దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు అధికార పార్టీ నాయకులు. అధికారంలో ఉండగానే అందిన కాడికి దోచుకుంటున్నారు. అందులో భాగంగా తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను తెచ్చుకునేందుకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
సాక్షి, తిరుపతి: టీడీపీ నాయకులు రెవెన్యూ శాఖలో అధికారులను కోరుకున్న చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు. వారి సహకారంతో పెద్ద ఎత్తున భూములు ఆక్రమించుకుంటున్నారు. తాజాగా అటవీ శాఖలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఉన్నతాధికారి ఒకరిని తిరిగి తెచ్చుకునేందుకు టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్తూరు, కర్నూలు జిల్లాలో అటవీ శాఖలో గోవిందరాజన్ అనే వ్యక్తి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా ఉన్నారు. పనిచేసిన ప్రతిచోటా ఆయనపై కేసులు ఉన్నాయి. మహిళా సిబ్బందిని వేధించడం, కింది స్థాయి అధికారులను అసభ్యంగా మాట్లాడటం, చులకనగా చూడడం ఆయనకు షరా మామూలు. తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా అధికారి పోలీసులకు కూడా ఈయనపై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
ప్రభుత్వ నిధులు దుర్వినియోగం..
2014లో బండి ఆత్మకూరులో పనిచేస్తున్న సమయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న 39 ఏళ్ల మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత చిత్తూరు డివిజన్‌లో తిరుపతి రేంజ్‌కు బదిలీపై వచ్చిన సమయంలో 2015–16లో అవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించి 13వ ఆర్థికసంఘం నిధులు రూ.17,34,426 దుర్వినియోగం చేసినట్లు సామాజిక తనిఖీలో వెల్లడైంది. కేవలం 16 కి.మీ మొక్కలు నాటి 82 కి.మీ.లు నాటినట్లు బిల్లులు పెట్టి నిధులు స్వాహా చేసినట్లు రుజువైంది. దీనిపై శాఖాపరమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ అధికారులు అటవీ శాఖకు లేఖ పంపారు. పుంగనూరు ఫారెస్ట్ రేంజ్‌లో వేసవికాలంలో ఫైర్‌వాచర్స్‌ని తాత్కాలికంగా నియమించుకోవాలంటూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
దీన్ని అవకాశంగా చేసుకుని ఐదుగురు వాచర్స్‌ని నియమించకుండానే నాలుగు నెలల పాటు వారి పేరుతో వచ్చిన సుమారు రూ.1,60,000 స్వాహా చేశారు. పనిచేసిన ప్రతిచోటా ఏదో ఒక అవినీతికి పాల్పడటం, మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించడం, కింది సిబ్బందిని వేధించడం ఈయనకు అలవాటుగా మారింది. పుంగనూరు రేంజ్‌లో పనిచేస్తున్న 23 మంది ఉద్యోగులు గోవిందరాజన్ కిందపనిచేయలేమని, అతని చేష్టలతో విసిగిపోయామంటూ మూకుమ్మడి సెలవుపై వెళ్లనున్నట్లు డీఎఫ్‌ఓకు మొరపెట్టుకున్నారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుంగనూరు రేంజ్ ఉద్యోగులంతా సమావేశమై గోవిందరాజన్ అవినీతి, వేధింపులకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా ఉన్నతాధికారులకు నివేదించారు. విషయం బయటకు పొక్కితే అటవీ శాఖ పరువుపోతుందన్న భయంతో అధికారులు ఆయనను సెలవుపై వెళ్లాలంటూ అంతర్గతంగా ఆదేశించారు.
సర్దుబాటుకు తెలుగు తమ్ముళ్లు..
గోవిందరాజన్‌ను ఎలాగైనా తిరిగి విధుల్లోకి తీసుకురావాలని తాజాగా జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలి సింది. గోవిందరాజన్ తమకు అనుకూలుడని, ఎలాగైనా అతని సమస్యను పరిష్కరించాలని ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, పార్టీ అధ్యక్షుల వద్ద ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగులు, గోవిందరాజన్‌కు మధ్య సర్దుబాటు చేసేందుకు తమ్ముళ్లు భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి. అవినీతి అధికారికి అధికార పార్టీ అండ ఉండడం, ఎలాగైనా విధుల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుండడం పుంగనూరు రేంజ్ సిబ్బందికి ఎంతమాత్రం మింగుడుపడడం లేదు. తిరిగి తీసుకుంటే మూకుమ్మడిగా సెలవులు పెడుతామంటూ వారు హెచ్చరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment