నాటి మొగలిపురమే నేటి మొగల్తూరు
గతకాలపు వైభవానికి ప్రతీకగా గ్రామం
చెక్కుచెదరని కేతకీమహాల్, కోటలోని లక్కమేడ
ఎందరో ప్రముఖులను అందించిన పురిటిగడ్డ
రెబల్‌స్టార్, మెగాస్టార్లు పుట్టింది ఇక్కడే..
ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని సర్పంచ్ వివరణ
ఆనాటి రాజుల కళావైభవానికి ప్రతీకగా నిలిచింది జిల్లాలోని మొగల్తూరు గ్రామం. మొగలిడొంకలు ఎక్కువగా ఉండటంతో మొగలిపురంగా, కేతకీమహాల్ను కలిగి ఉండడంతో కేతకీపురంగా పేర్లు మార్చుకుని ఆఖరుకు మొగల్తూరుగా స్థిరపడిన ఈ గ్రామం చారిత్రక ప్రసిద్ధమైంది. 16వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని సంస్థానాధీశులు ఏకఛత్రాదిపత్యంగా పాలనసాగించారు. ఆ చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నేటికి గ్రామంలోని కేతకీమహాల్, కోటలోని లక్కమేడ నిలిచాయి. మొగల్తూరు
కళాకారులకు పుట్టినిల్లు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెబల్‌స్టార్ కృష్టంరాజు, మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్‌స్టార్ ప్రభాష్ ఈ గ్రామ వాసులే. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వారు. రెండు సార్లు ఎంపీగా, కేంద్రమంత్రిగా కృష్టంరాజు పనిచేయగా, చిరంజీవి కూడా కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. అంతేకాకుండా షార్(శ్రీహరికోట హైఆల్టిట్యూడ్ రేంజ్)మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన ఈ గ్రామ వాసి అయిన ఎంవైఎస్ ప్రసాద్ ద్వారా మొగల్తూరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచింది.
సైన్యంలోనూ ఈ ఊరువారు
ఆర్మీలో కల్నల్ వీకే రావు, కల్నల్ వీపీ విఠల్, వింగ్ కమాండర్ ఎ.జయప్రకాష్ విధులు నిర్వహించి పదవీ విరమణ చేసినా, ఈ గ్రామానికి చెందిన సుమారు 40 మంది యువకులు మిలటరీలో వివిధ విభాగాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.
బంగినపల్లి మామిడికి పెట్టింది పేరు
లేటైనా లేటెస్ట్గా వచ్చినా మొగల్తూరు బంగినపల్లి రుచే వేరు. మామిడి సీజన్ ఆఖరిలో కోతకు వచ్చినా రంగు, రుచి, వైవిధ్యంలో ఇది ప్రత్యేకం. గ్రామంలో బంగినపల్లి మామిడి తోటలు ప్రత్యేకంగా లేకపోయినా వ్యవసాయ భూముల్లో విరివిగా ఉన్న ఈ చెట్ల కాపు రైతులకు సిరులు పండిస్తున్నాయి. ఈ ప్రాంతం వారు దేశ, విదేశాల్లో ఉన్న వారి బంధువులు, స్నేహితులకు ఎంత ధరైనా కొని వీటిని పంపిస్తారు.
ఎందరినో తీర్చిదిద్దిన ఉన్నత పాఠశాల
గ్రామంలో 1951లో స్థాపించిన పెన్మత్స రంగరాజు ఉన్నత పాఠశాల ఎందరినో తీర్చిదిద్దింది. మండలంలోని 17 గ్రామాల విద్యార్థులకు ఈ పాఠశాలే ఆధారం. రవాణా సౌకర్యం లేని ఆ రోజుల్లో విద్యార్థులు ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఇక్కడకు వచ్చేవారు. ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా ఉన్నతస్థానంలో నిలిపిన పాఠశాల ఇప్పటికీ అదేస్థాయిలో కొనసాగుతోంది.
ఈ గ్రామవాసిగా గర్వపడుతున్నా..
సంస్థానాధీశుల వారసురాలిగా, ఈ గ్రామ వాసిగా చాలా గర్వ పడుతున్నాను. ఈ గ్రామం అభివృద్ధి చెందినా ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది.
కలిదిండి స్వర్ణ, సర్పంచ్
పుట్టిన ఊరును మరచిపోకూడదు
కనిపెంచిన తల్లిని, పుట్టిన ఊరును మరచిపోకూడదు. వివిధ రంగాలలో ఉన్నతస్థాయిలో ఉన్న ఈ గ్రామవాసులు స్వగ్రామాభివృద్ధికి ముందుకు రావాలి.
పొదిలి కృష్టమూర్తి, విశ్రాంత ఉపాధ్యాయుడు
గ్రామ ముఖచిత్రం
విస్తీర్ణం పురుషులు మహిళలు మొత్తం ఓటర్లు
3661,29 ఎకరాలు 8262 8332 11800
ఉన్నత పాఠశాల ప్రాథమిక ప్రాథమికోన్నత అక్షరాస్యత
1 14 2 75,05 శాతం