గుర్మీత్ సినిమా లైసెన్స్ రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచార కేసులో ఊచలు లెక్కిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు మరో ఝలక్ తగిలింది. చలన చిత్ర పరిశ్రమ గుర్మీత్‌పై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
‘అత్యాచార కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్ సినిమా లైసెన్స్ రద్దు చేస్తున్నాం. ఇక సినిమాలు తీయటానికి వీల్లేదు’ అని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోషియేషన్స్(IFTDA) ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు సినీ మరియు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆయన వర్క్ పర్మిట్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
మెసెంజర్ ఆఫ్ గాడ్ పేరిట బాలీవుడ్లో అన్నీ తానై రెండు సినిమాలు తీసిన డేరా బాబాకు సొంతంగా ప్రోడక్షన్ సంస్థ, స్టూడియో ఉన్న విషయం తెలిసిందే. ఇదే ఏడాది బెంగాలీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ బయోపిక్‌ను గుర్మీత్ తెరకెక్కించాలనే ఫ్లాన్ కూడా చేశాడు. ఈ ప్రాజెక్టు కోసం ఓ క్రేజీ హీరోయిన్‌కు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడంట. అంతేకాదు మెసెంజర్ ఆఫ్ గాడ్ మూడో పార్ట్ పనులను కూడా ప్రారంభించేశాడని గుర్మీత్ అనుచరులు చెబుతున్నారు.