Cincinnati Masters
-
సిన్సినాటి చాంప్స్ మెద్వదేవ్, కీస్
సిన్సినాటి: సిన్సినాటి ఓపెన్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో సరికొత్త చాంపియన్లు అవతరించారు. పురుషుల సింగిల్స్‌లో డేనియల్ మెద్వదేవ్(రష్యా), మహిళల సింగిల్స్‌లో మాడిసన్ కీస్(అమెరికా) ట్రోఫీలు ఎగరేసుకుపోయారు. సోమవారం జరిగిన తుదిపోరులో తొమ్మిదోసీడ్, వరల్డ్ నెం.5 మెద్వదేవ్ 7–6(7/3), 6–4తో 16వ సీడ్, 15వ ర్యాంకర్ డేవిడ్ గఫిన్(బెల్జియం)పై చెమటోడ్చి నెగ్గాడు. ఇది మెద్వదేవ్‌కు తొలి ఏటీపీ మాస్టర్స్ టైటిల్. కాగా, అద్భుత ఫామ్‌లో ఉన్న మెద్వదేవ్‌కు ఈ ఏడాది ఇది 43వ విజయం. అతని తర్వాతి స్థానంలో 41 విజయాలతో నాదల్(స్పెయిన్), 39 గెలుపులతో ఫెదరర్(స్విట్జర్లాండ్) ఉండడం విశేషం. మరోవైపు హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్థానిక క్రీడాకారిణి మాడిసన్ కీస్నే విజయం వరించింది. తుదిపోరులో ఆమె 7–5, 7–6(7/5)తో స్వెత్లానా కుజ్నెత్సోవా(రష్యా)పై చెమటోడ్చి నెగ్గింది. ఇది కీస్‌కు కెరీర్లో ఐదో టైటిల్ కాగా, ఈ సీజన్లో రెండోది. -
సెమీస్‌లో సానియా జంట
ఒహాయో: సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా–షుయె పెంగ్ (చైనా) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–షుయె పెంగ్ జోడీ 6–3, 6–7 (1/7), 10–3తో ఇరీనా కామె లియా బేగూ–రలూకా ఒలారు (రొమేనియా) జంటపై విజయం సాధించింది. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయే షియా) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్లో బోపన్న–డోడిగ్ ద్వయం 5–7, 7–5, 10–8తో కబాల్ (కొలంబియా)–ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) జోడీపై గెలిచింది. -
హింగిస్‌పై సానియా పైచేయి!
సిన్సినాటి: నిన్న, మొన్నటి వరకూ సానియా మీర్జా(భారత్)-మార్జినా హింగిస్(స్విట్జర్లాండ్)లు 'సాన్‌టినా'గా జోడిగా మనకు సుపరిచితమే. అయితే ఈ జోడీకి కటీఫ్ చెప్పుకున్న అనంతరం జరిగిన తొలి పోరులో మార్టినా హింగిస్‌పై సానియా మీర్జా పైచేయి సాధించింది. సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా - బార్బోరా స్ట్రికోవా(చెక్ రిపబ్లిక్) ద్వయం 7-5, 6-4 తేడాతో మార్టినా హింగిస్-కోకో వాండెవేగ్(అమెరికా)పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. దీంతో డబ్యూటీఏ డబుల్స్‌లో సానియా ఒంటిరిగా అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతేడాది మార్చిలోసానియా-హింగిస్లు 'సాన్‌టినా'గా జత కట్టారు. అనంతరం ఈ జోడీ అప్రతిహత విజయాలతో దూసుకుపోయింది. వరుసగా 41 మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని ఈ జోడి .. ఓవరాల్ గా 14 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో మూడు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2015 వింబుల్డన్ ఓపెన్, యూఎస్ ఓపెన్లు గెలుచుకున్న సాన్టినాలు.. 2016లో ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్ సైతం కైవసం చేసుకున్నారు. ప్రత్యేకంగా గతేడాది తొమ్మిది టైటిల్స్ ఈ జోడి ఖాతాలో చేరాయి. దాంతో పాటు చార్లెస్టన్ టైటిల్ ను గెలిచిన అనంతరం వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును సైతం సొంతం చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో ఈ జోడీ ఘోరంగా విఫలం కావడంతో తమ టెన్నిస్ బంధానికి కటీఫ్ చెప్పుకున్నారు. -
క్వార్టర్స్ లో సెరీనా విలియమ్స్
వాషింగ్టన్: సిన్సినాటి మాస్టర్స్‌లో టోర్నీలో అమెరికాకు చెందిన ప్రపంచ అగ్రశ్రేణి క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఈ రోజు జరిగిన ప్రి-క్వార్టర్స్‌లో సెరీనా విలియమ్స్ 6-4, 6-1 తేడాతో మోనా బర్తెల్‌ను ఓడించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. సెరీనా ధాటికి ఏ మాత్రం పోటీ నివ్వకుండానే ప్రత్యర్థి క్రీడా కారిణి మోనా టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఆద్యంత ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సెరీనా విజయం సాధించి తన బ్యాట్ కు పదును తగ్గలేదని రుజువు చేసింది. శుక్రవారం జరిగే క్వార్టర్స్ ఫైనల్లో సెరీనా విలియమ్స్ రోమానియన్ సిమోనాతో తలపడనుంది.