ఉత్పత్తి ఆగినా.. సరిపడినంత సరుకుంది: ఐటీసీ
న్యూఢిల్లీ: ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ మార్కెట్లో సరిపడినంత సిగరెట్ స్టాక్ అందుబాటులో ఉందని ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ పేర్కొంది. పొగాకు ఉత్పత్తుల ప్యాకేజింగ్ స్పేస్లో 85 శాతాన్ని పెద్ద పెద్ద హెచ్చరిక గుర్తుల ప్రదర్శనకు ఉపయోగించాలనే కొత్త నిబంధనల (ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వ చ్చాయి) నేపథ్యంలో ఐటీసీ కంపెనీ తన ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. నిబంధనల అమలుకు ఇంకా తాము సంసిద్ధమవ్వలేదని, ఈ అంశంపై స్పష్టత వచ్చే వరకు ఫ్యాక్టరీలు కార్యకలాపాలు జరగవని ఐటీసీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. హెచ్చరిక గుర్తుల ప్యాకేజింగ్ స్పేస్ సగటు అంతర్జాతీయంగా 31 శాతంగా, టాప్-5 పొగాకు ఉత్పత్తి దేశాల్లో (చైనా, బ్రె జిల్, అమెరికా, మలావి, జింబాంబ్వే) 20%గా ఉందని తెలిపారు.