ఆంధ్రకేసరిని..ఆదర్శంగా తీసుకుందాం!
కర్నూలు(కల్చరల్): ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులును ఆదర్శంగా తీసుకుందామని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ అన్నారు. స్థానిక సునయన ఆడిటోరియంలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం టంగుటూరి ప్రకాశం 143వ జయంత్యుత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టంగుటూరి గడిపిన సాదాసీదా జీవనం, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ, అకుంఠిత దీక్ష ఎంతో ఆదర్శవంతమైనదన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న కర్నూలు జిల్లాపరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయాలు నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన ఆశయసాధనలో భాగంగా అవినీతి రహిత సమాజాన్ని నిర్మిం చేందుకు అందరూ సమాయత్తం కావాలన్నారు.
ఆకట్టుకున్న ప్రకాశం పంతులు నృత్య రూపకం
ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని కర్నూలు లలిత కళాసమితి కళాకారులు, రవీంద్ర జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. బందీగా మారిన భరతమాత, స్వాతంత్య్ర సమరవీరులు భగత్‌సింగ్, ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి, అల్లూరి, కన్నెగంటి, దుర్గాబాయి దేశ్‌ముఖ్, జాతిపిత మహాత్మాగాంధీ వేషధారణల్లో విద్యార్థులు ప్రేక్షకులను అలరించారు.
టంగుటూరి ప్రకాశం పాత్రలో ప్రముఖ కళాకారుడు ఇనాయతుల్లా కర్నూల్లో ప్రకాశం ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలను ప్రకటించే దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియ, బాలవెంకటేశ్వర్లు, ప్రజాసాట్యమండలి కళాకారుడు బసవరాజు, నటరాజ నృత్యానికేతన్ డెరైక్టర్ కరీముల్లా ఈ రూపక ప్రదర్శనకు సహకరించారు.
ఆంధ్రకేసరి జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్, జాయింట్ కలెక్టర్ కన్నబాబు జిల్లాలోని కళ, క్రీడారంగాలకు సేవలందించిన వారికి సన్మానాలు చేశారు. మాజీ మేయర్ రఘురామిరెడ్డి, చంద్రశేఖర్ కల్కూరా, న్యాయవాదులు శ్రీరాములు, నాగలక్ష్మారెడ్డి, పాలూరి ఎల్లప్ప, పత్తి ఓబులయ్య, మహమ్మద్ మియా, ఇనాయతుల్లా, కరీముల్లా, వైద్యం వెంకటేశ్వరాచార్యులు, అవధాని రామమూర్తి, వియోగి, ఎస్.డి.వి. అజీజ్, ఎలమర్తి రమణయ్య, చంద్రకంటి మద్దయ్య తదితర కళాకారులను హర్షద్ హుశేన్, జమీలా తదితర క్రీడాకారులను సన్మానించారు. వక్తృత్వ వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. బీసీ కార్పొరేషన్ ఈడీ రమణ, డీఈఓ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ వి.వి.ఎస్.మూర్తి, రవీంద్ర విద్యాసంస్థల డెరైక్టర్ పుల్లయ్య, వివిధ కళాశాలల, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.