City Corporation office
-
హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేసి ఒకే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను విలీనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో 30 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండగా, అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒకే మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలా లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ హైదరాబాద్ సిటీల పేరుతో నాలుగు ప్రత్యేక కార్పొరేషన్లుగా విభజించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని అన్ని వైపులా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించాలని సీఎం ఇటీవలే అధికారులను ఆదేశించారు. పాలకవర్గాల పదవీకాలం ముగిశాకే.. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే వాటికి స్పెషలాఫీసర్లను నియమించాలని, అన్నింటి పదవీకాలం ముగిసిన తర్వాత ఈ విలీన ప్రక్రియను ప్రారంభించాలని మున్సిపల్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఇటీవల సమాలోచనలు చేశారు. పదవీకాలం ముగిసిన తర్వాత విలీనం చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుందని యోచిస్తున్నారు. హెచ్ఎండీఏ పరిధిని యూనిట్‌గా తీసుకొని ఒకే గ్రేటర్ సిటీ కార్పొ రేషన్‌గా చేయటం, లేదా సిటీ మొత్తాన్ని 4 కార్పొరేషన్లుగా విభజించడం అనే అంశాన్ని పరిశీలించాలని మున్సిపల్ శాఖ అధికా రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జనాభా ప్రాతిపదికన డివిజన్ల పునర్విభజన.. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని డివిజన్లకు నిధుల పంపిణీలో అసమానతలున్నాయని విమర్శలున్నాయి. కొన్ని డివిజన్ల పరిధిలో లక్ష మందికిపైగా జనాభా ఉండగా.. కొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో కేవలం 30 వేల మంది మాత్రమే ఉన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించే నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే కొన్ని ప్రాంతాలకు లాభం జరిగి, కొన్ని ప్రాంతాలు నష్టపోతున్నాయి. సిటీ విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వసతుల కల్పనకు ఎక్కువ నిధులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిటీలో అభివృద్ధి చెందిన డివిజన్లకు తక్కువ నిధులు సరిపోతాయి. వీటన్నింటి దృష్ట్యా గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఏకరీతిగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి యోచిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించారు. ఇంచుమించుగా సమాన జనాభా ఉండేలా డివిజన్లను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. అందుకు అవసరమైన పునర్విభజన ప్రక్రియపై ముందుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ఢిల్లీ కార్పొరేషన్ తరహాలో... దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల కిందటే అక్కడున్న మూడు మునిసిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసింది. అక్కడ జరిగిన విలీనం తీరు, అందుకు అనుసరించిన విధానాలను సీఎం మున్సిపల్ శాఖను అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బండ్లగూడ జాగీర్, నిజాంపేట, బడంగ పేట్, మీర్పేట్ మునిసిపల్ కార్పొరేషన్లు, మరో 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. 30 మున్సిపాలిటీలివే.. ► రంగారెడ్డి జిల్లా: పెద్దఅంబర్‌పేట, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, షాద్‌నగర్, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకరపల్లి, తుక్కుగూడ ►మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా: మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ ►యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి, చౌటుప్పల్, పోచంపల్లి ►సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, చేర్యాల ►మెదక్ జిల్లా: తూప్రాన్, నర్సాపూర్ -
లెక్క లేదు
నగర పాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ నియామకాలకు లెక్క లేదు. వీరు ఎక్కడ పని చేస్తున్నారో ఉన్నతాధికారులు అడిగినా.. సమాధానం చెప్పే దిక్కు లేదు. వీరి జీతాల చెల్లింపుల్లో అవినీతికి అడ్డూఅదుపూ లేదు. బడ్జెట్లో ఏటికేడు జీతాల లెక్కలు రెట్టింపైనా ఎవరెవరికి పంచుతున్నారో రికార్డు లేదు. ‘ఏమిటిది ?.. ఏం జరుగుతోంది.. వెంటనే లెక్కలు తేల్చండి’ అంటూ కమిషనర్ మండిపడినా 20 రోజులుగా ఆయా విభాగాల అధికారులు ఖాతరు చేసింది లేదు. ఇప్పటి వరకు పని చేసిన సిబ్బందికి ఈ నెల జీతాలు వచ్చిందీ లేదు. ఇదీ గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో అధికారులు అనుసరిస్తున్న తీరు. సాక్షి, గుంటూరు : గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలోని ఇంజినీరింగ్, ప్రజారోగ్య విభాగాల్లో సిబ్బంది కొరత ఉండటంతో అవుట్ సోర్సింగ్ ద్వారా కొందరిని నియమించుకునేందుకు అవకాశం కల్పించారు. వీరికి నగరపాలక సంస్థ ఖజానా నుంచి జీతాలు చెల్లిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం ఇంజినీరింగ్ విభాగంలో 930 మంది, ప్రజారోగ్య విభాగంలో 1667 మంది సిబ్బంది అవుట్ సోర్సింగ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎవరెక్కడ పని చేస్తున్నారో ఆయా విభాగాల అధికారులకే తెలియని పరిస్థితి. డిప్యూటేషన్ల పేరుతో రెవెన్యూ, పట్టణ ప్రణాళిక విభాగం వంటి అనేక విభాగాల్లో వీరిని కేటాయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా భావించిన కొందరు అవినీతి అధికారులు అసలు ఎవరూ పని చేయకుండానే ఉన్నట్లుగా లెక్కలు చూపుతూ నెల నెలా జీతాలు మార్చుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల ఇళ్లలో పనులకూ వీరే.. ప్రజారోగ్య విభాగంలో 1667 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు చెల్లిస్తుండగా, సుమారుగా 300 మంది వరకు నగరపాలక సంస్థతోపాటు, వివిధ శాఖల అధికారుల ఇళ్లల్లో పని చేస్తున్నట్లు సమాచారం. సొంత పనులకు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని వినియోగించుకుంటూ జీతాలు మాత్రం నగరపాలక సంస్థ ద్వారా చెల్లిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ఇంజినీరింగ్ విభాగంలో 930 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నట్లు చెబుతుండగా, ఇటీవల ఏఈలు తమ వద్ద పని చేసే సిబ్బంది లెక్కలు ఎస్ఈకి సమర్పించారు. ఇందులో మాత్రం 888 మంది మాత్రమే పని చేస్తున్నట్లుగా చూపడం చూస్తుంటే మిగతా సిబ్బంది ఎక్కడైనా పని చేస్తున్నారా ? లేక వారు లేకుండానే బినామీ పేర్లతో జీతాల డబ్బులు కాజేస్తున్నారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవుట్ సోర్సింగ్ సిబ్బందిలో అనేక మంది అధికారుల ఇళ్లల్లో డ్రైవర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులుగా వినియోగించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా రెట్టింపు బిల్లులు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల ఖర్చు ప్రతి ఏటా రెట్టింపు స్థాయిలో పెరుగుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల కోసం 2016–17 సంవత్సరానికిగాను రూ. 25 కోట్లు ఖర్చు చేయగా, 2017–18 సంవత్సరానికి అది సుమారుగా రూ. 50 కోట్లకు చేరింది. బిల్లులు నిలిపివేసి నివేదిక కోరిన కమిషనర్ గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది మార్చి జీతాల బిల్లులను వివిధ శాఖల అధికారులు కమిషనర్ శ్రీకేష్ లత్కర్‌కు ఆన్లైన్ ద్వారా పేర్లు లేకుండా పంపారు. అయితే వీటిపై అనుమానం వ్యక్తం చేసిన కమిషనర్ జీతాలు నిలిపివేసి అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఎక్కడెక్కడ పని చేస్తున్నారు ? వారి వివరాలతో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆయా శాఖ అధికారులను ఆదేశించారు. 20 రోజులుగా నివేదిక ఇవ్వని అధికారులు లెక్కలు చూపితే అధికారుల ఇళ్లలో పని చేసే వారితోపాటు అసలు పనిచేయని వారి గుట్టు సైతం బయటపడుతుందని భయమో ఏమోగానీ 20 రోజులు దాటుతున్నా ఇంత వరకు వివరాలు కమిషనర్‌కు అందించలేదు. దీంతో నిజంగా పని చేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది సైతం జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ కార్డును బయోమెట్రిక్‌కు అనుసంధానం చేయాలని గత కమిషనర్ అనురాధ అధికారులను ఆదేశించినప్పటికీ ఇంత వరకు ఆ ప్రక్రియ ప్రారంభం కాలేదు. కంప్యూటర్ ఆపరేటర్‌ను మంత్రి పేషీకి పంపాం: రామచంద్రారెడ్డి, ఏసీ గుంటూరు నగరపాలక సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న అవుట్ సోర్సిం గ్ఉద్యోగిని డిప్యూటేషన్‌పై మంత్రి పేషీకి పంపుతూ ఆర్డర్ ఇచ్చాం. మిగతా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు డిప్యూటేషన్‌పై ఇతర విధులు నిర్వర్తిస్తున్నట్లు మా దృష్టిలో లేదు. అకౌంట్ సెక్షన్లో కొంత ఆలస్యం కావడంతోపాటు, కమిషనర్ సెలవులో ఉండటంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఆలస్యమయ్యాయి. -
అవినీతి మరక!
నెల్లూరు, సిటీ : నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం ఉద్యోగుల అంతర్గత బదిలీలకు అవినీతి మరక అంటుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో ధరను నిర్ణయించి ఉద్యోగులను నుంచి వసూళ్లపర్వం మొదలైంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక మేయర్ షాడోతో పాటు మేయర్ పేషీలో పనిచేస్తున్న ఒకరు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. రెవెన్యూ ఆఫీసర్ పోస్టుకు ఒక రేటు, ఆర్ఐ పోస్టుకు ఒక రేటును నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రక్షాళననే అవకాశంగా.. నగర పాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో ఎన్నో ఏళ్లుగా తిష్టవేసిన వారికి స్థానచలనం చేయనున్నారు. ఇప్పటికే కొత్తగా వచ్చిన కమిషనర్ పీవీవీఎస్ మూర్తి రెవెన్యూ విభాగంలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై ఆరా తీశారు. ఈక్రమంలో రెవెన్యూ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తేనే కార్పొరేషన్‌కు ఆదాయం చేకూరుతుందనే ధోరణిలో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన మేయర్ షాడో, మేయర్ పేషీలో పనిచేస్తున్న ఒకరు బేరసారాలు మొదలుపెట్టారని తెలుస్తుంది. కార్పొరేషన్లో బాగా ఆదాయం వచ్చే విభాగం ఏదైనా ఉందంటే అది రెవెన్యూనే. దీంతో ఈ విభాగంలో పోస్టు లభించిందంటే నెలకు లక్షల్లో సంపాదించవచ్చనే ఉద్దేశంలో ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో డివిజన్లలోని స్థానిక టీడీపీ కార్పొరేటర్లు, మేయర్‌కు సన్నిహితంగా ఉండే వారితో చర్చలు జరుపుతున్నారు. దీంతో ఆయా కార్పొరేటర్లు తాము చెప్పినట్టు నడుచుకోవాలని, నెలకు వచ్చే కమీషన్లు తమకు ఇవ్వాలని హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఒక ఆర్ఓ, ఏడుగురు ఆర్ఐలు బదిలీ! రెవెన్యూ విభాగంలో ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు, తొమ్మిది మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, 33 మంది బిల్కలెక్టర్లు ఉన్నారు. రెవెన్యూ ఆఫీసర్ స్థానంలో సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్థానంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులను నియమించనున్నారు. ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లలో ఒకరిని, తొమ్మిదిమంది ఆర్ఐలలో ఏడుగురిని బదిలీ చేయనున్నట్లు కార్పొరేషన్లో ప్రచారం జరగుతోంది. తొమ్మిదిమంది ఆర్ఐలలో ఇద్దరు రెవెన్యూ విభాగంలోకి వచ్చి ఏడాదిలోపు మాత్రమే కావడంతో వారిని బదిలీ చేయకపోవచ్చని తెలుస్తుంది. త్వరలో బిల్కలెక్టర్లను కూడా డివిజన్ల మార్పు చేయనున్నారు. అవినీతిపై కమిషనర్ ఆగ్రహం కొంతమంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లు డిమాండ్లు తగ్గించి రాయడం, కలెక్షన్లు సరిగా చేయకపోవడంపై ఓ సమావేశంలో కమిషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమర్షియల్ ప్రాంతాల్లో అవినీతి తారాస్థాయిలో ఉన్నట్లు ఆర్‌ఐలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇటీవల రెవెన్యూ డివిజన్లలో సర్వే నిర్వహించగా పలు అకవతవకలు జరిగినట్లు కమిషనర్ దృష్టికి వచ్చింది. దీంతో రెవెన్యూ విభాగంలో ఎవరూ సరిగా పనిచేయడం లేదని, వీరి స్థానాలను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈక్రమంలో మేయర్ అజీజ్‌తో చర్చించి ఇప్పటికే జాబితాను తయారుచేసినట్లు సమాచారం. నేడో, రేపో బదిలీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే కమిషనర్ మాత్రం రెవెన్యూ విభాగాన్ని పూర్తిస్థాయిలో బదిలీ చేస్తేనే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని, అవకతవకలు లేకుండా చేయవచ్చనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అయితే కొత్త కమిషనర్ అధికార పార్టీ నేతలకు తలొగ్గుతారా? నేతలకు అనుకూలంగా ఉండే వారిని నియమిస్తారా.? అన్న విషయం తేలాల్సి ఉంది. కొత్తగా వచ్చిన కమిషనర్ పీవీవీఎస్ మూర్తి బదిలీలను రెవెన్యూ నుంచే ప్రారంభించడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. నెలకు లక్షల్లో ఆదాయం వచ్చే స్థానాలు వదులుకోవడం వారికి కష్టంగా మారింది.