైకి పైగా గ్రామాలకు చెందిన వారు పెళ్లిళ్లు ఇక్కడ చేసుకోవడానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఒక వేళ పెళ్లిళ్లు ఇక్కడ చేసుకోవడం కుదరకపోతే రిసెప్షన్ విందులకు చుక్కాపూర్ ఆలయాన్ని తప్పకుండా ఎంచుకుంటారు. మాంసాహార భోజనంతో విందు ఏర్పాటు చేసుకోవడానికి ఈ ఆలయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. నర్సింహునికి మేకలు, గొర్రెలను కోసి మొక్కులు తీర్చుకుంటారు. ఆలయానికి సమీపంలోని షెడ్ల వద్ద రిసెప్షన్ ఏర్పాటు చేసి విందు నిర్వహిస్తారు. దీంతో సాధారణ పెళ్లిళ్లకు సంబందించి రిసెప్షన్ విందులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటా వందకు పైగా రిసెప్షన్లు జరుగుతాయి. - సేపూరి వేణుగోపాలచారి సాక్షి, కామారెడ్డి
ఆలయానికి వెళ్లే దారిది...
నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణం నుంచి కరీంనగర్ దారిలో 17 కిలోమీటర్ల మైలురాయి వద్ద లక్ష్మీరావులపల్లి గ్రామం ఉంది. అక్కడి నుంచి ఎడమవైపున స్వాగత తోరణం గుండా కిలోమీటరు దూరం వెళితే ఆలయం వస్తుంది. మాచారెడ్డి మండల కేంద్రం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరాన ఈ ఆలయం ఉంటుంది. ఒకప్పుడు ఇది దట్టమైన అడవీ ప్రాంతంగా ఉండేది. ఇప్పుడు పంట పొలాలు ఏర్పాటయ్యాయి.