ఫైవ్‌స్టార్ హోటల్లో గ్యాస్ పేలుడు, 14మందికి గాయాలు
లండన్: సెంట్రల్ లండన్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. లండన్‌లోని పోర్ట్మాన్ స్క్వేర్, చర్చిల్ హైయత్ రీజెన్సీ సమీపంలో శనివారం రాత్రి 11. 40 (బ్రిటిష్ కాలమానం ప్రకారం) గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు 14మందికి గాయాలయినట్టు అక్కడి స్కాట్లాండ్ యార్డ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే గాయపడిన వారంతా హోటల్ సిబ్బందిగా తెలుస్తోంది.
సమాచారం అందుకున్న 80మంది అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్నారు. రెస్క్యూ టీం సహా సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ పేలుడు సంభవించడంతో హోటల్లో ఉన్న అతిథులంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. దాంతో హోటల్లో ఉన్న 500 మంది అతిథులను హోటల్ సిబ్బంది ఖాళీ చేయించినట్టు తెలిసింది. ఈ హోటల్లో 400 లకు పైగా గదులు ఉన్నాయి. కాగా, గ్యాస్ లీక్ అవడానికి గల కారణాలను నిపుణులు దర్యాప్తు జరుపుతున్నారు.