ఇసుక క్వారీపై ‘పచ్చ’ పెత్తనం
- టీడీపీ నేతల ఒత్తిడితో మేనేజర్‌ను మార్చిన అధికారులు
- క్వారీలో బైఠాయించి నిరసన తెలిపిన డ్వాక్రా మహిళలు
రాజంపేట : రాజంపేట మండల పరిధిలోని చెయ్యేరు నదిలో శేషమాంబపురం డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీ వ్యవహారం టీడీపీ నేతల మధ్య చిచ్చురేపింది. డ్వాక్రా సంఘం ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నందున సమీప గ్రామాల్లోని చాలా మంది టీడీపీ నేతలకు ఇసుక నుంచి వచ్చే ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఎలాగైనా క్వారీని తమ అదుపులో ఉంచుకోవాలని వ్యూహం పన్నారు. క్వారీ మేనేజర్‌ను తొలగించి అతని స్థానంలో వారికి అనుకూలంగా ఉన్న వారిని నియమించుకోవడంలో సఫలమయ్యారు. ఇందులో భాగంగా పలు ఫిర్యాదు చేయించి ఓ ప్రజాప్రతినిధి ద్వారా డీఆర్డీఏ అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
టీడీపీ నేతల ఒత్తిడి మేరకు అధికారులు క్వారీ మేనేజర్‌ను మార్పించారన్న విషయం తెలుసుకున్న డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో శుక్రవారం ధర్నాకు దిగారు. నదిలో బైఠాయించడంతో ఇసుక కోసం వచ్చిన వాహనాలు క్యూ కట్టాయి. స్థానికేతరులకు పగ్గాలు అప్పగించడంపై సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, ఉపాధ్యక్షురాలు పార్వతమ్మ, కోశాధికారి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో దాదాపు రెండు వందల మందికిపైగా గ్రామానికి చెందిన మహిళలు క్వారీ రహదారిలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న డీఆర్డీఏ కో-ఆర్టినేటరు నీలకంఠేశ్వరరెడ్డి హుటాహుటిన ఘటన స్థలికి తరలివచ్చారు. క్వారీలో ఇసుక రవాణా అడ్డుకోవడం మంచిది కాదని, నియమించిన మేనేజర్ తాత్కలికమేనని మహిళలకు నచ్చజెప్పారు.
అదే సమయంలో మండలంలోని చెర్లోపల్లె, మందపల్లె, గుండ్లూరు, కొల్లవారిపల్లె, తదితర గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు క్వారీ వద్దకు చేరుకోవడంతో స్థానిక మహిళలు వారితో వాగ్వాదానికి దిగారు. డీఆర్డీఏ కోఆర్డినేటర్ టీడీపీ నేతలతో మాట్లాడి అక్కడి నుంచి పంపించేశారు.