కట్టుబడి
నూతన ప్రైవేటు పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు కఠినం
రిజిస్ట్రేషన్ ఫీజు పదిరె ట్లు పెంపు
ఆ భారం విద్యార్థుల తల్లిదండ్రులపైనే పడనుందా?
రాష్ర్టంలో విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఒక్కో వీధిలో రెండు, మూడు ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రైవేట్ స్కూళ్లల్లో చిన్నారులపై అత్యాచారాలు పెరిగాయి. దీంతో కళ్లు తెరుచుకున్న ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటుకు ఉన్న నిబంధనలను కఠినతరం చేసింది. రిజిస్ట్రేషన్ ఫీజును ఏకంగా పది రెట్లు పెంచింది. త్వదారా నూతన స్కూళ్ల సంఖ్య తగ్గుతుందని, అప్పుడు వాటిపై నిఘా వేయడం సాధ్యమవుతుందని ప్రభుత్వం చెబుతోంది. రిజిస్ట్రేషన్ ఫీజు భారాన్ని విద్యా సంస్థ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపైనే మోపుతాయని, తద్వారా విద్య మరింత భారమవుతుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బెంగళూరు : రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న ప్రైవేటు పాఠశాలకు మూకుతాడు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. అంతేకాకుండా పాఠశాలల రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏకంగా పదిరెట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న పాఠశాల సంఖ్య తగ్గడమే కాకుండా విద్యాసంస్థల్లో నిఘాను పెంచడానికి వీలవుతుందని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది పాఠశాలలను ప్రారంభించాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30 వరకూ గడువు పొడగిస్తూ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా, అక్టోబర్ 30కే దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా వివిధ రకాల కారణాలతో రిజిస్ట్రేషన్ ఫీజులను పెంచడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజులను నిర్ణయించడం వల్ల ఆ భారాన్ని చివరికి తల్లిదండ్రులు భరించాల్సి వస్తుందని విద్యారంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
నూతన నిబంధనలు...
నూతన పాఠశాలలు పారంభించాలంటే గ్రామీణ ప్రాంతంలో కనిష్టంగా రెండు ఎకరాలు, మున్సిపాల్టీల పరిధిలో ఒకటిన్నర ఎకరా, మహానగర పాలికే పరిధిలో ఒక ఎకరా పాలక మండలి సొంతంగా లేదా ఖచ్చితంగా లీజు అగ్రిమెంట్ కనిష్టంగా 30 ఏళ్లు ఉండాలి.
రిజిస్ట్రేషన్ ఫీజుకు అదనంగా ఇకపై ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
ఒక్కొక్క తరగతి గది 18్ఠ20 విస్తీర్ణంలో ఉండాలి.
ప్రాథమిక పాఠశాలలో కనిష్టంగా ఐదు తరగతి గదులు, మాధ్యమిక పాఠశాలల్లో ఎనిమిది, ఉన్నత పాఠశాలల్లో పది గదులు తప్పక ఉండాలి.
మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యంతోపాటు తప్పక ఆటస్థలం, ప్రహరీగోడ ఉండాలి.
విద్యాశాఖ అనుమతి లేకుండా పాఠశాల పాలక మండలి (మేనేజ్మెంట్)ను ఒకరి పేరు నుంచి మరో పేరుకు మార్చడానికి వీలు లేదు.
వీటన్నింటితో పాటు స్థానిక ప్రభుత్వాలు అక్కడి పాఠశాలల్లో విద్యార్థుల భద్రత కోసం రూపొందించే నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి. లేదంటే పాఠశాల పాలక మండలి సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు.