అవినీతి మరక!
నెల్లూరు, సిటీ : నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగం ఉద్యోగుల అంతర్గత బదిలీలకు అవినీతి మరక అంటుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో పోస్టుకు ఒక్కో ధరను నిర్ణయించి ఉద్యోగులను నుంచి వసూళ్లపర్వం మొదలైంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక మేయర్ షాడోతో పాటు మేయర్ పేషీలో పనిచేస్తున్న ఒకరు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. రెవెన్యూ ఆఫీసర్ పోస్టుకు ఒక రేటు, ఆర్‌ఐ పోస్టుకు ఒక రేటును నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ప్రక్షాళననే అవకాశంగా..
నగర పాలక సంస్థ కార్యాలయంలోని రెవెన్యూ విభాగంలో ఎన్నో ఏళ్లుగా తిష్టవేసిన వారికి స్థానచలనం చేయనున్నారు. ఇప్పటికే కొత్తగా వచ్చిన కమిషనర్ పీవీవీఎస్ మూర్తి రెవెన్యూ విభాగంలో జరుగుతున్న అవినీతి, అవకతవకలపై ఆరా తీశారు. ఈక్రమంలో రెవెన్యూ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తేనే కార్పొరేషన్‌కు ఆదాయం చేకూరుతుందనే ధోరణిలో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన మేయర్ షాడో, మేయర్ పేషీలో పనిచేస్తున్న ఒకరు బేరసారాలు మొదలుపెట్టారని తెలుస్తుంది.
కార్పొరేషన్‌లో బాగా ఆదాయం వచ్చే విభాగం ఏదైనా ఉందంటే అది రెవెన్యూనే. దీంతో ఈ విభాగంలో పోస్టు లభించిందంటే నెలకు లక్షల్లో సంపాదించవచ్చనే ఉద్దేశంలో ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో డివిజన్లలోని స్థానిక టీడీపీ కార్పొరేటర్లు, మేయర్‌కు సన్నిహితంగా ఉండే వారితో చర్చలు జరుపుతున్నారు. దీంతో ఆయా కార్పొరేటర్లు తాము చెప్పినట్టు నడుచుకోవాలని, నెలకు వచ్చే కమీషన్‌లు తమకు ఇవ్వాలని హెచ్చరించినట్లు తెలుస్తుంది.
ఒక ఆర్‌ఓ, ఏడుగురు ఆర్‌ఐలు బదిలీ!
రెవెన్యూ విభాగంలో ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లు, తొమ్మిది మంది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, 33 మంది బిల్‌కలెక్టర్‌లు ఉన్నారు. రెవెన్యూ ఆఫీసర్ స్థానంలో సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగి, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ స్థానంలో సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగులను నియమించనున్నారు. ఇద్దరు రెవెన్యూ ఆఫీసర్లలో ఒకరిని, తొమ్మిదిమంది ఆర్‌ఐలలో ఏడుగురిని బదిలీ చేయనున్నట్లు కార్పొరేషన్‌లో ప్రచారం జరగుతోంది. తొమ్మిదిమంది ఆర్‌ఐలలో ఇద్దరు రెవెన్యూ విభాగంలోకి వచ్చి ఏడాదిలోపు మాత్రమే కావడంతో వారిని బదిలీ చేయకపోవచ్చని తెలుస్తుంది. త్వరలో బిల్‌కలెక్టర్లను కూడా డివిజన్‌ల మార్పు చేయనున్నారు.
అవినీతిపై కమిషనర్ ఆగ్రహం
కొంతమంది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు డిమాండ్లు తగ్గించి రాయడం, కలెక్షన్లు సరిగా చేయకపోవడంపై ఓ సమావేశంలో కమిషనర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కమర్షియల్ ప్రాంతాల్లో అవినీతి తారాస్థాయిలో ఉన్నట్లు ఆర్‌ఐలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఇటీవల రెవెన్యూ డివిజన్లలో సర్వే నిర్వహించగా పలు అకవతవకలు జరిగినట్లు కమిషనర్ దృష్టికి వచ్చింది. దీంతో రెవెన్యూ విభాగంలో ఎవరూ సరిగా పనిచేయడం లేదని, వీరి స్థానాలను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈక్రమంలో మేయర్ అజీజ్‌తో చర్చించి ఇప్పటికే జాబితాను తయారుచేసినట్లు సమాచారం. నేడో, రేపో బదిలీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే కమిషనర్ మాత్రం రెవెన్యూ విభాగాన్ని పూర్తిస్థాయిలో బదిలీ చేస్తేనే కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుందని, అవకతవకలు లేకుండా చేయవచ్చనే ఉద్దేశంతో ఉన్నట్లు సమాచారం. అయితే కొత్త కమిషనర్ అధికార పార్టీ నేతలకు తలొగ్గుతారా? నేతలకు అనుకూలంగా ఉండే వారిని నియమిస్తారా.? అన్న విషయం తేలాల్సి ఉంది. కొత్తగా వచ్చిన కమిషనర్ పీవీవీఎస్ మూర్తి బదిలీలను రెవెన్యూ నుంచే ప్రారంభించడంతో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. నెలకు లక్షల్లో ఆదాయం వచ్చే స్థానాలు వదులుకోవడం వారికి కష్టంగా మారింది.