పాకిస్థాన్లో అద్భుతం..
ముస్లింల దృష్టిలో బైబిల్: ముస్లింల అభిప్రాయం ప్రకారం క్రైస్తవులు ఇబ్రాహీం (అబ్రహాం), మూసా(మోషే), ఈసా(యేసు క్రీస్తు) వంటి ప్రవక్తల కథలని వక్రీకరించి తమకి అనుకూలంగా రాసుకున్నారు. ముస్లింలు యేసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు. దేవునిగా కాదు. క్రీస్తు తరువాత వచ్చిన ముహమ్మదే చివరి ప్రవక్త అని ముస్లింలు అంటారు. బైబిల్ అనేక మార్పులు చేర్పులకు గురైంది కనుక, దేవుడు ఖురాన్ ద్వారా జరిగిన తప్పుల్ని సరిచేశాడని నమ్ముతారు. బైబిల్ తరువాత వచ్చిన అంతిమ దైవగ్రంధం ఖురాన్ అని, యేసు తరువాత వచ్చిన చివరి ప్రవక్త ముహమ్మద్ అంటారు.
క్రైస్తవుల దృష్ఠిలో ఖురాన్: ముస్లింలు ఖురాన్ లోకి బైబిల్ కథలనే తీసుకున్నారని క్రైస్తవులు అంటారు. బైబిల్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని కథనాలు కూడా ఖురాన్ లో ఉన్నాయి. అవి యాకోబు సువార్త, తోమా సువార్త, బర్నబా సువార్త లు. ఖురాన్ దైవ గ్రంథమని, ఖురాన్ లో చివరికి ప్రవక్త సొంతమాటలు కూడా చేర్చలేదని ముస్లిముల వాదనను క్రైస్తవులు నిరాకరిస్తారు. బైబిలే అంతిమ దైవగ్రంథమని, యేసు క్రీస్తే చివరి ప్రవక్త అని విశ్వసిస్తారు.
ప్రపంచంలోని రెండు అతి పెద్ద మతాలైన క్రైస్తవం, ఇస్లాంల మధ్య స్థూలంగా తేడాలివి. ఈ అభిప్రాయ బేధాలు పవిత్ర గ్రంథాల పరిధిదాటి మనిషి మెదళ్లకు, సమూహాల కోపానికి, దేశాల ప్రతీకారం స్థాయికి చేరిందే.. ఇప్పుడు మనమున్న ప్రస్తుతం. 'అమెరికా నుంచి ముస్లింలను వెళ్లగొడతా'నంటూ అగ్రదేశంలో ఎన్నికల వాగ్ధానం చేస్తాడొకరు. 'క్రిస్టియన్ల నామరూపాలు లేకుండా చేయడమే మా లక్ష్యం' అని ప్రకటిస్తాడో ఇస్లామిక్(!) ఉగ్రవాది.
చాలా దేశాల మాదిరే పాకిస్థాన్ లో అంతూపొంతూ లేకుండా కొనసాగుతున్న మతఘర్షణల పరంపరలో ఎట్టకేలకు శాంతి చిగురుటాశలా వికసించింది. ఈ ఏడాది ఈస్టర్ పండుగనాడు ఎక్కడైతే క్రైస్తవుల నెత్తురు ఏరులైపారిందో ఆ లాహోర్ ప్రాంతంలోనే ఓ అద్భుతం చోటుచేసుకుంది. అధికారిక ఇస్లామిక్ దేశంలో ఆధిపత్య ముస్లింలు.. మైనారిటీలైన క్రిస్టియన్లకు చర్చి కట్టించేందుకు ముందుకొచ్చారు. నేటి పరిస్థితుల దృష్ట్యా దీనిని 'పాకిస్థాన్ లో జరిగిన అద్భుతంగా' భావించడంలో తప్పులేదు.
పాకిస్థాన్ లోని పంజాబ్ ఫ్రావిన్స్ ఆ దేశ ఆర్థిక రంగానికి వెన్నెముక. ప్రధానంగా వస్త్రాల తయారీ, ఇతర కర్మాగారాలకు నెలవైన ఫైసలాబాద్ నగరానికి 'మాంచెస్టర్ ఆఫ్ పాకిస్థాన్' అనే పేరు కూడా ఉంది. ఈ నగరానికి సమీపంలోనే గోజ్రా అనే గ్రామం ఉంది. ఊరిపేరు గోద్రా మాదిరే ఉన్నా అక్కడ మాత్రం ముస్లిం, క్రిస్టియన్లు గొడవలు పడరు. అన్నదమ్ముల్లా అన్యోన్యంగా కలిసి ఉంటారు. దాదాపు 150 కుటుంబాలున్న ఆ ఊరిలో 20 క్రైస్తవ కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి. మరుగుదొడ్లు కడిగే వృత్తిలో ఉన్న ఆ క్రైస్తవులు కడు పేదలు. పండుగలు వస్తే అంతా కలిసి తమలోనే ఒకరి ఇంట్లో ప్రార్థనలు జరుపుకుంటారు. ప్రార్థనా మందిరం లేక ఏళ్లుగా వీరు పడుతోన్న బాధలు చూసి చలించిపోయిన ముస్లింలు చర్చిని నిర్మిస్తామని ముందుకొచ్చారు.
2016, మార్చి 28న ముస్లింలు తమ నిర్ణయాన్ని క్రైస్తవులకు తెలిపారు. ఆ రోజు ఈస్టర్. ఓ వైపు సింధ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్ లోని పబ్లిక్ పార్కులో ఉగ్రవాదులు బాంబులతో 60 మంది క్రిస్టియన్లను చంపగా, అదే ప్రావిన్స్ లోని గోజ్రా మాత్రం సరికొత్త నిర్ణయానికి వేదిక అయింది. చర్చి నిర్మాణం కోసం అవసరమైన రూ. 7 లక్షలు కూడా ముస్లిం కుటుంబాల నుంచే సేకరించారు. ఒక్కో ఇంటి నుంచి ఒక్కరో ఇద్దరో చర్చి నిర్మాణం జరిగే చోటికి వెళ్లి ఇటుకలు అందించడమో, సిమెంట్, ఇసుకల్ని కలపడమో చేస్తున్నారు.
'మా మతాలు వేరు కావచ్చు, మేం చేస్తున్న పని కొందరికి నచ్చకపోవచ్చు. కానీ ప్రపంచానికి ఒక విషయం తెలియజెప్పాలనుకుంటున్నాం.. పాకిస్థాన్ ఉగ్రదేశం కాదని నిరూపించాలనుకున్నాం. అందుకే క్రైస్తవులకు చర్చి కట్టించేందుకు ముందుకు వచ్చాం. మేమంతా అన్నదమ్ములం' అని చెబుతున్నాడు చర్చి నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తోన్న ముస్లిం మియా ఎజాజ్. ప్రజాస్వామ్య దేశంగా భారత్ లో మతసామరస్యం వెల్లివిరియడం కనిపించేదే. మతరాజ్యాలైన పాకిస్థాన్ లాంటి దేశాల్లో మాత్రం ఇలాంటి ఘటనలు లేవు! అన్నట్లు పాక్ జనాభాలో క్రైసవ మైనారిటీల జనాభా 3 శాతం. వీరిలో 60 శాతం మంది పంజాబ్ ఫ్రావిన్స్ లోనే ఉన్నారు. చాలా మంది మరుగుదొడ్లు శ్రుభవ్రచేసే(శానిటేషన్) వృత్తిలో ఉండగా, చదువుకున్నవారు బోధనా రంగంలో రాణిస్తున్నారు.
- మధు కోట