City dwellers
-
ఇంటి పంట: రూఫ్‌టాప్ పొలం.. 5.7 ఎకరాలు!
సిటీ ఫార్మింగ్.. నగరవాసులు ఇప్పుడు అమితంగా ఇష్టపడుతున్న హెల్దీ గ్రీన్ యాక్టివిటీ! అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలన్న తేడా లేదు. ప్రపంచవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు తామర తంపరగా విస్తరిస్తున్న నేపథ్యంలో సిటీ ఫార్మింగ్ ఊపందుకుంది. కాంక్రీటు అడవిలో మనోల్లాసాన్నిచ్చే పచ్చదనం ఉంటే చాలని గతంలో అనుకునే వారు. రసాయన అవశేషాల్లేని ఆహారం కూడా నగరంలోనే పండించుకొని తాజా తాజాగా వండుకు తినటం అలవాటు చేసుకుంటున్నారు. పర్యావరణ స్పృహతో పాటు అమృతాహార స్పృహ తోడైందన్నమాట! సిటీ ఫార్మింగ్ అనేది ఒక పట్టణ/నగరంలో ఖాళీ స్థలాల్లో, మేడలపైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పెంచడం. సాధారణంగా పెరటి తోటలు, కంటైనర్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్ ద్వారా పండించి.. ఇంటిపట్టున వండుకోవటం లేదా ఆ దగ్గర్లో వారికి అందించటం దీని లక్ష్యం. అయితే, న్యూయార్క్ నగరంలో సిటీ ఫార్మింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆరోగ్యాభిలాషులు వేలాదిగా తమ సొంత మేడల పైన, ప్రభుత్వ/ప్రైవేటు ఖాళీ స్థలాల్లో సేంద్రియ ఇంటి పంటలు పండించుకుంటున్నారు. న్యూయార్క్ నగరపాలకులు నాలుగేళ్ల క్రితమే ఈ ట్రెండ్‌ను పసిగట్టి ప్రోత్సాహానికి చట్టాలు చేశారు. ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి ఔత్సాహికులకు అన్ని రకాలుగా చేయూతనిస్తున్నారు. వేలాది వ్యక్తిగత, కమ్యూనిటీ కిచెన్ గార్డెన్స్ పుట్టుకురావడానికి ఈ చర్యలు దోహదపడ్డాయి. అంతేకాదు.. సిటీ ఫార్మింగ్ ద్వారా అమృతాహారోత్పత్తి భారీ వ్యాపారావకాశంగా మారిపోయింది. భారీ వాణిజ్య సముదాయ విస్తారమైన బహుళ అంతస్తుల సువిశాల భవనాలపైన ఎకరాలకు ఎకరాల్లోనే ‘అత్యాధునిక అర్బన్ పొలాలు’ మట్టితో సహా ప్రత్యక్షమవుతున్నాయి. ఎడాపెడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సైతం సేంద్రియంగా పండించేసి.. అక్కడికక్కడే ఖరీదైన రెస్టారెంట్లు, హోటళ్లలో వండి వార్చుతున్నారు. చిల్లర దుకాణదారులకు విక్రయిస్తున్నారు. మేడల మీద మట్టి పొలాలను సృష్టించే సర్వీస్ ప్రొవైడర్లూ పుట్టుకొచ్చాయి. అటువంటి సంస్థల్లో ముఖ్యమైనది ‘బ్రూక్లిన్ గ్రేంజ్ రూఫ్‌టాప్ ఫామ్’. ఎంతో గౌరవం.. థ్రిల్ కూడా! నగరాల్లో నివసిస్తున్నప్పటికీ ప్రకృతితో సంబంధాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. వాతావరణ మార్పులు విసిరే పెను సవాళ్లను ఎదుర్కోవడంలో.. మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో పట్టణంలోని ఆకుపచ్చని ప్రదేశాలు కీలక పాత్ర పోషిస్తాయి. కర్బన ఉద్గారాలు, అధిక ఉష్ణోగ్రతలు, మురుగు నీరు వంటి సమస్యలతో సతమతమవుతున్న మన నగరాలకు సిటీ ఫామ్స్ ఊరటనిస్తాయి. అంతేకాదు, మనుషుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ పనిచేయడం మాకు ఎంతో గౌరవం, థ్రిల్ కూడా! – గ్వెన్ షాంట్జ్, సహ వ్యవస్థాపకురాలు, క్రియేటివ్ డైరెక్టర్, బ్రూక్లిన్ గ్రేంజ్ రూఫ్‌టాప్ ఫామ్స్, న్యూయార్క్ బ్రూక్లిన్ గ్రేంజ్ ద గ్రేట్! బ్రూక్లిన్ గ్రేంజ్ సంస్థ బ్రూక్లిన్, క్వీన్స్‌లో గత పన్నెండేళ్లలో మూడు భారీ వాణిజ్య భవనాలపైన రూఫ్‌టాప్ ఫామ్‌లను నెలకొల్పి కూరగాయలు, ఆకుకూరలను పండిస్తోంది. ఇవి చిన్నా చితకా ఫామ్స్ కాదండోయ్.. మూడూ కలిపి 5.7 ఎకరాలు! బ్రూక్లిన్ గ్రేంజ్ సంస్థ ఆరంతస్థుల ‘లాంగ్ ఐలాండ్ సిటీ’ వాణిజ్య భవనంపై ఎకరం విస్తీర్ణంలో 2010లో తొలి సిటీ ఫామ్‌ను నిర్మించింది. ప్రత్యేకంగా తయారు చేసుకున్న టన్నులకొద్దీ సేంద్రియ మట్టి మిశ్రమాన్ని భవనం శ్లాబ్‌పై పరిచి.. ఎత్తుమడులపై ఉద్యాన పంటలు పండిస్తోంది. వాన నీటి మొత్తాన్నీ వొడిసిపట్టుకొని, ఆ నీటితోనే పంటలు పండిస్తున్నారు. 2012లో 12 అంతస్తుల బ్రూక్లిన్ నేవీ యార్డ్ భవనంపై 1.5 ఎకరాల్లో సిటీ ఫామ్‌ను నెలకొల్పింది. 2019లో విస్తారమైన సన్‌సెట్ పార్క్ భవనంపై ఏకంగా 3.2 ఎకరాల్లో మట్టి పోసి పంటలు పండిస్తోంది. ఏటా 22,000 కిలోల సేంద్రియ కూరగాయల దిగుబడి పొందటం విశేషం. న్యూయార్క్ మాదిరిగానే అనేక ప్రపంచ నగరాలు నవతరం ఆహారోత్పత్తి కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి! – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com చదవండి: భారీ వర్షాలు.. ఇంటి పంటలు.. ఎత్తు మడులు ఎంతో మేలు! -
కోవిడ్ ప్రమాద ఘంటిక వేళ... సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవుతున్న నగరవాసులు
సాక్షి హైదరాబాద్: ఒకవైపు కోవిడ్ ప్రమాద ఘంటికలు. మరోవైపు కలిసొచ్చిన సంక్రాంతి సెలవులు. నగరవాసులు బతుకుజీవుడా అంటూ పల్లెబాట పడుతున్నారు. పిల్లలకు సెలవులు మొదలవడంతో సొంతూరుకు ప్రయాణాలు పెరిగాయి. పది రోజుల పాటు ఊరిలో ప్రశాంతంగా ఉండవచ్చనే ఉద్దేశంతో చాలా మంది తరలివెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టవచ్చనే ఆశావహ దృక్పథంతో బయలుదేరుతున్నారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. నగర శివార్లలోని పలు కూడళ్లు సైతం ప్రయాణికులతో పోటెత్తాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలామంది సొంత వాహనాలపై తరలి వెళ్లారు. ఒక్కసారిగా పెరిగిన వాహనాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. మరో వారం రోజుల పాటు సంక్రాంతి ప్రయాణాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. రైళ్లలో పెరిగిన రద్దీ.. కొంతకాలంగా తప్పనిసరి ప్రయాణాలు, సాధారణ రాకపోకలతో కనిపించిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ఒక్కసారిగా రద్దీగా పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు, పాట్నా, ముంబై తదితర ప్రాంతాలకు బయలుదేరిన రైళ్లలో రిజర్వేషన్ బోగీలతో పాటు జనరల్ బోగీలు సైతం కిక్కిరిశాయి. సాధారణ రోజుల్లో సుమారు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా శనివారం మరో 25 వేల మంది అదనంగా బయలుదేరినట్లు రైల్వే అధికారులు అంచనా వేశారు. ఏపీ, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లతో పాటు, ఉత్తరాది రైళ్లలోనూ రద్దీ పెరిగింది. బస్స్టేషన్లలో సందడి.. ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సులు ప్రయాణికులతో నిండుగా బయలుదేరాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సందర్భంగా 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ బస్సుల్లోనే ఎక్కువ మంది తరలివెళ్లారు. ఒకటి, రెండు రోజుల్లో పండుగ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారుల అంచనా. మరోవైపు నగర శివార్లలోనూ అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, మెహిదీపట్నం, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, బీహెచ్ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలా మంది సొంత బైక్‌లు, కార్లలో ఊళ్లకు బయలుదేరారు. సిటీలో పెరిగిన ట్రాఫిక్.. వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో నగరంలోని అనేక చోట్ల ట్రాఫిక్ ర ద్దీ నెలకొంది. ఉప్పల్– వరంగల్, సికింద్రాబాద్–బేగంపేట్, అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్–ఎల్బీనగర్, మెహిదీపట్నం, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ చోటుచేసుకుంది. -
నగరవాసులు పల్లెబాట..
సాక్షి, హైదరాబాద్: నగరవాసిని వాన పొమ్మంది.. పల్లె రమ్మంది.. ఇక్కడుంటే దండగ.. అక్కడైతే పండుగ.. అని పల్లె మూలాలున్న నగరవాసులు భావిస్తున్నారు. వారం, పదిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బెంబేలెత్తిన నగరవాసులు బుధవారం పల్లెబాట పట్టారు. బతుకమ్మ, దసరా వేడుకల కోసం సొంతూరుకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు, రైళ్లలో రద్దీ కనిపించింది. కరోనా మహమ్మారి కారణంగా ఆరు నెలలకుపైగా స్తంభించిన జనజీవనం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితికి చేరుకుంటున్న తరుణంలో భారీ వర్షాలు నగరాన్ని ముంచెత్తాయి. వరదలతో కాలనీ, బస్తీలు నీటమునిగాయి. బుధవారం తెల్లవారుజామున సైతం కురిసిన వర్షం ఉదయం తగ్గుముఖం పట్టింది. దీంతో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్ల నుంచి ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సుల్లోనూ రద్దీ పెరిగింది. వర్షాలు పూర్తిగా తగ్గుముఖంపడితే మరో రెండు, మూడు రోజులపాటు వివిధ ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని అన్ని జిల్లాలకు ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలను రూపొందించారు. అరకొర రైళ్లే... ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కోవిడ్ కారణంగా రెగ్యులర్ రైళ్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు మాత్రమే వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని మరో 15 రైళ్లు ఏర్పాటు చేశారు. కానీ, డిమాండ్ ఎక్కువగా ఉండే విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాలకు ఉన్న రైళ్లు చాలా తక్కువ. ఇప్పటికే అన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా నమోదైంది. కొన్ని రైళ్లలో సంక్రాంతి వరకు కూడా రిజర్వేషన్లు బుక్ అయ్యాయి. ఒకవైపు రైళ్ల కొరత, మరోవైపు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రైవేట్ బస్సులు, కార్లు తదితర వాహనాలకు గిరాకీ భారీగా పెరిగింది. ఇదే సమయంలో చార్జీల భారం సైతం రెట్టింపైంది. ప్రైవేట్ బస్సుల దోపిడీ తెలంగాణ, ఏపీ మధ్య ఆర్టీసీ అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు పునరుద్ధరించకపోవడంతో ప్రైవేట్ ఆపరేటర్లు పండుగ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, గుంటూరు, ఏలూరు, కాకినాడ, విశాఖ, కడప, చిత్తూరు, తిరుపతి, కర్నూలు ప్రాంతాల ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడకు సాధారణరోజుల్లో రూ.350 వరకు ఉంటే ఇప్పుడు రూ.550కిపైగా చార్జీ వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సాధారణ రోజుల్లో కాకినాడ, విశాఖ వంటి దూరప్రాంతాలకు ఏసీ బస్సుల్లో రూ.900 వరకు చార్జీ ఉంటుంది. ఇప్పుడు అది రూ.1,650 దాటింది. -
ఎండలు బాబోయ్
సోమవారం 40నిఛి ఉష్ణోగ్రత - నడివేసవిని తలపిస్తున్న వాతావరణం - అల్లాడిపోతున్న జనం విజయవాడ : నగరంలో ఎండలు నడివేసవిని తలపిస్తున్నాయి. నాలుగు రోజులుగా భానుడు ఉగ్రరూపం దాల్చి ప్రతాపం చూపుతున్నాడు. సోమవారం నగరంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో నగరవాసులు అల్లాడిపోయారు. వడగాలులకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. దీనికితోడు ఉక్కపోత కూడా తోడవడంతో చిన్నారులు, వృద్ధులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండవేడిమి ఉధృతంగా ఉంటోంది. సోమవారం నగరంలో 40 డిగ్రీల గరిష్ట, 26.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 38.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరవాసులు అత్యవసర పనులుంటేనే బయటకు వస్తున్నారు. -
సిటీ..పిటీ
-ముంచెత్తుతున్న మురుగు - కొద్దిపాటి వర్షానికే నగరం జలమయం - టెండర్ల దశ దాటని బుడమేరు - స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి విడుదల కాని నిధులు - నగరవాసులకు తప్పని తిప్పలు విజయవాడ సెంట్రల్ : పేరు గొప్ప.. ఊరు దిబ్బ చందంగా తయారైంది నగరం పరిస్థితి. చిన్నపాటి వర్షాలకే నగరం తటాకాన్ని తలపిస్తోంది. మురుగు ముంచెత్తుతోంది. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరం జలమయమైంది. రోడ్లపై దారితెలియక పలువురు వాహన చోదకులు, పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. ఏళ్లతరబడి కొనసా...గుతున్న నిర్మాణ పనులు, అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థ నగర వాసుల పాలిట శాపంలా పరిణమించాయి. డ్రెయిన్లలో డీ సిల్టింగ్ పనుల్ని సకాలంలో పూర్తి చేయడంలో అధికారులు విఫలమయ్యారు. బుడమేరు ముంపు నివారణకు సంబంధించి రూ.47.59 కోట్లు విడుదలైనా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన రూ.462 కోట్లలో తొలి విడత రూ.110 కోట్లను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. పూర్తికాని పూడికతీత నగరపాలక సంస్థ అధికారులు ఈ ఏడాది రూ.1.28 కోట్లతో డీ సిల్టింగ్ పనులు చేపట్టారు. ప్రజారోగ్య, ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతల్ని అప్పగించారు. జూన్ ఒకటి నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 34 మేజర్ డ్రెయిన్లలో పూడికతీత పనులు పూర్తయ్యాయి. మీడియం, మైనర్ డ్రెయిన్లలో పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్రెయిన్లలో మురుగు రోడ్లపై పొంగిపొర్లుతోంది. వన్‌టౌన్, వించిపేట, కొత్తపేట, గవర్నర్‌పేట, సూర్యారావుపేట, మొగల్రాజపురం, పటమట, ఆటోనగర్ ప్రాంతాల్ని మురుగు ముంచెత్తింది. భవానీపురం, హౌసింగ్ బోర్డు కాలనీ, ఎన్ఎస్సీ బోస్ నగర్ (కండ్రిక), జక్కంపూడి కాలనీ ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడక తప్పడం లేదు. అస్తవ్యస్తం నగరంలో మురుగు పోయేందుకు నగరంలో సరైన ప్రణాళిక లేదు. భూగర్భ డ్రెయినేజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఓపెన్ డ్రెయిన్ల నిర్వహణ అంతంత మాత్రంగా ఉంది. డ్రెయిన్ల ద్వారా వచ్చే మురుగునీటిలో కొంత భాగాన్ని బుడమేరు, కృష్ణానదుల్లో కలుపుతున్నారు. మిగిలిన నీటిని బందరు, ఏలూరు, రైవస్ కాల్వల్లోకి మళ్లిస్తున్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా భూగర్భ డ్రెయినేజీని అందుబాటులోకి తెచ్చేందుకు రూ.271.48 కోట్లు కేటాయించారు. 2015 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం కాాగా, అనేక ప్రాంతాల్లో ఇంకా పనులు కొన..సాగుతూనే ఉన్నాయి. భూగర్భ డ్రెయినేజీకి అనుసంధానమైన సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి. పనులు జరిగితేనే.. బుడమేరు ముంపు నివారణ, స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణ పనులు పూర్తయితే కానీ నగర వాసులకు వరద కష్టాలు తప్పవు. బుడమేరు ముంపు నివారణకు సంబంధించి రూ.47.59 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.9 కోట్లను స్థల సేకరణకు సంబంధించి రైల్వే అధికారులకు చెల్లించారు. మిగిలిన మొత్తంతో సర్కిల్-1, 2 ప్రాంతాల్లో పనులు చేపట్టేందుకు టెండర్లు పిలవనున్నారు. స్ట్రాం వాటర్ డ్రెయిన్ల నిర్మాణానికి కేంద్రం రూ.461.04 కోట్లు మంజూరు చేసింది. నగరాన్ని ఆరు జోన్లుగా విభజించి 100 కి.మీ. మేర పెద్ద డ్రెయిన్లు, 38 కి.మీ. మేర చిన్న డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. గుంటుతిప్ప, ప్రసాదంపాడు, పుల్లేరు డ్రెయిన్ల వద్ద రోడ్ల విస్తరణకు ప్రతిపాదనలు రూపొందించారు. మూడేళ్లలో నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఈ ఏడాది రూ.110 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఈ డ్రెయిన్ల నిర్మాణం పూర్తయితే నగరానికి వరద ముంపు తిప్పలు తప్పినట్లే.