ఐఓఎస్‌లోనూ ‘హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్’
నేటి నుంచి అందుబాటులోకి: జితేందర్
సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు రూపొందించిన సిటిజన్ ఫ్రెండ్లీ మెబైల్ యాప్ (HYDERABADTRAFFIC LIVE) ఐఓఎస్ పరిజ్ఞానంలోనూ అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి యాపిల్ ఐ స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ట్రాఫిక్ చీఫ్ జితేందర్ గురువారం తెలిపారు. ఈ యాప్‌ను ఆవిష్కరించినప్పుడు కేవలం ఆండ్రాయిన్ పరిజ్ఞానంతో పని చేసే ఫోన్లకు మాత్రమే ఉపకరించేలా రూపొందించారని,. ప్రస్తుతం ఐఓఎస్ పరిజ్ఞానంతో పని చేసే ఐఫోన్ వినియోగదారులకూ అనుగుణంగా అభివృద్ధి చేశారు. జీపీఎస్ ఆధారంగా పని చేసే ఈ యాప్‌లో తొమ్మిది రకాలైన సమాచారం, సేవలు అందబాటులో ఉంటాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, నేరాలతో పాటు పోలీసులు చేసే ఉల్లంఘనలు, సూచనల్ని ఇందులో ఫీడ్ చేయవచ్చు. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆటో చార్జీ ఎంత ఉంటుందనేదీ తెలుసుకోవచ్చు. వివిధ మార్గాల్లో ఉన్న ట్రాఫిక్ సరళి గరిష్టంగా ఓ నిమిషం ఆలస్యంగా ఇందులో అప్డేట్ అవుతూ ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని చెప్పడంతో పాటు సమీపంలో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సైతం ఇది సూచిస్తుంది. గమ్య స్థానం దూరం, మ్యాప్స్ సైతం కనిపిస్తాయి.
ఓ వ్యక్తి తాను ఉన్న ప్రాంతం నుంచి సమీపంలో ఉన్న శాంతిభద్రతల విభాగం, ట్రాఫిక్ పోలీసుస్టేషన్లను తెలుసుకోవడానికి, మీ వాహనంపై ఉన్న పెండింగ్ ఈ-చలాన్లు తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. దీని ద్వారానే మొబైల్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌లకు కనెక్ట్ అవడంతో పాటు బకాయి మొత్తాన్ని అప్పటికప్పుడే చెల్లించే సౌకర్యమూ ఉంది. నో పార్కింగ్‌లో ఉంచిన వాహనాలను పోలీసులు క్రేన్ ద్వారా ఎత్తుకెళితే (టోవింగ్) ఆ విషయాన్నీ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆర్టీఏ వివరాలు, ఆటో, బస్సు, క్యాబ్, ట్యాక్సీ తదితర వాహనాలకు సంబంధించిన ఫిర్యాదులు, రహదారి నిబంధనలు, ఉపయుక్తమైన వెబ్సైట్లు, రోడ్ సైన్స్, ట్రాఫిక్ పోలీసు అధికారుల సమాచారం ఇందులో లభిస్తాయి.