సాక్షి హైదరాబాద్: ఒకవైపు కోవిడ్ ప్రమాద ఘంటికలు. మరోవైపు కలిసొచ్చిన సంక్రాంతి సెలవులు. నగరవాసులు బతుకుజీవుడా అంటూ పల్లెబాట పడుతున్నారు. పిల్లలకు సెలవులు మొదలవడంతో సొంతూరుకు ప్రయాణాలు పెరిగాయి. పది రోజుల పాటు ఊరిలో ప్రశాంతంగా ఉండవచ్చనే ఉద్దేశంతో చాలా మంది తరలివెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టవచ్చనే ఆశావహ దృక్పథంతో బయలుదేరుతున్నారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా కనిపించాయి. నగర శివార్లలోని పలు కూడళ్లు సైతం ప్రయాణికులతో పోటెత్తాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలామంది సొంత వాహనాలపై తరలి వెళ్లారు. ఒక్కసారిగా పెరిగిన వాహనాలతో నగరంలోని అనేక ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. మరో వారం రోజుల పాటు సంక్రాంతి ప్రయాణాల రద్దీ కొనసాగే అవకాశం ఉంది.
రైళ్లలో పెరిగిన రద్దీ..
కొంతకాలంగా తప్పనిసరి ప్రయాణాలు, సాధారణ రాకపోకలతో కనిపించిన సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లలో ఒక్కసారిగా రద్దీగా పెరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు, పాట్నా, ముంబై తదితర ప్రాంతాలకు బయలుదేరిన రైళ్లలో రిజర్వేషన్ బోగీలతో పాటు జనరల్ బోగీలు సైతం కిక్కిరిశాయి. సాధారణ రోజుల్లో సుమారు 1.8 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా శనివారం మరో 25 వేల మంది అదనంగా బయలుదేరినట్లు రైల్వే అధికారులు అంచనా వేశారు. ఏపీ, బెంగళూరు వైపు వెళ్లే రైళ్లతో పాటు, ఉత్తరాది రైళ్లలోనూ రద్దీ పెరిగింది.
బస్‌స్టేషన్లలో సందడి..
ఏపీ వైపు వెళ్లే అన్ని బస్సులు ప్రయాణికులతో నిండుగా బయలుదేరాయి. మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ బస్‌స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సందర్భంగా 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెగ్యులర్ బస్సుల్లోనే ఎక్కువ మంది తరలివెళ్లారు. ఒకటి, రెండు రోజుల్లో పండుగ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారుల
అంచనా. మరోవైపు నగర శివార్లలోనూ అనూహ్యంగా రద్దీ పెరిగింది. ఉప్పల్ క్రాస్‌రోడ్స్, ఎల్‌బీనగర్, మెహిదీపట్నం, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్ తదితర ప్రాంతాల నుంచి దూరప్రాంతాలకు రాకపోకలు పెరిగాయి. బస్సులు, ప్రైవేట్ వాహనాలతో పాటు చాలా మంది సొంత బైక్‌లు, కార్లలో ఊళ్లకు బయలుదేరారు.
సిటీలో పెరిగిన ట్రాఫిక్..
వాహనాల రాకపోకలు ఒక్కసారిగా పెరగడంతో నగరంలోని అనేక చోట్ల ట్రాఫిక్ ర ద్దీ నెలకొంది. ఉప్పల్– వరంగల్, సికింద్రాబాద్–బేగంపేట్, అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్–ఎల్‌బీనగర్, మెహిదీపట్నం, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment