విద్యుదాఘాతంతో యువకుడి మృతి
సర్కస్ బృందంలో విషాదం
వై.కొత్తపల్లి (పి.గన్నవరం) :
విద్యుదాఘాతానికి గురై సర్కస్ కళాకారులు మరణించిన ఉదంతమిది. మండలంలోని వై.కొత్తపల్లిలో శుక్రవారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన సర్కస్ బృందం కొన్ని రోజులుగా కోనసీమలో సర్కస్ ప్రదర్శనలు ఇస్తోంది. గురువారం రాత్రి వై.కొత్తపల్లి గ్రామంలో సర్కస్ ప్రదర్శన ఇచ్చారు. రాత్రివేళ లైటింగ్ కోసం కర్రను పాతి, దానికి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం ఆ బృందంలోని అవేట గోవింద్(18) ఆ కర్రను తొలగిస్తుండగా, దానికున్న తీగ 11 కేవీ విద్యుత్ లైన్ను తాకింది. దీంతో విద్యుదాఘాతానికి గురై గోవింద్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై పి.వీరబాబు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
‘సినిమాకి తీసుకువెళ్తా.. లేవరా నాన్నా..’
‘అన్నం తినిపిస్తా.. సినిమాకు తీసుకువెళ్తా.. లేవరా నాన్నా.. అంటూ కొడుకు మృతదేహం వద్ద గోవింద్ తల్లి విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. సర్కస్ బృందంలో గోవింద్ ప్రధాన భూమికను పోషిస్తున్నాడు. అతడి మృతితో జీవనాధారం కోల్పోయామని గోవింద్ తండ్రి ప్రసాద్, తల్లి శారద, సోదరుడు యోగి, సోదరి భవానీ విలపించారు.